డాక్టర్ శిల్పిరెడ్డి, గర్భవతితో డ్యాన్స్ చేయిస్తూ..
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు.
‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది.
గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు.
సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది.
సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు.
ఇక్కడ మా కడల్ హాస్పిటల్‌లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్.
రోజువారీ పనులు
అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది.
ఏడేళ్లుగా చేస్తున్న కృషి
క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment