గాంధీ ఆస్పత్రిలో చిన్నారులకు సేవ చేస్తోన్న వైద్య సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: అంతుచిక్కని అంటు రోగం.. కొమ్ములు తిరిగిన కొత్త వైరస్.. ముట్టుకుంటే అంటుకునే గుణం.. చివరకు తుమ్మినా.. దగ్గినా.. భయమే.. మందుల్లేవు.. చికిత్సపై వైద్యులకు అవగాహన లేదు. కంటికి కన్పించని ఆ కొత్త వైరస్ అతి కొద్ది కాలంలోనే ఖండాంతరాలు దాటి మార్చి రెండో తేదీన నగరంలోకి ప్రవేశించింది. ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోగా.. మరెంతో మంది కనీసం కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. కరోనాపై పోరులో అహర్నిశలు శ్రమించి.. చివరకు పైచేయి సాధించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు.
ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి రోజుల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి 35 వేల మందికి వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి పీడియాట్రిక్ వార్డులో 510 మంది పిల్లలు చికిత్స పొందారు. వీరిలో పుట్టుకతోనే కిడ్నీ సబంధిత సమస్యతో బాధపడుతున్న వారు 25 మంది శిశువులు ఉండగా, కేన్సర్ 20, కాలేయం 15, ఫిట్స్ 30, హృద్రోగం 20, మధుమేహం ముగ్గురు బాధితులు ఉన్నారు. 40 మంది చిన్నారులు మినహా మిగిలిన వారందరినీ కాపాడారు. ఇక గైనకాలజీ విభాగం వైద్యులు 950 మంది కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 100 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఉన్నారు.
తల్లిదండ్రులు వదిలేస్తే..
‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న దుండిగల్‌కు చెందిన కార్తీక్(4)కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో కోవిడ్ వార్డు లేకపోవడంతో.. గాంధీకికు తరలించారు. ఆ తర్వాత కనీసం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు కూడా ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బాలుడు తల్లడిల్లిపోయాడు. తరచూ గుక్కపట్టి ఏడ్చేవాడు. విషయం తెలిసి విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్సులే అమ్మలా అక్కున చేర్చుకున్నారు.
ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు, బిస్కెట్లు, అన్నం తినిపించారు. జోలపాడి నిద్ర పుచ్చారు. 14 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. అయినా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాలేదు. చివరకు పోలీసుల సాయంతో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సి వచ్చింది’. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సులు తల్లిలా ఆదరించారు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి, ఉక్కపోతతో శరీరమంతా చెమటలు కక్కుతుంటే చిన్నారులకు వారు అన్నీ తామై సపర్యలు చేశారు.
వైద్యులకు చాలెంజ్‌గా డౌన్‌సిండ్రోమ్ కేసు
అరుదైన డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతున్న మూడు నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రికి రావడంతోనే వెంటిలేటర్‌పై వచ్చింది. ఇలాంటి వారు బతకడం కష్టం. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు తోడు.. గుండె, కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. క్లిష్టమైన ఈ కేసులను విభాగాధిపతి డాక్టర్ జార్జ్ నేృత్వంలో డాక్టర్లు సుచిత్ర, జయలక్ష్మి, శ్రీకాంత్‌భట్, ఉమాదేవి, శివరాం ప్రసాద్, మధుసూదన్, రమ్యతో కూడిన వైద్య బృందం చాలెంజ్‌గా తీసుకుని సేవలు అందించిందని పీడియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ సందనాల తెలిపారు.
బిడ్డను బతికించాలని..
మహబూబ్‌నగర్‌కు చెందిన జాక్వాబ్(23 రోజులు) శిశువుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెలలోపు శిశువుకు కోవిడ్ నిర్ధారణ కావడం దేశంలోనే తొలిది. లూజ్‌మోషన్‌తో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో తల్లికి నెగిటివ్ రాగా.. శిశువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాగైనా తన బిడ్డను బతికించాలని తల్లి వైద్యులను వేడుకుంది. ఆ పసిగుడ్డును తాము కంటికి రెప్పలా చూసుకున్నట్లు స్టాఫ్‌నర్సులు విమల, సత్య, శాంత, శిరీష తెలిపారు. కోలుకున్న బిడ్డను తల్లికి అప్పగించినప్పుడు వారు చెప్పిన కృతజ్ఞతలను ఇప్పటికీ మర్చిపోలేమన్నారు.
గాంధీలో మొత్తం పడకలు 1800
ఆస్పత్రిలో తొలి పాజిటివ్‌కేసు నమోదు మార్చి 2
చికిత్స పొందిన కోవిడ్ బాధితులు 35,000
12 ఏళ్లలోపు చిన్నారులు 510
కరోనా బాధిత గర్భిణులకు చేసిన ప్రసవాలు 950
సిజేరియన్ ప్రసవాలు 612
సహజ ప్రసవాలు 338
కోవిడ్ బారిన పడిన వారికి చేసిన ఇతర సర్జరీలు 250
కోవిడ్ సోకిన వారిలో కిడ్నీ బాధితులు 3,000
డయాలసిస్ సేవలు 7,000
బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 40 %
103 ఏళ్ల వారు ఒకరు
చికిత్స పొందిన గర్భిణులు 400
వైరస్ బారిన పడిన వైద్య సిబ్బంది 68
Comments
Please login to add a commentAdd a comment