వ్యాధి మూలాలు గుర్తించకపోవడం శోచనీయం
వ్యాధి మూలాలు గుర్తించకపోవడం శోచనీయం
Published Sun, Sep 25 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
చింతూరు :
కాళ్ల వాపు వ్యాధితో ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు వ్యాధి మూలాలను గుర్తించకపోవడం శోచనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. చింతూరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖా మంత్రి వచ్చి తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోవడాన్ని తప్పుబట్టారు. వైద్యం కోసం అల్లాడుతున్న గిరిజనులకు భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్యశాఖా మంత్రి ఇంతవరకూ వ్యాధి ప్రబలిన గ్రామాల్లో పర్యటించక పోవడం దారుణమన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే గిరిజనుడే ఆ శాఖకు మంత్రిగా ఉండాలని ఆమె అన్నారు. రాష్ట్రస్థాయిలో గిరిజన సలహా మండలిని నియమించాలని తమ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఆధ్వర్యంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం ఇంతవరకు నియమించలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళ్లవాపుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తగదన్నారు. తక్షణమే వారి కుటుంబాలకు రూ 10 లక్షలతో పాటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. చింతూరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోతో పాటు సిబ్బందిని కూడా నియమించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
పాఠశాలల సందర్శన
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆదివారం చింతూరు బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గదులు కురుస్తున్నాయని, ఆవరణలోని వర్షపు నీరు గదుల్లోకి వస్తోందని, మరుగుదొడ్లు సరిగా లేవని, యూనిఫాం ఇవ్వలేదని, ఫ్యాన్లు లేకపోవడంతో దోమలు కుడుతున్నాయని కస్తూర్బా విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. అనంతరం ఆమె ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోయం అరుణ, వైస్ ఎంపీపీ పండా నాగరాజు, ఎంపీటీసీ సభ్యుడు సోడె బాయమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement