నాలుగు కప్పుల కాఫీతో పేగు క్యాన్సర్ దూరం
న్యూయార్క్: రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే పెద్దపేగు క్యాన్సర్‌ను తగ్గించడంలో సాయపడుతుందట. ఈ క్యాన్సర్ సోకకుండా కూడా కాఫీ నిరోధిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన రోగులకు వ్యాధి మూడో దశలోనూ ఈ వ్యాధిని తగ్గించేందుకు కాఫీ ఉపయోగపడుతుందని బోస్టన్‌కు చెందిన డానా ఫార్బర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. రోజూ రెండు, మూడు కప్పుల కాఫీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని వారు అన్నారు.
'వ్యాధి సంక్రమించి మూడో దశలో ఉండి శస్త్రచికిత్స లేదా కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ (దాదాపు 460 మిల్లీ గ్రాముల కెఫైన్) తాగడం వల్ల మేలు కలుగుతుంది. ఇలా కాఫీ తాగే వారు తాగనివారితో పోలిస్తే 42 శాతం ఎక్కువగా వ్యాధి నుంచి బయటపడ్డారు. 33 శాతం తక్కువగా రోగులు మరణించారు.' అని చార్లెస్ అనే పరిశోధకుడు చెప్పాడు. దాదాపు వెయ్యి మందికి పైగా రోగులను అధ్యయనం చేసి వారు ఈ ఫలితాలు వెల్లడించారు. కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం లేదని, త్వరగా కోలుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
యాస్పిరిన్‌తోనూ...
లండన్: వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న స్థూలకాయులు యాస్పిరిన్ వాడడం వల్ల ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. దీర్ఘకాలికంగా యాస్పిరిన్ వాడితే ప్రయోజనం ఉంటుందని ఇంగ్లండ్‌లోని పరిశోధకులు తెలిపారు.