తొలి గురువులకు మలిపాఠం | The first masters malipatham | Sakshi
Sakshi News home page

తొలి గురువులకు మలిపాఠం

Published Wed, Apr 2 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

తొలి గురువులకు మలిపాఠం

తొలి గురువులకు మలిపాఠం

నేను సైతం..
 
పిల్లలకు తల్లిదండ్రులే తొలిగురువులు అన్నారు. నిజమే...ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానాన్నల మాటలు, ప్రవర్తన, అలవాట్లు... ఇలా చెప్పుకుంటూపోతే అన్నింటిలో వారి ప్రభావం పిల్లలపై ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, అవసరమైతే అప్పులు చేసి చదివిస్తున్న ఎంతోమంది తల్లిదండ్రులు తమ ప్రవర్తన వల్ల ఇబ్బందిపడుతున్న పిల్లల మనసుల గురించి ఆలోచించడం లేదని ఆవేదన పడతారు అనంతపురానికి చెందిన టీచర్ నల్లారి రాజేశ్వరి. ఓ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోకుండా... వారి తల్లిదండ్రులకు ఉచిత కౌన్సెలింగ్‌లు ఇస్తూ తన వంతు సాయం చేస్తున్నారు రాజేశ్వరి.
 
 పిల్లలు చదువుకోబోయే పాఠశాల ఎంత విశాలంగా ఉండాలి,  ఎంత శుభ్రంగా ఉండాలి, ఉపాధ్యాయుల బోధన బాగుంటుందా లేదా... ఇలా సవాలక్ష విచారణల తర్వాత గాని బిడ్డను స్కూల్లో చేర్పించడం లేదు. ‘మరి మీరెలా ఉంటున్నారు? మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది?’ అని విద్యార్థుల తల్లిదండ్రుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాజేశ్వరి టీచర్. ‘‘నాలుగో తరగతిలో ఒకబ్బాయి చాలా చురుగ్గా ఉండేవాడు. బాగా చదువుతాడు కూడా. ఉన్నట్టుండి నిరాశతో నీరసంగా అయిపోయాడు. నేను చాలా దగ్గరగా గమనించి వాళ్ల అమ్మానాన్నలకు కబురు పంపాను. అబ్బాయి తల్లి వచ్చింది. ఎంతసేపు మాట్లాడినా అసలు విషయం చెప్పలేదు.

చివరికి తన కష్టాలు చెప్పింది. రోజు సాయంత్రమయ్యేసరికి తన భర్త తాగొచ్చి ఇంట్లో గోల చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి ప్రవర్తన కారణంగా పిల్లాడిలో చురుకుదనం పోయి ఏదో నలతపడ్డవాడిలా కనిపిస్తున్నాడని చెప్పింది. ఆ తల్లి మాటలు వినగానే నా మనసు గందరగోళంలో పడిపోయింది. అప్పటికి ఆమెకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి పంపించేశాను. తర్వాత పిల్లల తల్లిదండ్రులకు ‘ఇంటి వాతావరణం’ పై కౌన్సెలింగ్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాను’’ అని చెప్పారు రాజేశ్వరి. అనంతపురం  రాంనగర్‌లోని పాఠశాలలో ప్రతి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు.

 ఇతరులకు కూడా...

పేద విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తరగతులు నిర్వహిస్తున్న రాజేశ్వరి టీచర్ ఆదివారం మాత్రం కౌన్సెలింగ్‌లతో బిజీగా ఉంటారు. ఆమె కౌన్సిలింగ్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులే కాదు...చుట్టుపక్కల సమస్యలతో ఇబ్బందిపడుతున్న చాలామంది భార్యాభర్తలు వస్తుంటారు. ‘‘నా స్కూల్లో చాలామంది పిల్లల తల్లిదండ్రులు నా దగ్గర వారి సమస్యలు చెప్పుకుని పరిష్కారాలు తెలుసుకుని పిల్లల కోసం వారిని వారు మార్చుకున్నారు. తమ కోసం తాము మారని చాలామంది తల్లిదండ్రులు పిల్లలకోసం మారతారని నిరూపించారు.


 విషయాల్లో మారకపోయినా... పిల్లలకు కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నంతలో ప్రయత్నించారు. నా కౌన్సెలింగ్ గురించి తెలిసిన ఇతరులు కూడా నా దగ్గరకు రావడం మొదలుపెట్టారు. పిల్లలకు పాఠాలు చెప్పే నేను ఆదివారమయ్యేసరికి పెద్దలకు పాఠాలు చెప్పే సైకియాట్రిస్ట్‌గా  మారిపోవాల్సివస్తోంది. నేనే కాదు... ఉపాధ్యాయులెవరైనా సరే తెలిసింది చెప్పకుండా, వచ్చింది నేర్పకుండా ఉండలేరు కదా’’ అని నవ్వుతూ అన్నారు రాజేశ్వరి టీచర్. ఆమె లాంటి వారి అవసరం విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఉంది కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement