‘ఆరోగ్యశ్రీ’లో కలకలం | Computer hard disk failure of having 300 cases information | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’లో కలకలం

Published Thu, Aug 21 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

Computer hard disk failure of having 300 cases information

కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఓ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైంది. ఫలితంగా ఆరు వార్డుల్లోని 300 కేసులకు సంబంధించిన వివరాలు గల్లంతవడంతో ఆసుపత్రి రూ.60 లక్షల ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐదు రోజుల క్రితం ఘటన చోటుచేసుకోగా గోప్యంగా ఉంచిన అధికారులు డిస్క్‌ను పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు.

 వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన పేదలందరికీ ఖరీదైన వైద్యం, ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పేయింగ్ బ్లాక్‌లో ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఆసుపత్రిలోని మేల్ మెడికల్ వార్డు-3 గదిలో ఆరోగ్యశ్రీ విభాగం ఉంది. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 1, 2, 3, 4, 5, 6 వార్డుల కేసులను ఇక్కడ నమోదు చేస్తారు. ఇందుకోసం ఐదుగురు ఆపరేటర్లను నియమించారు. ఐదు రోజుల క్రితం వైరస్ కారణంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైంది.

ఇందులో గత మూడు నెలలకు సంబంధించిన 300 కేసుల వివరాలు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డేటా గల్లంతవడం అనుమానాలకు తావిస్తోంది. ఖాళీ సమయాల్లో ఆపరేటర్లు యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ చాటింగ్‌లతో కాలం గడుపుతుండటం.. డౌన్‌లోడ్‌లు చేస్తుండటమే వైరస్‌కు కారణంగా తెలుస్తోంది. గతంలో జనరల్ సర్జరీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి రెండు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంతో ఓ ఉద్యోగిని అధికారులు తొలగించారు.

పేద రోగుల సమాచారం గల్లంతవడంతో ఆసుపత్రి ఆదాయానికి రూ.60 లక్షల వరకు గండి పడుతుందని తెలిసి హార్డ్ డిస్క్ విషయాన్ని ఆరోగ్యశ్రీ ఐటీ విభాగం సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఇక్కడి సిబ్బంది హార్డ్ డిస్క్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. చివరకు హైదరాబాద్‌కు పంపారు. అక్కడ కూడా ఫలితం లేకపోతే 300 కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఆసుపత్రి అధికారులు లోతుగా విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 నా దృష్టికి రాలేదు: మేల్ మెడికల్ వార్డు-3లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫెయిలైన ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కేసుల నమోదును చేపడతారు. రోగులకు సంబంధించి వివరాలు గల్లంతైనట్లు తేలితే చర్యలు తప్పవు.     - డాక్టర్ టి.పుల్లన్న, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement