సర్పం..భయం | Snakes fear | Sakshi
Sakshi News home page

సర్పం..భయం

Published Mon, Aug 31 2015 4:03 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

Snakes fear

పాములు పగబట్టి కాటేయడం సినిమాల్లో చూస్తుంటాం. నిజంగా అవి అలా చేస్తాయా అనేందుకు శాస్త్రీయంగా ఆధారాలు లేవు. అయితే పల్లెల్లో కాకతాళీయంగా జరిగే సంఘటనలు ఇలాంటివే అని నమ్మేవారు చాలా మంది ఉంటారు. డోన్ మండల పరిధిలోని మల్లెంపల్లె గ్రామంలో అదే జరిగింది. ఈ గ్రామంలో 19 మంది పాము కాటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడ్ని పాము కాటేసింది. దీంతో తొలగించిన నాగుల కట్టను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు ఆ ఊరి ప్రజలు.   
 
 మల్లెంపల్లె (డోన్ రూరల్) : డోన్ మండలం మల్లెంపల్లె గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం ఈ నెల 18వ తేదీన నాగుల చవితి రోజున నాగుల కట్టను తొలగించారు. అయితే నాగులకట్టను తొలగించిన మరుసటి రోజే గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులును పాము కాటేసింది. పాము కాటుతో రామాంజనేయులు కోలుకున్నప్పటికీ, ఆ మరుసటి రోజే చిన్న మద్దిలేటిని కూడా పాము కాటేసింది. గమనించిన బంధువులు అతనిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు. దీంతో గ్రామస్తుల్లో ఒకింత ఆందోళనలో నెలకొంది.

నాగులకట్టను తొలగించిన రోజు నుంచి వరుసగా పాముకాట్లు చోటు చేసుకుంటుండడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, పొలంలో పనులు చేయాలన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 19 మంది పాము కాటుకు గురవగా..  మూడు నాగుపాములను, ఒక రక్తపింజరిని చంపేశారు.  ఆదివారం తెల్లవారుజామున కూడా ఏడేళ్ల బాలుడు రంజిత్ కూడా పాముకాటుకు గురయ్యాడు. దీంతో గ్రామస్తులు నాగులకట్ట పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా.. విషపూరితమైన పాము కాటుకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నాటువైద్యులు ఇచ్చే ఆకుపసురే శరణ్యమవుతోంది. అధికారులు స్పందించి గ్రామస్తులకు పాముకాటు వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సి ఉంది. అలాగే పాముల గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. పాములపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.  
 
 పొలం పనులు చేస్తుండగా
 ఈ నెల 29వ తేదీ సాయంత్రం పొలం పనులు చేస్తుండగా పక్కనే ఉన్న నాగుపాము చేయికి కాటేసింది. దీన్ని గమనించిన బంధువులు పక్క గ్రామమైన లక్ష్ముంపల్లెకు ఆమెను తీసుకెళ్లి ఆకు పసురు తాపించారు.
     - బోయ లింగమ్మ, గ్రామస్తురాలు

 సేద్యం పని చేస్తుండగా
 పొలంలో సేద్యం పనులు చేస్తుండగా ఈ నెల 24వ తేదీ పాము కాటు వేసింది. దీంతో లక్షుంపల్లెకు వెళ్లి ఆకు పసరు తీసుకున్నాను. 12 రోజులుగా ఏక్షణంలో ఎవరిని పాములు కాటేస్తాయోనని భయం గుప్పిట్లో జీవిస్తున్నాం.   
 -  కె.మాధవరావు, గ్రామస్తుడు

 గతంలో ఇలాంటివి జరగలేదు
 గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు పాములు మాత్రమే కాటేసివి. ఇలా వరుసగా పాములు కాట్లు వేయడం మేమన్నడూ చూడలేదు.    - రామచంద్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement