బిడ్డకు జన్మనివ్వడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. గర్భం దాల్చింది మొదలు శరీరంలో అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటారు. హార్మోన్లలో తేడాలొస్తాయి. వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్ లాంటివి మరింత ఇబ్బందిపెడతాయి. వీడికి తోడు అనేక ఏం తినాలి? ఇలా ఎందుకు అయింది? ఇదేమైనా ప్రమాదమా? లోపల బేబీ బాగానే ఉందా? బిడ్డ బాగానే ఎదుగుతోందా? వ్యాయామం చేయాలా? వద్దా? ఇలా సవాలక్ష సందేహాలు కాబోయే తల్లుల బుర్రల్ని తొలుస్తూ ఉంటాయి?
బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి మంచిపోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలోవ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది పెద్ద ప్రశ్న.అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన తేలిగ్గా ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు జననాలను నివారించవచ్చు.
గర్భం దాల్చడం అపురూపమే కానీ, కనీస శారీక శ్రమ చేయకూడనంత కాదు. గర్బిణీలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కొన్ని వ్యాయామాలు చేయడంద్వారా సుఖ ప్రసవం జరుగుతుంది. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. అధిక బరువు , గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం లేదా ప్రీఎక్లంప్సియా వంటి అధిక రక్తపోటు రుగ్మతలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడిని తేలికపాటి వ్యాయామం తగ్గిస్తుంది. పొట్ట పెరుగుతున్నపుడు వచ్చే నడుం నొప్పి తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ముందు మీ గైనగాలజిస్ట్ సలహా తప్పకుండా తీసుకోవాలి. వారి సలహా మేరకు నాలుగో నెల నుంచి సాధారణం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ప్రజారోగ్య మార్గదర్శకాల ప్రకారం గర్భిణీలు వారానికి సుమారు 150 నిమిషాలు (లేదా రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వాకింగ్ చేయవచ్చు. వార్మ్-అప్ ,కూల్-డౌన్ వ్యాయామాలు ఎంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంకోసం తేలికపాటి యోగా చేయవచ్చు.
గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. తల్లి స్నానం చేసేటపుడు, పొట్టమీద ఒకసారి వేడి నీళ్లు (సమవేడి) మరోసారి చల్ల నీళ్లను పోసుకుంటూ వాటర్ థెరపీలా చేసుకోవాలట. దీని వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని చెబుతారు. అరగంట సమయానికి పరిమితం కావడం మంచిది. ఏదైనా తేడాగా అనిపించినా, అలసటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.
అలాగే సడన్‌గా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తకూడదు. ఏ వ్యాయామం అయినా, మితంగా చేయడం ముఖ్యం. అలసిపోయే దాకా చేయకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో బిడ్డ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment