ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది | ACB trap revenue staff | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది

Published Tue, Aug 19 2014 12:34 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB trap revenue staff

డోన్‌టౌన్: డోన్‌లో సోమవారం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన మేరకు..డోన్ మండలం నక్కలవాగుపల్లె గ్రామ డీలర్ చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ దుకాణాన్ని 20 రోజుల క్రితం ఆర్‌ఐ రాజేశ్వరి, వీఆర్వో రాజు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 మొదటి దఫాగా డీలర్ రూ.5 వేలు చెల్లించాడు. ఆ తర్వాత డిప్యూటీ తహశీల్దార్ జయంతికి కూడా రూ.15 వేలు ఇవ్వాలని, లేదంటే లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విసిగిపోయిన డీలర్ చంద్రశేఖరరెడ్డి తన సోదరుడు రమణారెడ్డితో కలసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం డీలర్ నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా డీటీ, ఆర్‌ఐ, వీఆర్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆర్‌ఐ రాజేశ్వరి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించిన రంగు నీళ్ల సీసాను అధికారుల కళ్లెదుటే ధ్వంసం చేసి కార్యాలయంలోని మరో వాకిట్లో పరారయ్యేందుకు యత్నించగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో సీఐలు ప్రసాద్‌రావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా.. పౌరసరఫరాల శాఖ గోదాములో సరుకుల రవాణాపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement