ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: జీవనశైలి జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్నిటికంటే మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. ఇలాంటి జీవనశైలి జబ్బులకు బోధనాస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్ పేషెంట్ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌ఎంఐఎస్) పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాయనేది తెలుస్తుంది. అలా మన రాష్ట్రంలో గడచిన 5 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ) 1.30 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆస్పత్రుల వరకూ నమోదైన కేసులు అదనం.
ఒత్తిడితో చిత్తవుతున్నారు
ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ అత్యధికంగా 51 వేల మందికి పైగా బాధితులు మానసిక జబ్బుల కారణంగా ఔట్ పేషెంట్ సేవల కోసం ప్రభుత్వ పెద్దాస్పత్రులకు వచ్చినట్టు హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైంది. కొంతవరకూ కోవిడ్ కూడా ఒత్తిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను బట్టే ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల 35 ఏళ్లలోపు యువకులకు కూడా హార్ట్ స్ట్రోక్‌లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. డయాబెటిక్ బాధితుల సంఖ్య పెరగడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణమని వెల్లడైంది.
ఎన్సీడీ జబ్బులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి జబ్బులపై దృష్టి సారించింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులను ప్రాథమిక దశలో కనుక్కునేందుకు స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తున్నారు. మానసిక జబ్బులకు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మాత్రమే ఆస్పత్రి ఉంది. కొత్తగా కడపలో 100 పడకలతో మానసిక ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి వారికి అవగాహన కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది.
కోరికలు పెద్దవి.. ఆదాయం చిన్నది
చిన్న వయసులోనే కోరికలు చాలా పెద్దవిగా ఉండటం.. దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇక చదువుల్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. మా దగ్గరకు ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే ఈ జబ్బులతో వస్తున్నారు. యువకుల్లో వచ్చే మానసిక రుగ్మతలకు తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభావం చూపిస్తుంది.
–డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, కడప
పట్టణీకరణ ప్రమాదంగా మారింది
జనజీవనంలో పట్టణీకరణ ప్రతికూల మార్పులు తెస్తోంది. ముఖ్యంగా ఆహారంలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. దీనికితోడు వారిని ఒత్తిడి గుండెజబ్బుల వైపు నెడుతోంది. శారీరక వ్యాయామం, కూరగాయలతో కూడిన మంచి ఆహారం ద్వారా గుండెపోటును నివారించుకోవచ్చు. ముఖ్యంగా యువతలో మార్పు రావాలి. 90 శాతం మంది యువత వ్యాయామం లేక సతమతమవుతున్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే నష్టం కొనితెచ్చుకున్నట్టే.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment