అయ్యో.. పాపం
- ఫిట్స్‌తో తల్లి మృతి: కూతురు అదృశ్యం
- మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఏడాది బాబు
నాగోలు: భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మహిళకు ఫిట్స్ వచ్చి కిందపడి మృతి చెందింది. తల్లి మృతదేహం పక్కనే ఏడాదిన్నర బాలుడు ఏడుస్తూ ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... బేగంపేట పోలీస్‌లైన్‌కు చెందిన ఐలేని రాజేశ్వరి (24), మహేష్ భార్యాభర్తలు. వీరు నాచారం మల్లాపూర్‌లోని నర్సింహ్మనగర్ కాలనీలో ఉంటున్నారు. భర్త పెయింటర్. శివాని (5), కార్తీక్ ( ఏడాదిన్నర )వీరి సంతానం.
ఈనెల 24న భర్తతో గొడవపడిన రాజేశ్వరి ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ వద్ద కార్తీక్‌తో కలిసి నడుచుకూంటూ వెళ్తూ కిందపడి చేతులు, కాళ్లు కొట్టుకోవడంతో స్థానికులు ఫిట్స్ వచ్చిందని గమనించి తాళంచెవులు చేతిలో పెట్టి 108కు తెలిపారు. 108 వాహనం వచ్చేసరికి రాజేశ్వరి చనిపోయింది. పక్కనే ఉన్న బాబు కార్తీక్ తల్లి మృతి చెందిన విషయం తెలియక మీదపడి రోదించాడు. ఎల్బీనగర్ పోలీసులు.. రాజేశ్వరి వద్ద లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. భర్త మహేష్ మాత్రం రాజేశ్వరికి ఇంతకు ముందు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, విషం తాగి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
కూతురు అదృశ్యం..
రాజేశ్వరి వెంట వచ్చిన కూతురు శివాని అదృశ్యమైంది. దీంతో భర్త మహేష్, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల ముందు నాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.