అనంతపురం సెంట్రల్ : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని యువజన కాలనీలో శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరికి లోకేష్(9), పృథ్వి(6) కుమారులు ఉన్నారు. బోరు లారీ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఇద్దరు కుమారులతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్నిచోట్ల వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో బాధితురాలి తల్లి లక్ష్మీదేవి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.