భూమాపై వేధింపుల పర్వం
* నిమ్స్‌కు తరలించేందుకు పోలీసులు ససేమిరా
* డాక్టర్ సూచించినా ఎస్కార్ట్ ఇవ్వలేమని సాకులు
* జైలులోనే దీక్షకు దిగిన భూమా దిగొచ్చిన అధికారులు..
* కర్నూలు నుంచి ప్రత్యేక వైద్యబృందంతో పరీక్షలు
* రాత్రికి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఏపీలో అధికార టీడీపీ నేతలు వేధింపులపర్వాన్ని కొనసాగించారు. కేవలం ‘నన్ను తాకొద్దు’ అన్నందుకు ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను జైలుకు తరలించేందుకు నానాహంగామా సృష్టించారు. ఇందుకోసం 12 గంట ల పాటు ఆయన్ను విచారణ పేరిట తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో జడ్జి ఎదుట హాజరుపరిచి.. ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించారు. జైలుకు తరలించాక వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నిమ్స్‌కు తరలించాలని చెప్పినా ఎస్కార్టు ఇవ్వలేమంటూ పోలీ సులు కుటిలయత్నాలకు దిగారు. వారి తీరుకు నిరసనగా భూమా జైల్లోనే దీక్ష చేపట్టగా.. అధికారులు దిగివచ్చారు. కర్నూలు నుంచి రప్పించిన ప్రత్యేక వైద్యబృందం సలహాతో శనివారం రాత్రి 9.30కి కర్నూలు పెద్దాసుపత్రికి భూమాను తరలించారు.
రాత్రి నుంచే హైడ్రామా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఏపీలో అధికారపార్టీ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా ఎంచుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులతో ఫిర్యాదు ఇప్పించి భూమాపై పలు కేసులు నమోదు చేయిం చారు. వీటిపై విచారణ పేరిట నంద్యాల త్రీటౌన్ పోలీ సులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నివాసం నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విచారణ పేరి ట 6 గంటలకు పైగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. చివరకు అర్ధరాత్రి దాటాక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందుకోసం సర్టిఫికెట్‌ను సమర్పించలేదు. దీంతో సర్టిఫికెట్‌ను తీసుకొచ్చి... తెల్లవారుజామున 4 గంటలకు ఆయన్ను మళ్లీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 14 వరకు రిమాండ్ విధిస్తూ ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఎలాగైనా జైలుకు పంపేందుకు 12 గంటలపాటు ఈ తతంగాన్ని అధికారపార్టీ నేతల ఆదేశాలకనుగుణంగా పోలీసులు నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.