Elephant Killed 70-Year-Old Woman In Odisha, Returns To Attack Her Body At Funeral - Sakshi
Sakshi News home page

తొక్కి చంపినా ఏనుగు కోపం చల్లారలేదా? భర్త ఆత్మ చేసిన పనట?!

Jun 12 2022 3:32 PM | Updated on Jun 12 2022 4:21 PM

Husband Soul Revenge: Elephant Kills Odisha Woman Later Her Corpse - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన ఓ ఏనుగు ఆమెను తొక్కి చంపింది. కానీ, కసి తీరకపోవడంతో..

నమ్మకం మనిషికి బలం.. మూఢనమ్మకం బలహీనత. కళ్ల ముందు ఏదైనా ఊహించని ఘటన జరిగితే.. అక్కడేదో ఉందనుకునే జనాలే మన చుట్టూరా ఎక్కువ!. అలాంటిదే ఈ ఘటన. ఆవేశంతో ఉన్న ఓ ఏనుగు ఓ మహిళను తొక్కి చంపడమే కాదు.. అంత్యక్రియలకు వచ్చి మరీ మళ్లీ మృతదేహంపై తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఇదంతా చూసినవాళ్లు.. చనిపోయిన ఆమె భర్తే కారణమంటూ ప్రచారం మొదలుపెట్టారు. 

ఒడిశా బరిపదాలోని రాయ్‌పల్‌ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది మయ ముర్మూ(70). మంచి నీటి కోసం  గురువారం పంపు మోటర్‌ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో దాల్మా వైల్డ్‌లైప్‌ శాంక్చురీ నుంచి పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. 

ఈలోపు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు దూరపు బంధువులు. ఊరేగింపు తర్వాత.. ముర్మూ మృతదేహాన్ని చితి మీద ఉంచారు. అయితే అదే సమయంలో మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమైంది అదే ఏనుగు. దీంతో జనాలంతా చెల్లాచెదురైపోయారు. ఈసారి చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి కిందపడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసి.. అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. 

ఈ ఘటనతో అక్కడున్నవాళ్లంతా భయానికి లోనయ్యారు. కాసేపు అయ్యాక వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు. మయ ముర్మూ భర్త ఏడేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆ పెద్దాయనకు భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ఒకటి ఊరిలో వినిపిస్తుందట. ఆ భర్తే ఆత్మగా మారి.. ఆ ఏనుగు ద్వారా ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని, అందుకే గ్రామస్తుల జోలికి రాకుండా ఆ ఏనుగు వెళ్లిపోయిందంటూ ఊరు ఊరంతా ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగు ప్రకోపానికి కారణం ఏదైనా ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement