
ప్రతీకాత్మక చిత్రం
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందులను వాడకూడదంటూ డాక్టర్లు ఆంక్షలు పెడతారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. నిజానికి మనం చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతవైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అది గర్భవతుల విషయంలో ఏమాత్రం చేయకూడదు. అది వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెడుతుంది. మామూలు వ్యక్తులు సైతం ఆన్‌కౌంటర్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదనేది వైద్యుల మాట.
అందునా గర్భవతులు వాడటం వల్ల వారికి మాత్రమే కాకుండా... అది కడుపులో బిడ్డకు సైతం ఎన్నో రకాలుగా కీడు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... కాబోయే తల్లులు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల సాధారణ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు (అనటామికల్ అబ్‌నార్మాలిటీస్) రావచ్చు.
ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు వాటిని సూచిస్తారు. అవి మాత్రమే... అందునా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment