Kurnool government hospital
-
ఓ తల్లి వేడుకోలు.. వెంటనే స్పందించిన సీఎం జగన్
జూపాడు బంగ్లా: అన్నా.. ఆపదలో ఉన్నా! నా కుటుంబం ఆపదలో ఉంది.. నా కుమారుడి ఆరోగ్యం సరిగా లేదు.. ఆదుకోవాలని సీఎం జగన్‌ను వేడుకున్న ఓ మహిళకు గంటల వ్యవధిలోనే తక్షణ సాయం అందింది. గురువారం నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ ఓ విద్యార్థి దీనస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న తన కుమారుడు యోగి (15) రెండు కిడ్నీలు పాడవటంతో ఆరోగ్యం క్షీణిస్తోందని చాకలి జయమ్మ అనే మహిళ సీఎం జగన్ ఎదుట కన్నీటిపర్యంతమైంది. జయమ్మకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న తహసీల్దార్ పుల్లయ్యయాదవ్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నామని, కిడ్నీ ఆపరేషన్ చేస్తే తన కుమారుడు బతుకుతాడని వైద్యులు చెప్పారని, అందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వాపోయింది. దీంతో స్పందించిన సీఎం జగన్ ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ శ్యామూన్ను ఆదేశించారు. ఈ మేరకు తక్షణ సాయంగా కలెక్టర్ రూ.లక్ష చెక్కును మంజూరు చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నందికొట్కూరు తహసీల్దార్ పుల్లయ్యయాదవ్ కిడ్నీ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. -
కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అనధికార వ్యక్తుల సంచారం అధికమైంది. వైద్య సిబ్బందిలాగా యూనిఫాం ధరించి వార్డులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఫిమేల్ వార్డుకు వైద్యపరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన వృద్ధురాలిని డబ్బులు ఇవ్వాలంటూ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వేధించారు. తన వద్ద డబ్బులు లేవంటూ వృద్ధురాలు బతిమిలాడినా వదిలిపెట్టలేదు. చివరికి వంద రూపాయలు ఇస్తానని వృద్ధురాలు చెప్పగా కనీసం రూ.150 ఇవ్వాలంటూ వేధించి మరీ తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రి అధికారులను విచారణకు ఆదేశించారు. అయితే వైద్య సిబ్బంది ముసుగులో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి సంబంధించిన వారు కాదని, బయటి వ్యక్తులని అధికారులు తేల్చారు. వారిపై మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు, డ్రస్ కోడ్ ధరించి ఉండాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: (ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు) -
రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొడ్డిదారులు వెతుక్కుంటూ డుమ్మా కొడుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని బయోమెట్రిక్ విధానం తీసుకువస్తే దానికి కూడా కొందరు వైద్యులు అడ్డదారులు వెతికారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని 12 మంది వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ఇతరులచే బయోమెట్రిక్ వేయించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వేలిముద్రలతో రబ్బర్ తొడుగులను తయారు చేయించి విధులకు హాజరు కాకుండా ఇతరులచే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించినట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. దొడ్డి దారిన హాజరు వేసిన 12 మంది వైద్యులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: (ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!) -
కర్నూలు: మహిళ అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి
కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన 10 కిలోల క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాలను శుక్రవారం గైనకాలజి విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిప్రణీత్ తెలిపారు. ఎమ్మిగనూరుకు చెందిన మదనమ్మ(65) అనే మహిళ ఐదు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 7వ తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజి విభాగంలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమె అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 23వ తేదిన ఆమెకు వైద్యులు సర్జరీ చేసి కణితి తొలగించారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వారిలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సి. సాయిప్రణీత్, గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుముద, పీజీ వైద్యురాలు డాక్టర్ సోనాలి, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ వి. శ్రీలత, డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌గౌడ్, డాక్టర్ ఎం. స్నేహవల్లి ఉన్నారు. -
విధులకు రాని వైద్యులకు నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో విధులకు రాని వైద్యుల విషయం చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు మూడు రోజులే వచ్చి మిగతా రోజులకు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నవారు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు తేలింది. దీనిపై ఆరా తీస్తున్న కొద్దీ విస్మయపరిచే అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 20 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు లేకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు వచ్చినట్టు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. విధులకు రాకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్నవారు 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ మెమో జారీ చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, కడప తదితర కాలేజీల్లో బయోమెట్రిక్ వేయకుండా విధులకు వచ్చినట్టు చూపిస్తున్నవారి విషయం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ (రిజిస్టర్) సంతకాలు కుదరవని, బయోమెట్రిక్ హాజరు ఉంటేనే వేతనం ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొంతమంది వైద్యులు బయోమెట్రిక్ హాజరు కోసం నమోదు కూడా చేయించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చాలామంది వైద్యులు ఎలాంటి సమాచారమూ లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారు. -
Lifestyle Diseases: లైఫ్ స్టైల్ మార్చుకో గురూ!
సాక్షి, అమరావతి: జీవనశైలి జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్నిటికంటే మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. ఇలాంటి జీవనశైలి జబ్బులకు బోధనాస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్ పేషెంట్ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాయనేది తెలుస్తుంది. అలా మన రాష్ట్రంలో గడచిన 5 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ) 1.30 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆస్పత్రుల వరకూ నమోదైన కేసులు అదనం. ఒత్తిడితో చిత్తవుతున్నారు ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ అత్యధికంగా 51 వేల మందికి పైగా బాధితులు మానసిక జబ్బుల కారణంగా ఔట్ పేషెంట్ సేవల కోసం ప్రభుత్వ పెద్దాస్పత్రులకు వచ్చినట్టు హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైంది. కొంతవరకూ కోవిడ్ కూడా ఒత్తిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను బట్టే ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల 35 ఏళ్లలోపు యువకులకు కూడా హార్ట్ స్ట్రోక్‌లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. డయాబెటిక్ బాధితుల సంఖ్య పెరగడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణమని వెల్లడైంది. ఎన్సీడీ జబ్బులపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి జబ్బులపై దృష్టి సారించింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులను ప్రాథమిక దశలో కనుక్కునేందుకు స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తున్నారు. మానసిక జబ్బులకు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మాత్రమే ఆస్పత్రి ఉంది. కొత్తగా కడపలో 100 పడకలతో మానసిక ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి వారికి అవగాహన కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. కోరికలు పెద్దవి.. ఆదాయం చిన్నది చిన్న వయసులోనే కోరికలు చాలా పెద్దవిగా ఉండటం.. దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇక చదువుల్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. మా దగ్గరకు ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే ఈ జబ్బులతో వస్తున్నారు. యువకుల్లో వచ్చే మానసిక రుగ్మతలకు తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభావం చూపిస్తుంది. –డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, కడప పట్టణీకరణ ప్రమాదంగా మారింది జనజీవనంలో పట్టణీకరణ ప్రతికూల మార్పులు తెస్తోంది. ముఖ్యంగా ఆహారంలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. దీనికితోడు వారిని ఒత్తిడి గుండెజబ్బుల వైపు నెడుతోంది. శారీరక వ్యాయామం, కూరగాయలతో కూడిన మంచి ఆహారం ద్వారా గుండెపోటును నివారించుకోవచ్చు. ముఖ్యంగా యువతలో మార్పు రావాలి. 90 శాతం మంది యువత వ్యాయామం లేక సతమతమవుతున్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే నష్టం కొనితెచ్చుకున్నట్టే. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
అమ్మకానికి ‘సెక్యూరిటీ’ పోస్టులు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు మళ్లీ అంగడి తెరిచారు. ఏజెన్సీ రద్దవుతున్న నేపథ్యంలో అందినకాడికి దండుకోవాలనే దుర్బుద్ధితో ఓ ఉద్యోగి సెక్యూరిటీ గార్డు పోస్టులను అమ్మకానికి పెట్టాడు. ఒక్కో పోస్టుకు రేటు విధించి మరీ అమ్మకాలు సాగించాడు. డబ్బు కట్టిన వారిలో మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల పేదలే అధికం. టీడీపీ హయాంలో భారీగా పెరిగిన ఖర్చు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు బాధ్యతను నాలుగేళ్ల క్రితం ఒకే సంస్థ నిర్వహించేది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరుగా టెండర్లు పిలిచి అనుకూలమైన వారికి కట్టబెట్టింది. అంతకు ముందు ఆసుపత్రిలో సెక్యూరిటీ, పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.18 లక్షల్లోపే ఖర్చయ్యేది. కానీ టెండర్ల తర్వాత రూ.70 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.80 లక్షలు దాటింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతను జై బాలాజీ సెక్యూరిటీస్ ఏజెన్సీ దక్కించుకుంది. రెండున్నర సంవత్సరాల క్రితమే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకొని ఒక్కో సెక్యూరిటీ గార్డు పోస్టును రూ.40వేల నుంచి రూ.80వేల వరకు అమ్ముకున్నారు. టెండరు మొత్తం అటు ఇటుగా... పెద్దాసుపత్రిలో 180 మంది సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికి రూ.7 వేలకు పైగా జీతం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రూ.12,60,000 అవుతుంది. కానీ జై బాలాజీ సంస్థ మాత్రం కేవలం రూ.1,80,000లకు కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. వాస్తవంగా ఈ మొత్తం కంటి ఆసుపత్రికి సరిపోతుంది. కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు పొరపాటు చేశారో లేక సంస్థ ప్రతినిధులు ఏమరుపాటుగా కోడ్ చేశారో తెలియదు గానీ టెండర్ మొత్తం అటు ఇటుగా మారింది. దీంతో నిర్వాహకులు ఏడాదికి పైగా జీతాలు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత పై స్థాయిలో మాట్లాడుకుని టెండర్ మొత్తాన్ని పెంచుకున్నారు. ఖాళీ పోస్టుల కోసం భారీగా వసూళ్లు .. ఆసుపత్రిలో జీతాలు సక్రమంగారాక, ఇష్టం లేక కొందరు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేశారు. దీనిని ఆసరాగా చేసుకుని ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను సృష్టించి మళ్లీ అంగట్లో పెట్టారు. ఈ మేరకు ఒక్కో పోస్టును డిమాండ్‌ను బట్టి రూ.80 వేల నుంచి రూ.1.30 లక్షలకు విక్రయించినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఏజెన్సీలో పనిచేసే కొందరు ఉద్యోగులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను వివరణ కోరితే పనిమానేసిన వారి స్థానంలో కొందరిని నియమించుకున్నట్లు సమాధానమిస్తున్నట్లు తెలిసింది. కాగా నెల రోజులుగా మొత్తం 35 మంది దాకా సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఐదు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు లేవు. ఉన్న వారికే జీతాలు లేని పక్షంలో కొత్తగా చేరిన వారికి ఎక్కడి నుంచి ఇస్తారని ప్రస్తుతం పనిచేస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ప్రభుత్వం రద్దు చేస్తుందనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్లుగా ఏజెన్సీ నిర్వాహకులు పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కర్నూలు ఆసుపత్రి చరిత్రలో మరో మైలురాయి
సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో, రాయలసీమలోనే తొలిసారిగా ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి, ఉస్మానియా ఆసుపత్రి యురాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమసింహారెడ్డి, నిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య విజయవంతంగా చేశారు. స్వయాన యురాలజిస్ట్ అయిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించడం విశేషం. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (24)కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరని వైద్యులు చెప్పారు. పెద్దాసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు జీవన్‌దాన్ ట్రస్ట్ నుంచి ఏడాది క్రితం అనుమతి లభించింది. దీంతో రామాంజనేయులు పేరును రిజిష్టర్ చేయించారు. అతనికి కిడ్నీ ఇవ్వడానికి తల్లి బజారమ్మ ముందుకు వచ్చింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి మొత్తం 35 మందితో కూడిన బృందం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతరాయంగా శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. పెద్దాసుపత్రి చరిత్రలో గొప్ప అధ్యాయం : కలెక్టర్ పెద్దాసుపత్రి చరిత్రలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఒక గొప్ప అధ్యాయమని, ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుని చాలా గర్వపడ్డానన్నారు. ఇది నిజంగా ఆసుపత్రి చరిత్రలో గొప్ప లక్ష్యసాధనగా పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఒక ఏడాది వరకు అవసరమైన మందులను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ఒక్క ఆపరేషన్‌తో ఆపకూడదని, ఇకపై మరిన్ని ఆపరేషన్లు చేయాలని వైద్యులను ప్రోత్సహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్యసేవలు అందించగలిగే వైద్యులు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ పీఎన్ జిక్కి, యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య, అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. డాక్టర్ సూర్యప్రకాష్‌కు సన్మానం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడంలో సహకరించిన నిమ్స్ యురాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సూర్యప్రకాష్‌ను సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం కర్నూలుకే గర్వకారణమని క్లబ్ జిల్లా చైర్మన్ ఎన్.వెంకటరామరాజు అన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్లు ఎస్.నాగేశ్వర్రావు, డాక్టర్ జి.బాలమద్దయ్య, సభ్యులు రమణగౌడ్, బోస్ పాల్గొన్నారు. 30 ఏళ్ల కల నెరవేరింది నేను కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. మా చేరికతోనే ఈ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. 1971లో నా ఆధ్వర్యంలో ఇక్కడ యురాలజీ విభాగం ప్రారంభమైంది. అప్పట్లో రాయలసీమలోనే నేను మొదటి యురాలజిస్టు. అప్పట్లోనే ఒక రోగికి డయాలసిస్ ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితమే నేను ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించాలని భావించా. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పిలిపించి ఉస్మానియాలో ఉంచారు. 30 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. నా ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం ఆనందంగా ఉంది. – డాక్టర్ ఎ.విక్రమసింహారెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ -
జూనియర్లకే అందలం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైద్య ఆరోగ్యశాఖలో అనర్హులనే అందలం ఎక్కిస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.తాము చెప్పిన మాటను కాదనకుండా చేస్తారనే ఉన్నతాధికారుల ఆలోచనే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) నియామకంలో ఈ తీరు కొనసాగుతోంది. అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ వారిని కాదని.. వారి కంటే తక్కువస్థాయి కలిగిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా తమకు ఇష్టం వచ్చిన జూనియర్ అధికారులను నియమించి..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సివిల్ సర్జన్ (సీఎస్) కేడర్ కలిగిన వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో)గా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారులు డిప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)లను డీఎంఅండ్‌హెచ్‌వోలుగా నియమిస్తున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురంతో పాటు మరో 5 జిల్లాల్లో జూనియర్ అధికారులను అందలం ఎక్కించినట్టు తెలుస్తోంది. సీనియర్ అధికారులు కాస్తా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలుగా ఉంటూ తమ జూనియర్ల కిందనే పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో జూనియర్లు తమకేమీ చెప్పేదంటూ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖలో వ్యవహారం కాస్తా కట్టుతప్పుతోంది. దీంతో పరిపాలన పట్టుతప్పి....కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించలేని పరిస్థితి నెలకొంది. అన్నింటిలోనూ అదే తీరే...!: మాతా, శిశు మరణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలని మెడికల్ ఆఫీసర్లతో పాటు ఏఎన్ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎవరిస్తారనే అంశం కానీ... ఏ బడ్జెట్ నుంచి తీసుకోవాలనే విషయం కానీ స్పష్టంగా పేర్కొనలేదు. ఫలితంగా మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంల సొంత బడ్జెట్ నుంచి ఈ ఖర్చులను భరించాల్సి వస్తోంది. అదేవిధంగా గతంలో కూడా పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు కూడా బడ్జెట్‌ను కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ జిల్లాలో మాత్రం నెలలు గడిచినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. వరుసగా ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఖర్చును వైద్య ఆరోగ్యశాఖ చెల్లించింది. మాతాశిశు మరణాలపై ఆడిట్ విషయంలో కూడా ఇప్పటివరకు మెడికల్ అధికారులకు, ఏఎన్ఎంలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది. -
‘మంత్రులంతా డమ్మీలుగా మారారు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భయంకరమైన అవినీతి జరుగుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదైంది. టీబీఎస్ సంస్థ పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్‌కు ఎక్కడా లేని విదంగా రూ.103 కోటట్లు మొబిలైజేషన్ ద్వారా, బిల్లుల రూపేనా రూ. 45 కోట్లు చెల్లించారు. సదరు సంస్థ ఓ మంత్రి గారి బంధువుది కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. టీబీఎస్ కాంట్రాక్టు రద్దు చేయాలి. టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ఆర్జీఎస్లో అవినీతిని బహిరంగపరుస్తాం’ అని సోము వీర్రాజు వెల్లడించారు. తండ్రీకొడుకుదే పాలన రాష్ట్రంలో తండ్రీకొడుకులు పాలన చేస్తున్నారని, మంత్రులంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. కేఈ, చిన్నరాజప్పలు కేవలం పేరుకే ఉప ముఖ్యమంత్రలని, వారికి ఎలాంటి అధికారాల్లేవన్నారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీపై ప్రధానిని గతంలో చంద్రబాబు అభినందించి, ఇపుడు యూటర్న్ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారని, సోనియాతో గాంధీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. -
సర్పం..భయం
పాములు పగబట్టి కాటేయడం సినిమాల్లో చూస్తుంటాం. నిజంగా అవి అలా చేస్తాయా అనేందుకు శాస్త్రీయంగా ఆధారాలు లేవు. అయితే పల్లెల్లో కాకతాళీయంగా జరిగే సంఘటనలు ఇలాంటివే అని నమ్మేవారు చాలా మంది ఉంటారు. డోన్ మండల పరిధిలోని మల్లెంపల్లె గ్రామంలో అదే జరిగింది. ఈ గ్రామంలో 19 మంది పాము కాటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడ్ని పాము కాటేసింది. దీంతో తొలగించిన నాగుల కట్టను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు ఆ ఊరి ప్రజలు. మల్లెంపల్లె (డోన్ రూరల్) : డోన్ మండలం మల్లెంపల్లె గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం ఈ నెల 18వ తేదీన నాగుల చవితి రోజున నాగుల కట్టను తొలగించారు. అయితే నాగులకట్టను తొలగించిన మరుసటి రోజే గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులును పాము కాటేసింది. పాము కాటుతో రామాంజనేయులు కోలుకున్నప్పటికీ, ఆ మరుసటి రోజే చిన్న మద్దిలేటిని కూడా పాము కాటేసింది. గమనించిన బంధువులు అతనిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు. దీంతో గ్రామస్తుల్లో ఒకింత ఆందోళనలో నెలకొంది. నాగులకట్టను తొలగించిన రోజు నుంచి వరుసగా పాముకాట్లు చోటు చేసుకుంటుండడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, పొలంలో పనులు చేయాలన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 19 మంది పాము కాటుకు గురవగా.. మూడు నాగుపాములను, ఒక రక్తపింజరిని చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడు రంజిత్ కూడా పాముకాటుకు గురయ్యాడు. దీంతో గ్రామస్తులు నాగులకట్ట పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా.. విషపూరితమైన పాము కాటుకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నాటువైద్యులు ఇచ్చే ఆకుపసురే శరణ్యమవుతోంది. అధికారులు స్పందించి గ్రామస్తులకు పాముకాటు వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సి ఉంది. అలాగే పాముల గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాములపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. పొలం పనులు చేస్తుండగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం పొలం పనులు చేస్తుండగా పక్కనే ఉన్న నాగుపాము చేయికి కాటేసింది. దీన్ని గమనించిన బంధువులు పక్క గ్రామమైన లక్ష్ముంపల్లెకు ఆమెను తీసుకెళ్లి ఆకు పసురు తాపించారు. - బోయ లింగమ్మ, గ్రామస్తురాలు సేద్యం పని చేస్తుండగా పొలంలో సేద్యం పనులు చేస్తుండగా ఈ నెల 24వ తేదీ పాము కాటు వేసింది. దీంతో లక్షుంపల్లెకు వెళ్లి ఆకు పసరు తీసుకున్నాను. 12 రోజులుగా ఏక్షణంలో ఎవరిని పాములు కాటేస్తాయోనని భయం గుప్పిట్లో జీవిస్తున్నాం. - కె.మాధవరావు, గ్రామస్తుడు గతంలో ఇలాంటివి జరగలేదు గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు పాములు మాత్రమే కాటేసివి. ఇలా వరుసగా పాములు కాట్లు వేయడం మేమన్నడూ చూడలేదు. - రామచంద్రుడు -
భూమాపై వేధింపుల పర్వం
* నిమ్స్‌కు తరలించేందుకు పోలీసులు ససేమిరా * డాక్టర్ సూచించినా ఎస్కార్ట్ ఇవ్వలేమని సాకులు * జైలులోనే దీక్షకు దిగిన భూమా దిగొచ్చిన అధికారులు.. * కర్నూలు నుంచి ప్రత్యేక వైద్యబృందంతో పరీక్షలు * రాత్రికి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఏపీలో అధికార టీడీపీ నేతలు వేధింపులపర్వాన్ని కొనసాగించారు. కేవలం ‘నన్ను తాకొద్దు’ అన్నందుకు ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను జైలుకు తరలించేందుకు నానాహంగామా సృష్టించారు. ఇందుకోసం 12 గంట ల పాటు ఆయన్ను విచారణ పేరిట తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో జడ్జి ఎదుట హాజరుపరిచి.. ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించారు. జైలుకు తరలించాక వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నిమ్స్‌కు తరలించాలని చెప్పినా ఎస్కార్టు ఇవ్వలేమంటూ పోలీ సులు కుటిలయత్నాలకు దిగారు. వారి తీరుకు నిరసనగా భూమా జైల్లోనే దీక్ష చేపట్టగా.. అధికారులు దిగివచ్చారు. కర్నూలు నుంచి రప్పించిన ప్రత్యేక వైద్యబృందం సలహాతో శనివారం రాత్రి 9.30కి కర్నూలు పెద్దాసుపత్రికి భూమాను తరలించారు. రాత్రి నుంచే హైడ్రామా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఏపీలో అధికారపార్టీ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా ఎంచుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులతో ఫిర్యాదు ఇప్పించి భూమాపై పలు కేసులు నమోదు చేయిం చారు. వీటిపై విచారణ పేరిట నంద్యాల త్రీటౌన్ పోలీ సులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నివాసం నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ పేరి ట 6 గంటలకు పైగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. చివరకు అర్ధరాత్రి దాటాక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందుకోసం సర్టిఫికెట్‌ను సమర్పించలేదు. దీంతో సర్టిఫికెట్‌ను తీసుకొచ్చి... తెల్లవారుజామున 4 గంటలకు ఆయన్ను మళ్లీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 14 వరకు రిమాండ్ విధిస్తూ ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఎలాగైనా జైలుకు పంపేందుకు 12 గంటలపాటు ఈ తతంగాన్ని అధికారపార్టీ నేతల ఆదేశాలకనుగుణంగా పోలీసులు నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పెళ్లి వాహనం బోల్తా....ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూలు: పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి-గిరిగెట్ల రహదారిలోని మదనంతపురం స్టేజి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు...వేగంగా వస్తున్న పెళ్లి వాహనం ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని కర్నూలు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. (తుగ్గలి) -
రక్త సంతకం
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం పదో రోజు కూడా విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై జూడాలు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు. జూడాల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం - రక్తంతో సంతకాలు చేసిన వైద్య విద్యార్థులు కర్నూలు(హాస్పిటల్): సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని హైకోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యుల హక్కులను కాలరాస్తోందని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు నిరంజన్, వంశీ విహారి అన్నారు. సోమవారం స్థానిక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పదో రోజు కూడా జూడాలు విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై వైద్యులు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం జూడాలతో చర్చలు చేపట్టకపోవడం దారుణమన్నారు. నిర్బంధ వైద్య విద్య పేరిట జారీ చేసిన జీఓ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం నేతలు ప్రశాంత్, పవన్, విష్ణు, భాను ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’లో కలకలం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఓ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైంది. ఫలితంగా ఆరు వార్డుల్లోని 300 కేసులకు సంబంధించిన వివరాలు గల్లంతవడంతో ఆసుపత్రి రూ.60 లక్షల ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐదు రోజుల క్రితం ఘటన చోటుచేసుకోగా గోప్యంగా ఉంచిన అధికారులు డిస్క్‌ను పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు. వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన పేదలందరికీ ఖరీదైన వైద్యం, ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పేయింగ్ బ్లాక్‌లో ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఆసుపత్రిలోని మేల్ మెడికల్ వార్డు-3 గదిలో ఆరోగ్యశ్రీ విభాగం ఉంది. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 1, 2, 3, 4, 5, 6 వార్డుల కేసులను ఇక్కడ నమోదు చేస్తారు. ఇందుకోసం ఐదుగురు ఆపరేటర్లను నియమించారు. ఐదు రోజుల క్రితం వైరస్ కారణంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైంది. ఇందులో గత మూడు నెలలకు సంబంధించిన 300 కేసుల వివరాలు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డేటా గల్లంతవడం అనుమానాలకు తావిస్తోంది. ఖాళీ సమయాల్లో ఆపరేటర్లు యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ చాటింగ్‌లతో కాలం గడుపుతుండటం.. డౌన్లోడ్లు చేస్తుండటమే వైరస్‌కు కారణంగా తెలుస్తోంది. గతంలో జనరల్ సర్జరీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి రెండు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంతో ఓ ఉద్యోగిని అధికారులు తొలగించారు. పేద రోగుల సమాచారం గల్లంతవడంతో ఆసుపత్రి ఆదాయానికి రూ.60 లక్షల వరకు గండి పడుతుందని తెలిసి హార్డ్ డిస్క్ విషయాన్ని ఆరోగ్యశ్రీ ఐటీ విభాగం సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఇక్కడి సిబ్బంది హార్డ్ డిస్క్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. చివరకు హైదరాబాద్‌కు పంపారు. అక్కడ కూడా ఫలితం లేకపోతే 300 కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఆసుపత్రి అధికారులు లోతుగా విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నా దృష్టికి రాలేదు: మేల్ మెడికల్ వార్డు-3లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైన ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కేసుల నమోదును చేపడతారు. రోగులకు సంబంధించి వివరాలు గల్లంతైనట్లు తేలితే చర్యలు తప్పవు. - డాక్టర్ టి.పుల్లన్న, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్