అమెరికా: అమెరికాలో తన భర్త హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళ చేసిన తప్పుని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పిదాలు చేసింది. ఫలితంగా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది. నేరారోపణ ఎదుర్కొంటున్న సమయంలో ఆమె చేసిన గూగుల్ సెర్చులు చూస్తే ఎంతటి వారైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తాజాగా ఆమె కేసు విచారణ చేస్తున్న న్యాయస్థానం కూడా ఆమె గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి నివ్వెరపోయింది.
సైలెంటుగా చంపి..
2022, మార్చి నెలలో కౌరీ రిచిన్స్ అనే ఒక మహిళ తన భర్త ఎరిక్ రిచిన్స్ హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కుంటోంది. ఎరిక్ చనిపోయిన రోజున తనకు వోడ్కా తాగాలనుందని అడిగితే స్వయంగా తానే ఒక పెగ్ వోడ్కా కలిపి ఇచ్చానని, తర్వాత కొద్దిసేపటికి చూస్తే చలనం లేకుండా పడి ఉన్నాడని, ముట్టుకుంటే అతని శరీరం చాలా చల్లగా కూడా ఉందని పోలీసులకి ఫిర్యాదు చేసింది కౌరీ.
తీగ లాగితే..
అయితే పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం పంపించగా అతని శరీరంలోకి ప్రమాదకరమైన ఫెంటానైల్ అధిక డోసేజులు ఇంజెక్ట్ చేయడం కారణంగానే ఎరిక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తర్వాత పోలీసుల సహజశైలిలో విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో కౌరీపైన కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉండగా ఆమె గూగుల్లో తనకున్న అనేక సందేహాలను వెతకడం ప్రారంభించింది.
సెర్చ్ హిస్టరీ..
కౌరీ రిచిన్స్ గూగుల్లో ఏమేమి వెతికిందంటే..
ఉటా శిక్షా స్మృతులు ఎలా ఉంటాయి?
జీవిత బీమా కంపెనీలు డబ్బులివ్వడానికి ఎంత సమయం పడుతుంది?
అమెరికాలో ధనిక మహిళలను ఉంచడానికి విలాసవంతమైన జైళ్లున్నాయా?
చనిపోయిన వ్యక్తి మరణానికి కారణాలు ఆలస్యమైతే పరిస్థితి ఏంటి?
చనిపోయిన వ్యక్తి మరణానికి కారణం మార్చితే పరిస్థితి ఏమిటి?
విచారణ ఎదుర్కునే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి?
పోలీసులు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే తీరు ఎలా ఉంటుంది?
అని ఇలా ఆమెకున్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గూగుల్ ని ఆశ్రయించింది.
బయట ఉంటే ప్రమాదం..
ఇప్పుడిదే సెర్చ్ హిస్టరీ ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది. సోమవారం జరిగిన నేర విచారణలో న్యాయస్థానం ఆమె సెర్చ్ హిస్టరీ చూసిన తర్వాత ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో ఉందని ఆమె వలన సమాజానికి కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి వెంటనే ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా..
Comments
Please login to add a commentAdd a comment