నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్‌మెంట్ ఉందా?
– పి.రజిత, మామిడిపల్లి
నెలసరి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్‌లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్‌గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం.
థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్‌ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్‌మెంట్ చేయాలా లేదా నాన్‌హార్మోనల్ ట్రీట్‌మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్‌మెంట్ అవసరం ఉంటుంది.
-డాక్టర్ భావన కాసు,
గైనకాలజిస్ట్ ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment