
మృతుల కుమార్తె రాశీ
♦ భర్త భాధ చూసి భార్య, భార్య లేదని
♦ తెలిసి భర్త బలవన్మరణం
♦ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఆత్మహత్యలు
బెట్టింగ్ భూతం రెండు ప్రాణాల్ని బలి కోరింది. చిన్నపాటి ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటున్న యువకుడు బెట్టింగ్‌లో దిగి సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యాడు. ఆర్థికభారం చూసి భార్య కలత చెంది బలవన్మరణానికి పాల్పడింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారిద్దరి ఏకైక కుమార్తెకు మాత్రం తల్లిదండ్రుల ఎడబాటు జీవితకాలం శిక్ష విధించింది.
పట్నంబజారు(గుంటూరు) : నగరంలోని వసంతరాయపురంలో నివాసం ఉంటున్న నరసరావుపేటకు చెందిన పోక శ్రీకాంత్ (28)కి మూడు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నకూరుకు చెందిన రాజేశ్వరి (25)తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె(రాశీ). ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా, జ్యూస్ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. ఉన్నట్టుండి శ్రీకాంత్‌కు క్రికెట్ బెట్టింగ్‌ల వైపు ఆకర్షితుడయ్యాడు. రూ.20 లక్షల వరకూ అప్పులు చేశాడు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఆర్థిక భారాన్ని మోస్తూ ఉండటం చూసి భార్య కలత చెందింది.
ఇటీవల వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెట్టడంతో శ్రీకాంత్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ పరిస్థితి చూసి మనస్తాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం పురుగులమందు తాగింది. అపస్మాక స్థితిలో ఉన్న భార్యను చూసిన శ్రీకాంత్ ఆమెను ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మార్చురీలో భార్య శవం ఉండగానే బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన శ్రీకాంత్ తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. ఇద్దరి మరణం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.