pregnant ladies
-
గర్భిణీలు వ్యాయామం చేయాలా? వద్దా?
బిడ్డకు జన్మనివ్వడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. గర్భం దాల్చింది మొదలు శరీరంలో అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటారు. హార్మోన్లలో తేడాలొస్తాయి. వాంతులు, మార్నింగ్ సిక్నెస్ లాంటివి మరింత ఇబ్బందిపెడతాయి. వీడికి తోడు అనేక ఏం తినాలి? ఇలా ఎందుకు అయింది? ఇదేమైనా ప్రమాదమా? లోపల బేబీ బాగానే ఉందా? బిడ్డ బాగానే ఎదుగుతోందా? వ్యాయామం చేయాలా? వద్దా? ఇలా సవాలక్ష సందేహాలు కాబోయే తల్లుల బుర్రల్ని తొలుస్తూ ఉంటాయి? బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి మంచిపోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలోవ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది పెద్ద ప్రశ్న.అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన తేలిగ్గా ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు జననాలను నివారించవచ్చు.గర్భం దాల్చడం అపురూపమే కానీ, కనీస శారీక శ్రమ చేయకూడనంత కాదు. గర్బిణీలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కొన్ని వ్యాయామాలు చేయడంద్వారా సుఖ ప్రసవం జరుగుతుంది. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. అధిక బరువు , గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం లేదా ప్రీఎక్లంప్సియా వంటి అధిక రక్తపోటు రుగ్మతలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడిని తేలికపాటి వ్యాయామం తగ్గిస్తుంది. పొట్ట పెరుగుతున్నపుడు వచ్చే నడుం నొప్పి తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ముందు మీ గైనగాలజిస్ట్ సలహా తప్పకుండా తీసుకోవాలి. వారి సలహా మేరకు నాలుగో నెల నుంచి సాధారణం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ప్రజారోగ్య మార్గదర్శకాల ప్రకారం గర్భిణీలు వారానికి సుమారు 150 నిమిషాలు (లేదా రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వాకింగ్ చేయవచ్చు. వార్మ్-అప్ ,కూల్-డౌన్ వ్యాయామాలు ఎంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంకోసం తేలికపాటి యోగా చేయవచ్చు.గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. తల్లి స్నానం చేసేటపుడు, పొట్టమీద ఒకసారి వేడి నీళ్లు (సమవేడి) మరోసారి చల్ల నీళ్లను పోసుకుంటూ వాటర్ థెరపీలా చేసుకోవాలట. దీని వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని చెబుతారు. అరగంట సమయానికి పరిమితం కావడం మంచిది. ఏదైనా తేడాగా అనిపించినా, అలసటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే సడన్‌గా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తకూడదు. ఏ వ్యాయామం అయినా, మితంగా చేయడం ముఖ్యం. అలసిపోయే దాకా చేయకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో బిడ్డ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. -
నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డే 2024 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు. మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం. 2024 థీమ్: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. పోషకాహారం, రెగ్యులర్ చెకప్‌లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు! -
బీపీని పెంచే అవకాశం.. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోండి
బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ►గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తీసుకునేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ► గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ► గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ► గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ► అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ► నిద్రలేమికి కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్టయితే... మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. -
Dr. Shilpi Reddy: డ్యాన్సింగ్ మామ్స్
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు. ‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది. గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు. సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది. సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు. ఇక్కడ మా కడల్ హాస్పిటల్లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్. రోజువారీ పనులు అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న కృషి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది. – నిర్మలారెడ్డి -
ఆ ప్రాంతంలో అమ్మకు కష్టం.. తీరేదెన్నడో!
కొరాపుట్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆధునిక యుగంలో అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాం అని సంబర పడుతున్నాం. కానీ ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. పురిటి నొప్పులు వస్తే పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి రాకుండానే ప్రసవిస్తున్న ప్రాణాలెన్నో. నబరంగ్‌పూర్ జిల్లాలోని జొరిగాం సమితి చక్ల పొదర్ గ్రామ పంచాయతీ పరిధి దహిమార గ్రామానికి చెందిన ఉషావతి బోత్ర అనే గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆశ కార్యకర్త నళినిని సంప్రదించారు. ఆమె వెంటనే జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ వెంటనే అంబులెన్స్ వచ్చినప్పటికీ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న నది అడ్డంగా మారింది. వెంటనే గ్రామస్తులు ఉషావతిని ఒక మంచంపై మోసుకొని నది ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో వారికి అంబులెన్స్ సిబ్బంది సైతం సాయం చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఉషావతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. చదవండి: థాక్రే అంటే ఇప్పటికీ గౌరవమే.. శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!: రెబల్స్ -
ప్రైవేట్ ఆస్పత్రులు తగ్గేదేలే.. 94 శాతం సిజేరియన్లే!
భైంసాటౌన్(ముధోల్): జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గత మార్చిలో జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, అంగన్వాడీలకు సూచించారు. సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించగా, ఆరునెలల్లో మార్పు వస్తుందని కలెక్టర్ సైతం మంత్రికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తరచూ వైద్యాధికారులు, అంగన్వాడీలతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్ సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సానుకూల మార్పు కనిపించడం లేదని వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. 94 శాతం సిజేరియన్లే... రాష్ట్రంలో 2021–22లో సిజేరియన్ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో నాలుగు జిల్లాల్లో 94శాతం సిజేరియన్లే నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కడుపుకోతలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఈఏడాది జనవరి నుంచి మే వరకు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 2600 వరకు ప్రసవాలు జరుగగా, వీటిలో 2146 సిజేరియన్లే కావడం గమనార్హం. కేవలం 454 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశీలిస్తే.. 2,925 ప్రసవాలు జరుగగా, 1171 సాధారణ, 1754 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇంకా తగ్గాల్సిన అవసరముంది. అవగాహన కల్పిస్తేనే... ఒకప్పుడు సర్కారు దవాఖాన్లలో లేదంటే ఇళ్లలోనే ఎక్కువగా కాన్పులు చేసేవారు. చాలావరకు సాధారణ కాన్పులే జరిగేవి. ఇంటి వద్ద నొప్పులొస్తే మంత్రసాని ఇంటికే వచ్చి ప్రసవం చేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మారిన ఆçహార అలవాట్ల కారణంగానో, నొప్పులు భరించలేకనో సిజేరియన్ ప్రసవాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కొందరు సమయం, ముహూర్తం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సిజేరియన్లతో తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమేనని చెబుతున్న ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని పదేపదే సూచిస్తోంది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులపై దృష్టి పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అవగాహన లేకనో, గర్భిణుల బంధువుల ఒత్తిడితోనో సిజేరియన్లు చేస్తున్నారు. సుఖప్రసవానికి వీలులేనప్పుడో, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడో చేయాల్సిన సిజేరియన్లు.. అవసరం లేకున్నా చేస్తున్నారని విమర్శలున్నాయి. ఫలితంగా కడుపు కోతల్లో నిర్మల్ జిల్లా టాప్‌లిస్ట్‌లోకి చేరింది. అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే జిల్లాలో వీటిని తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవగాహన కల్పిస్తున్నాం ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి పెడుతున్నాం. తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ సిజేరియన్ కాన్పులు తగ్గించాలని సూచిస్తున్నాం. కలెక్టర్ సైతం ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో సిజేరియన్లు తగ్గించాలని సూచిస్తున్నారు. మార్పు రాని పక్షంలో చర్యలు తీసుకుంటాం. –ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో -
గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడకూడదు... ఎందుకంటే?
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందులను వాడకూడదంటూ డాక్టర్లు ఆంక్షలు పెడతారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. నిజానికి మనం చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతవైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అది గర్భవతుల విషయంలో ఏమాత్రం చేయకూడదు. అది వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెడుతుంది. మామూలు వ్యక్తులు సైతం ఆన్‌కౌంటర్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదనేది వైద్యుల మాట. అందునా గర్భవతులు వాడటం వల్ల వారికి మాత్రమే కాకుండా... అది కడుపులో బిడ్డకు సైతం ఎన్నో రకాలుగా కీడు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... కాబోయే తల్లులు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల సాధారణ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు వాటిని సూచిస్తారు. అవి మాత్రమే... అందునా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. -
పరిస్థితి ఆందోళనకరం.. వారిలో 75 శాతం రక్తహీనత
ములుగు(వరంగల్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో 75 శాతం మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్ సమస్య) ఉండడం ఆందోళనకరమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్లతో ములుగు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ క్రిస్టియానా జñడ్ ఛోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పీహెచ్సీ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వెల్నెస్ సెంటర్, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణులకు 75శాతం హిమోగ్లోబిన్ సమస్య ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 2,309, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,348, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,897, ఖమ్మంలో 4,431 మంది తీవ్ర పోషణలోపానికి గురైన పిల్లలు ఉండడం బాధాకరమన్నారు. ఆయా ఐటీడీఏల పరిధిలో మూడు లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలని, ఐసీడీఎస్, వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహా రాలను అందిస్తున్నా.. ఎక్కడ లోపం ఏర్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. లక్షమంది చిన్నారులకు 84 మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెల్నెస్ సెంటర్లలో పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకుల ఏర్పాటు.. వచ్చే ఆరు నెలల్లో మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. కేరళ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ కిట్, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను బలోపేతం చేశారన్నారు. కేరళలో ప్రతి గ్రామపంచాయతీలు పోటీపడి పోషకాహారాన్ని అందించడాన్ని గమనించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని 8 నెలలపాటు రెండో వంతు పోషకాహారాన్ని అందిస్తామన్నారు. విజయవంతం అయితే అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. 37శాతమే ముర్రుపాలు తాగిస్తున్నారు... రాష్ట్రంలో ప్రసవం అయ్యాక కేవలం 37శాతం మంది మాత్రమే పిల్లలకు ముర్రుపాలు తాగిస్తున్నారని, ఇది ఆందోళన కరమైన విషయమని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందిస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ గ్రోత్‌మానిటరింగ్ డ్రైవ్ ద్వారా తక్కువ బరువుతో, పౌష్టికాహార లోపంతో గుర్తించిన పిల్లలు ములుగు జిల్లాలో 16శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5శాతం, ఖమ్మం జిల్లాలో 6.2శాతం ఉన్నారని తెలిపారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాడ్వాయి అంగన్వాడీ కేంద్రంలో 100శాతం చిన్నారులు సరైన బరువుతో ఆరోగ్యవంతంగా పెరిగేలా పౌష్టికాహారం అందించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్షి్మని అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనిరుధ్, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీఓలు గౌతమ్ పోత్రు, బ్రవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, భూపాలపల్లి అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, పీహెచ్సీ వైద్యాధికారి నిఖిత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, భూపాలపల్లి సంక్షేమ అధికారి శామ్యూల్, డీఆర్డీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష -
Lightning Bolt: విద్యుత్ స్తంభంపై పిడుగుపాటు..
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): మండలంలోని ఎక్స్‌రోడ్డు లింగోజీ తండాలో విద్యుత్ స్తంభంపై బుధవారం పిడుగుపడింది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్తంభంపై పిడుగు పడడంతో ఎర్తింగ్ వైర్ తెగిందని సర్పంచ్ హరినాయక్ పేర్కొన్నారు. నెట్వర్క్ లేక ఏఎన్ఎంల పాట్లు నార్నూర్(గాదిగూడ): గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోపాటు, గర్భిణి, బాలింతల మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లకు ట్యాప్‌లు అందజేసింది. ప్రతిరోజు ఫీల్డ్ వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటోంది. మంగళవారం గాదిగూడ మండలంలో నెట్వర్క్ సౌకర్యం లేక ఏఎన్ఎంలు పడరాని పాట్లు పడ్డారు. ఝరి పీహెచ్సీ ఏఎన్ఎంలు గుట్ట ఎత్తు ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారి పవన్‌కుమార్.. ఆస్పత్రి భవనం ఎక్కి సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. చదవండి: Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త -
పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చు
సాక్షి,న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. టీకా విధానంలో తాజా మార్పులివే.. కరోనా సోకినవారు కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలి. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. తొలి డోసు వేసుకున్నాక కోవిడ్ సోకితే.. కోలుకున్న 3 నెలలకు రెండో డోసు తీసుకోవాలి. ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి. ఇతర తీవ్ర వ్యాధులతో ఆసుపత్రి, ఐసీయూలో చికిత్స అవసరమైన వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి. పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు. వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరం లేదు. అయితే గర్భిణీలకు కోవిడ్ టీకా ఇచ్చే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. చదవండి: Covaxin: పిల్లలపై ప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
పాపం పసివాళ్లు: ఆస్పత్రి సిబ్బందే అమ్మనాన్న అయ్యారు
సాక్షి, సిటీబ్యూరో: అంతుచిక్కని అంటు రోగం.. కొమ్ములు తిరిగిన కొత్త వైరస్.. ముట్టుకుంటే అంటుకునే గుణం.. చివరకు తుమ్మినా.. దగ్గినా.. భయమే.. మందుల్లేవు.. చికిత్సపై వైద్యులకు అవగాహన లేదు. కంటికి కన్పించని ఆ కొత్త వైరస్ అతి కొద్ది కాలంలోనే ఖండాంతరాలు దాటి మార్చి రెండో తేదీన నగరంలోకి ప్రవేశించింది. ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోగా.. మరెంతో మంది కనీసం కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. కరోనాపై పోరులో అహర్నిశలు శ్రమించి.. చివరకు పైచేయి సాధించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి రోజుల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి 35 వేల మందికి వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి పీడియాట్రిక్ వార్డులో 510 మంది పిల్లలు చికిత్స పొందారు. వీరిలో పుట్టుకతోనే కిడ్నీ సబంధిత సమస్యతో బాధపడుతున్న వారు 25 మంది శిశువులు ఉండగా, కేన్సర్ 20, కాలేయం 15, ఫిట్స్ 30, హృద్రోగం 20, మధుమేహం ముగ్గురు బాధితులు ఉన్నారు. 40 మంది చిన్నారులు మినహా మిగిలిన వారందరినీ కాపాడారు. ఇక గైనకాలజీ విభాగం వైద్యులు 950 మంది కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 100 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఉన్నారు. తల్లిదండ్రులు వదిలేస్తే.. ‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న దుండిగల్‌కు చెందిన కార్తీక్(4)కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో కోవిడ్ వార్డు లేకపోవడంతో.. గాంధీకికు తరలించారు. ఆ తర్వాత కనీసం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు కూడా ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బాలుడు తల్లడిల్లిపోయాడు. తరచూ గుక్కపట్టి ఏడ్చేవాడు. విషయం తెలిసి విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్సులే అమ్మలా అక్కున చేర్చుకున్నారు. ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు, బిస్కెట్లు, అన్నం తినిపించారు. జోలపాడి నిద్ర పుచ్చారు. 14 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. అయినా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాలేదు. చివరకు పోలీసుల సాయంతో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సి వచ్చింది’. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సులు తల్లిలా ఆదరించారు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి, ఉక్కపోతతో శరీరమంతా చెమటలు కక్కుతుంటే చిన్నారులకు వారు అన్నీ తామై సపర్యలు చేశారు. వైద్యులకు చాలెంజ్‌గా డౌన్‌సిండ్రోమ్ కేసు అరుదైన డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతున్న మూడు నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రికి రావడంతోనే వెంటిలేటర్‌పై వచ్చింది. ఇలాంటి వారు బతకడం కష్టం. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు తోడు.. గుండె, కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. క్లిష్టమైన ఈ కేసులను విభాగాధిపతి డాక్టర్ జార్జ్ నేృత్వంలో డాక్టర్లు సుచిత్ర, జయలక్ష్మి, శ్రీకాంత్భట్, ఉమాదేవి, శివరాం ప్రసాద్, మధుసూదన్, రమ్యతో కూడిన వైద్య బృందం చాలెంజ్‌గా తీసుకుని సేవలు అందించిందని పీడియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ సందనాల తెలిపారు. బిడ్డను బతికించాలని.. మహబూబ్‌నగర్‌కు చెందిన జాక్వాబ్(23 రోజులు) శిశువుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెలలోపు శిశువుకు కోవిడ్ నిర్ధారణ కావడం దేశంలోనే తొలిది. లూజ్మోషన్తో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో తల్లికి నెగిటివ్ రాగా.. శిశువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాగైనా తన బిడ్డను బతికించాలని తల్లి వైద్యులను వేడుకుంది. ఆ పసిగుడ్డును తాము కంటికి రెప్పలా చూసుకున్నట్లు స్టాఫ్‌నర్సులు విమల, సత్య, శాంత, శిరీష తెలిపారు. కోలుకున్న బిడ్డను తల్లికి అప్పగించినప్పుడు వారు చెప్పిన కృతజ్ఞతలను ఇప్పటికీ మర్చిపోలేమన్నారు. గాంధీలో మొత్తం పడకలు 1800 ఆస్పత్రిలో తొలి పాజిటివ్కేసు నమోదు మార్చి 2 చికిత్స పొందిన కోవిడ్ బాధితులు 35,000 12 ఏళ్లలోపు చిన్నారులు 510 కరోనా బాధిత గర్భిణులకు చేసిన ప్రసవాలు 950 సిజేరియన్ ప్రసవాలు 612 సహజ ప్రసవాలు 338 కోవిడ్ బారిన పడిన వారికి చేసిన ఇతర సర్జరీలు 250 కోవిడ్ సోకిన వారిలో కిడ్నీ బాధితులు 3,000 డయాలసిస్ సేవలు 7,000 బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 40 % 103 ఏళ్ల వారు ఒకరు చికిత్స పొందిన గర్భిణులు 400 వైరస్ బారిన పడిన వైద్య సిబ్బంది 68 చదవండి: వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : నీతా అంబానీ -
400 మంది గర్భిణులతో మెగా సీమంతం!
సాక్షి, గజ్వేల్: ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కేబీఆర్ ట్రస్టు చైర్మన్ కొన్యాల బాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత ఆధ్వర్యంలో గర్భిణులకు బుధవారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 400లకు పైగా గర్భిణులు పాల్గొన్నారు. గర్భిణులకు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, ఎంపీటీసీ మమతలతో పాటు మహిళా ప్రజా ప్రతినిథులు సాంప్రదాయ పద్ధతిలో కుంకుమ బొట్టు, గాజులు, నూతన వస్త్రాలను అందజేశారు. వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్షీరసాగర్ హోమియోపతి ఆస్పత్రి వైద్యుడు హుమేశ్, సింగన్నగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సామాజిక కార్యక్రమాలను నిర్వహించే కేబీఆర్ ట్రస్టు చైర్మన్ బాల్‌రెడ్డిని ఆయా గ్రామాల ప్రజాప్రతినిథులు, నాయకులు, గ్రామస్తులు అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీలు హరిబాబు, అశ్విత, టీఆర్ఎస్ యూత్‌విభాగం రాష్ర కార్యదర్శి బట్టు అంజిరెడ్డి, నాయకులు అర్జున్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పసిబిడ్డలకూ గండం
సాక్షి, అమరావతి: తొమ్మిది మాసాలు కడుపులో ఉన్నప్పుడే కాదు బిడ్డను ప్రసవించాక కూడా ఆ చిన్నారికి తల్లే రక్షణ కవచం. అలాంటి తల్లి నుంచే బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యంతో పసిబిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఇది. వివరాల్లోకి వెళితే.. మన రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చితే వారి నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా ఉండాలంటే నెవరపిన్ సిరప్ విధిగా వేయాలి. అయితే రాష్ట్రంలో నెవరపిన్ సిరప్ పూర్తిగా అయిపోయింది. పొరుగునే ఉన్న తెలంగాణ ముందస్తు జాగ్రత్తతో కొనుగోలు చేసి నవజాత శిశువులకు అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. చిన్నారులకు పొంచివున్న ముప్పు మన రాష్ట్రంలో నెలకు సగటున 100 నుంచి 120 మంది హెచ్ఐబీ బాధిత మహిళలు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి వస్తున్నారు. వీరి నుంచి చిన్నారులను కాపాడేందుకు నెవరపిన్ సిరప్ వేయాలి. దీన్ని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో) సరఫరా చేసేది. అయితే రెండు నెలల క్రితం తాము సరఫరా చేయలేమని, రాష్ట్రాలే సమకూర్చుకోవాలని చెప్పింది. వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లులు భయాందోళన చెందుతున్నారు. డాక్టరును అడిగితే స్టాకులేదని చెబుతున్నారని తల్లులు చెబుతున్నారు. తాము ఎలాగూ చేయని తప్పునకు విధివంచితులమయ్యామని, మా చిన్నారులను బలిచేయవద్దని వారు ఎంత బతిమలాడుకున్నా పట్టించుకునే వారేలేరు. మాత్రను ఐదు సమభాగాలుగా చేసి... నెవరపిన్ సిరప్ అనేది చిన్నారులకు వెయ్యడం చాలా సులభం. కానీ ఆ సిరప్ వెయ్యకుండా మాత్రలు వెయ్యాలని చెబుతున్నారు. ఆ మాత్రలేమో ఒక్కోటి 50 మిల్లీ గ్రాములవి. దీన్ని ఐదు సమభాగాలు చేసి దాన్ని తల్లిపాలలోగానీ, కాచి చల్లార్చిన పాలలోగానీ కలిపి తాగించాలి. కానీ ఈ మాత్రను ఐదు సమభాగాలు చేయడం కష్టం. ఎక్కువో తక్కువో అయ్యిందంటే బిడ్డకు ఇబ్బంది. అధికారులేమో సిరప్ లేదు ఇక మాత్రలు వేసుకోవాల్సిందే అంటూ సెలవిస్తున్నారు. పుట్టిన రోజు నుంచి 6 వారాల వరకూ ఈ సిరప్ వెయ్యాలి. ఆ తర్వాత 18 వారాల వరకూ సెప్ట్రాన్ అనే సిరప్ వెయ్యాలి. ఆ సిరప్‌ను కూడా హెచ్ఐవీ బాధితులు వైద్యానికి వచ్చే ఐసీటీసీ సెంటర్లలో ఉంచకుండా ప్రభుత్వాసుపత్రుల్లోని సాధారణ ఫార్మసీలలో ఉంచుతున్నారు. అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు. అక్కడేమో మందుల కోసం జనం బారులు తీరి నిలబడి ఉండటంతో హెచ్ఐవీ తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం సరఫరా ఆపేసింది గతంలో కేంద్రం సరఫరా చేసేది. ఇప్పుడు ఆపేసింది. ఈ సిరప్‌ను తెప్పించేందుకు బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీతో మాట్లాడాం. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకూ మాత్రలను పౌడర్ చేసి ఐదు సమభాగాలుగా చేసి వెయ్యమని చెప్పాం. సిరప్ రాగానే సరఫరా చేస్తాం. –డా.రాజేంద్రప్రసాద్, అదనపు సంచాలకులు (ఏపీశాక్స్) -
తల్లికి కడుపు కోత..!
మార్కాపురం : పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందోనని ఆశతో ధర్మాస్పత్రికి వెళ్లిన మహిళకు కడపుకోత మిగులుతోంది. ప్రసవాన్ని సాధారణంగా కాకుండా సిజేరియన్ చేస్తూ కాసులు వసూలు చేస్తుండటంతో పేద మహిళలు తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇలాంటి బాధాకర ఘటనలు మార్కాపురం ఏరియా వైద్యశాలలో జరుగుతున్నా పర్యవేక్షించి చర్యలు తీసుకొనే అధికారులు కనిపించడంలేదు. సమర్థించుకుంటున్న వైద్యులుపండంటి బిడ్డను కనాలని నెలలు నిండి నొప్పులు రాగానే వైద్యశాలకు వెళ్తే సాధారణ కాన్పు చేయాల్సిన వైద్యులు కాసుల కోసం చేయి చాస్తున్నారు. ఇటీవల కాలంలో కాన్పుల కోసం వైద్యశాలకు వెళ్లిన వారంతా సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని బయటకు వస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి కొంత మంది వైద్యులు ఆపరేషన్లకు అందమైన భాష్యం చెబుతున్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తాము ఆపరేషన్లు చేస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. పశ్చిమ ప్రకాశానికి ఏకైక వంద పడకల వైద్యశాల ఇక్కడే ఉంది. గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల నుంచి ప్రతి రోజూ కాన్పుల కోసం వస్తుంటారు. నిలిచిన నిధులు ఏరియా వైద్యశాలకు వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఇందు కోసం ప్రభుత్వం జననీ సురక్షా యోజన పథకం కింద ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు ఆపరేషన్లు చేసినందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది. సాయంత్రం 4 నుంచి ఉదయం 9గంటల వరకు ఆపరేషన్లు చేసినట్లయితే రూ. 1500 చెల్లిస్తుంది. కాగా గత 4 నెలల నుంచి ప్రభుత్వ నిధులను నిలిపి వేసింది. దీనితో ఆపరేషన్లు చేసే డాక్టర్లకు ఫీజులు రావటం లేదు. సిజేరియన్‌కు నిబంధనలు ఇవే.. మొదటి కాన్పు అయితే నొప్పులు రాగానే వైద్యశాలలో 24 నుంచి 36 గంటల వరకు వేచి చూడాలి. రెండో కాన్పు అయితే 12 గంటల వరకు చూడవచ్చు. మూడో కాన్పు అయితే 6 గంటల వరకు వేచి చూడాలి. తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే సిజేరియన్ చేయవచ్చు. ఇప్పుడేం జరుగుతోంది? ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు చేసే విషయంలో మత్తు డాక్టర్ లేకపోవటంతో వేరే డాక్టర్‌ను తీసుకొస్తున్నారు. అయితే అతను ఎవరో కాదు.. వైద్యశాలలోనే మరో విభాగంలో పని చేసే డాక్టరే. తనకు సంబంధం లేని డ్యూటీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని రోగి బంధువుల నుంచి 2 నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడికి చీరాల ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పలువురు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. సదరు డాక్టర్ ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తే కావటంతో ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద ఏరియా వైద్యశాలలో కాన్పు కావాలంటేæ మత్తు డాక్టర్, సర్జరీ చేసే డాక్టర్, వైద్య సిబ్బందికి కలిపి రూ. 5 నుంచి రూ. 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్లు చేస్తే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి ఏరియా వైద్యశాలలో సాధారణ కాన్పుల కంటే సర్జరీలే ఎక్కువగా జరిగాయి. అత్యవసరమైతేనే సర్జరీలు: మార్కాపురం ఏరియా వైద్యశాలకు కాన్పు కోసం వస్తే అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ చేస్తున్నాం. తల్లీబిడ్డల్లో ఎవరికి ప్రమాదమైనా సిజేరియన్‌కు ప్రాధాన్యత ఇస్తాం. లేకపోతే మామూలు కాన్పులే చేస్తున్నాం. వైద్యశాలలో మత్తు డాక్టర్ లేకపోవటంతో బయటి నుంచి పిలిపిస్తున్నాం. మత్తు డాక్టర్‌ను నియమించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను, జిల్లా కో ఆర్డినేటర్‌ను కోరాం. -డాక్టర్ ఆంజనేయులు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, -
సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం..
బుడి బుడి నడకల చిన్నారి గురించిన కలల్లో తేలిపోయే కాబోయే తల్లులు చేసిన క్యాట్‌వాక్ కనువిందు చేసింది. అమ్మాయి పోస్ట్ వదిలేస్తూ మరికొన్ని నెలల్లో అమ్మ హోదాను అందుకోబోతున్న ఆనందాన్ని ప్రతిఫలింపజేశారు ప్రెగ్నెంట్ లేడీస్. సమాజానికి భావిరత్నాలను అందించి బంగారు తల్లులు కానున్న మహిళలు తాము గర్భం దాల్చిన తొలినాటి సంగతులు పంచుకుని సందడి సృష్టించారు. తల్లులు- పిల్లల అంశంపై వెలువడే ప్రసిద్ధ చైల్డ్ మేగ్జైన్, నగరానికి చెందిన మూలకణ నిధి నిర్వహణ సంస్థ కార్డ్లైఫ్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్ వినూత్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే తల్లులు పంచుకున్న మధురానుభూతులు ఆహూతులను అలరించాయి. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పిన వారి నుంచి విజేతలను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్లో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే సమాచారాన్ని అందించడంతో పాటుగా గర్భిణులకు ఉపయోగడే దుస్తులు, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించే స్టాల్స్ సైతం ఏర్పాటు చేశారు. ‘గర్భంతో ఉన్నప్పటి నుంచి తీసుకునే జాగ్రత్తలే గుడ్ పేరెంట్‌గా తీర్చిదిద్దుతాయి. ఈ అవగాహన అందరిలో కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్‌కు రూపకల్పన చేశాం’ అని చెప్పారు చైల్డ్ మేగ్జైన్ ఎడిటర్ గీతిక. తొలిగా సిటీలో నిర్వహించిన ఈ ఈవెంట్‌ను తర్వాత ముంబయి, బెంగళూరు, ఢిల్లీలకు సైతం తీసుకెళ్లనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ ఇషితాసింగ్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ..:: సిటీప్లస్