సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు మళ్లీ అంగడి తెరిచారు. ఏజెన్సీ రద్దవుతున్న నేపథ్యంలో అందినకాడికి దండుకోవాలనే దుర్బుద్ధితో ఓ ఉద్యోగి సెక్యూరిటీ గార్డు పోస్టులను అమ్మకానికి పెట్టాడు. ఒక్కో పోస్టుకు రేటు విధించి మరీ అమ్మకాలు సాగించాడు. డబ్బు కట్టిన వారిలో మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల పేదలే అధికం.
టీడీపీ హయాంలో భారీగా పెరిగిన ఖర్చు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు బాధ్యతను నాలుగేళ్ల క్రితం ఒకే సంస్థ నిర్వహించేది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరుగా టెండర్లు పిలిచి అనుకూలమైన వారికి కట్టబెట్టింది. అంతకు ముందు ఆసుపత్రిలో సెక్యూరిటీ, పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.18 లక్షల్లోపే ఖర్చయ్యేది. కానీ టెండర్ల తర్వాత రూ.70 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.80 లక్షలు దాటింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతను జై బాలాజీ సెక్యూరిటీస్ ఏజెన్సీ దక్కించుకుంది. రెండున్నర సంవత్సరాల క్రితమే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకొని ఒక్కో సెక్యూరిటీ గార్డు పోస్టును రూ.40వేల నుంచి రూ.80వేల వరకు అమ్ముకున్నారు.
టెండరు మొత్తం అటు ఇటుగా...
పెద్దాసుపత్రిలో 180 మంది సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికి రూ.7 వేలకు పైగా జీతం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రూ.12,60,000 అవుతుంది. కానీ జై బాలాజీ సంస్థ మాత్రం కేవలం రూ.1,80,000లకు కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. వాస్తవంగా ఈ మొత్తం కంటి ఆసుపత్రికి సరిపోతుంది. కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు పొరపాటు చేశారో లేక సంస్థ ప్రతినిధులు ఏమరుపాటుగా కోడ్ చేశారో తెలియదు గానీ టెండర్ మొత్తం అటు ఇటుగా మారింది. దీంతో నిర్వాహకులు ఏడాదికి పైగా జీతాలు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత పై స్థాయిలో మాట్లాడుకుని టెండర్ మొత్తాన్ని పెంచుకున్నారు.
ఖాళీ పోస్టుల కోసం భారీగా వసూళ్లు ..
ఆసుపత్రిలో జీతాలు సక్రమంగారాక, ఇష్టం లేక కొందరు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేశారు. దీనిని ఆసరాగా చేసుకుని ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను సృష్టించి మళ్లీ అంగట్లో పెట్టారు. ఈ మేరకు ఒక్కో పోస్టును డిమాండ్‌ను బట్టి రూ.80 వేల నుంచి రూ.1.30 లక్షలకు విక్రయించినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఏజెన్సీలో పనిచేసే కొందరు ఉద్యోగులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను వివరణ కోరితే పనిమానేసిన వారి స్థానంలో కొందరిని నియమించుకున్నట్లు సమాధానమిస్తున్నట్లు తెలిసింది. కాగా నెల రోజులుగా మొత్తం 35 మంది దాకా సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఐదు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు లేవు. ఉన్న వారికే జీతాలు లేని పక్షంలో కొత్తగా చేరిన వారికి ఎక్కడి నుంచి ఇస్తారని ప్రస్తుతం పనిచేస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ప్రభుత్వం రద్దు చేస్తుందనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్లుగా ఏజెన్సీ నిర్వాహకులు పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment