ప్రశ్న: నా వయసు 33 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 55 కిలోలు. గత ఏడాది రెండో కాన్పు తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా, మూత్రం సమయంలో మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సువర్ణ, నిర్మల్
పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్‌లు, కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్(కండపట్టడం), ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం, గర్భాశయంలో వాపు అండాశయంలో నీటిబుడగలు, నీటి గడ్డలు, సిస్ట్‌లు, కంతులు, గర్భాశయ ముఖ ద్వారంలో పుండ్లు, హార్మోన్ల అసమతుల్యత, కొందరిలో పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే సమయంలో బ్లీడింగ్ కనిపించవచ్చు.
గైనకాలజిస్ట్‌కు సంప్రదించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్‌స్మియర్, వెజైనల్ పెల్విన్ అల్ట్రాసౌండ్, ఎస్‌ఆర్ టీఎస్‌హెచ్, సీబీపీ వంటి అవసరమైన రక్తపరీక్షలు వంటివి చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా మూత్రం తరచుగా రావడం, మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకుని దానిని బట్టి సరైన యాంటీ బయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది.
పీరియడ్స్ మధ్యలో అయ్యే బ్లీడింగ్‌కు పాలిప్, ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం వంటివి కారణం అయితే దానికి గర్భాశయంలో హిస్టెరోస్కోపీ ద్వారా చూస్తూ డీ అండ్ సీ చేయడం ద్వారా పొరను తొలగించి బయాప్సీకి పంపించడం, హార్మోన్స్ అసమతుల్యత చిన్న సిస్ట్‌లు ఉంటే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయడం, పెద్ద సిస్ట్‌లు, ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర కారణాలు ఉంటే ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడం వంటి చికిత్స విధానాలను గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవలసి ఉంటుంది.
ప్రశ్న: మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఎత్తు 5.4, బరువు 38 కిలోలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యమవుతుందని విన్నాను. దీనికి ఇతర సమస్యలేవైనా కారణం కావచ్చా? పరిష్కారం వివరించగలరు. – అమ్మాజీ, యలమంచిలి
మీ అమ్మాయి 5.4 ఎత్తుకి కనీసం బరువు 50 కేజీలు అయినా ఉండాలి. సాధారణంగా అమ్మాయి 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ కావడానికి హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యాలి అంటే శరీరంలో కనీసం 20 శాతం అయినా కొవ్వు ఉండాలి. మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది కాబట్టి రజస్వల కాకపోవడానికి అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు.
కొందరిలో పుట్టుకలోనే గర్భాశయం, అండాశయాలు లేకపోవడం, లేదా వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల 16 ఏళ్లైనా మెచ్యూర్ కాకపోవచ్చు. మీ అమ్మాయికి 16 ఏళ్లు కాబట్టి.. మెచ్యూర్ కాకపోవడానికి వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్, సీబీపీ, ఎస్‌ఆర్. టీఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ లోపల మీ అమ్మాయికి పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి పౌష్టికాహారం ఇవ్వండి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటే ఎండొక్రైనాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది.
డాక్టర్ వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment