ఏరియా వైద్యశాల ఇదే..
మార్కాపురం : పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందోనని ఆశతో ధర్మాస్పత్రికి వెళ్లిన మహిళకు కడపుకోత మిగులుతోంది. ప్రసవాన్ని సాధారణంగా కాకుండా సిజేరియన్ చేస్తూ కాసులు వసూలు చేస్తుండటంతో పేద మహిళలు తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇలాంటి బాధాకర ఘటనలు మార్కాపురం ఏరియా వైద్యశాలలో జరుగుతున్నా పర్యవేక్షించి చర్యలు తీసుకొనే అధికారులు కనిపించడంలేదు. సమర్థించుకుంటున్న వైద్యులుపండంటి బిడ్డను కనాలని నెలలు నిండి నొప్పులు రాగానే వైద్యశాలకు వెళ్తే సాధారణ కాన్పు చేయాల్సిన వైద్యులు కాసుల కోసం చేయి చాస్తున్నారు.
ఇటీవల కాలంలో కాన్పుల కోసం వైద్యశాలకు వెళ్లిన వారంతా సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని బయటకు వస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి కొంత మంది వైద్యులు ఆపరేషన్లకు అందమైన భాష్యం చెబుతున్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తాము ఆపరేషన్లు చేస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. పశ్చిమ ప్రకాశానికి ఏకైక వంద పడకల వైద్యశాల ఇక్కడే ఉంది. గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల నుంచి ప్రతి రోజూ కాన్పుల కోసం వస్తుంటారు.
నిలిచిన నిధులు
ఏరియా వైద్యశాలకు వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఇందు కోసం ప్రభుత్వం జననీ సురక్షా యోజన పథకం కింద ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు ఆపరేషన్లు చేసినందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది. సాయంత్రం 4 నుంచి ఉదయం 9గంటల వరకు ఆపరేషన్లు చేసినట్లయితే రూ. 1500 చెల్లిస్తుంది. కాగా గత 4 నెలల నుంచి ప్రభుత్వ నిధులను నిలిపి వేసింది. దీనితో ఆపరేషన్లు చేసే డాక్టర్లకు ఫీజులు రావటం లేదు.
సిజేరియన్‌కు నిబంధనలు ఇవే..
- మొదటి కాన్పు అయితే నొప్పులు రాగానే వైద్యశాలలో 24 నుంచి 36 గంటల వరకు వేచి చూడాలి.
- రెండో కాన్పు అయితే 12 గంటల వరకు చూడవచ్చు.
- మూడో కాన్పు అయితే 6 గంటల వరకు వేచి చూడాలి.
- తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే సిజేరియన్ చేయవచ్చు.
ఇప్పుడేం జరుగుతోంది?
ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు చేసే విషయంలో మత్తు డాక్టర్ లేకపోవటంతో వేరే డాక్టర్‌ను తీసుకొస్తున్నారు. అయితే అతను ఎవరో కాదు.. వైద్యశాలలోనే మరో విభాగంలో పని చేసే డాక్టరే. తనకు సంబంధం లేని డ్యూటీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని రోగి బంధువుల నుంచి 2 నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడికి చీరాల ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పలువురు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. సదరు డాక్టర్ ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తే కావటంతో ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మొత్తం మీద ఏరియా వైద్యశాలలో కాన్పు కావాలంటేæ మత్తు డాక్టర్, సర్జరీ చేసే డాక్టర్, వైద్య సిబ్బందికి కలిపి రూ. 5 నుంచి రూ. 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్లు చేస్తే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి ఏరియా వైద్యశాలలో సాధారణ కాన్పుల కంటే సర్జరీలే ఎక్కువగా జరిగాయి.
అత్యవసరమైతేనే సర్జరీలు:
మార్కాపురం ఏరియా వైద్యశాలకు కాన్పు కోసం వస్తే అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ చేస్తున్నాం. తల్లీబిడ్డల్లో ఎవరికి ప్రమాదమైనా సిజేరియన్‌కు ప్రాధాన్యత ఇస్తాం. లేకపోతే మామూలు కాన్పులే చేస్తున్నాం. వైద్యశాలలో మత్తు డాక్టర్ లేకపోవటంతో బయటి నుంచి పిలిపిస్తున్నాం. మత్తు డాక్టర్‌ను నియమించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను, జిల్లా కో ఆర్డినేటర్‌ను కోరాం.
-డాక్టర్ ఆంజనేయులు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్,
Comments
Please login to add a commentAdd a comment