
నా వయసు 19 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇన్‌సైడర్ స్ట్రెస్‌కు గురవుతున్నాను. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అదనంగా విడుదల అవుతుందని చదివాను. దీని వల్ల ఇర్‌రెగ్యులర్, పెయిన్ సమస్యలు వస్తాయా? లాక్‌డౌన్ నేపథ్యంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టి పీరియెడ్ ప్రొడక్ట్స్ విషయంలో ప్రత్యమ్నాయాలు చూసుకునే వీలుందా?
– జె.కీర్తి, అంబాజీపేట
ఇప్పుడున్న పరిస్థితుల వల్లే కాకుండా, చాలామంది సాధారణంగా కూడా లేదా అనేక పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ స్ట్రెస్ వల్ల మెదడు నుంచి కొన్ని హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. నరాలు కూడా ఎక్కువ ప్రేరేపణ చెందుతాయి. వీటివల్ల అడ్రినల్ గ్రంథి నుంచి స్ట్రెస్ హార్మోన్స్ అయిన అడ్రినలిన్, కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతాయి. వీటి వల్ల తాత్కాలికంగా గుండెదడ, బీపీ, కోపం బాగా బలంగా అనిపించడం వంటి ప్రభావాలు ఉంటాయి. దీర్ఘకాలం స్ట్రెస్ ఉన్నవాళ్లలో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, జీర్ణవ్యవస్థ మందగించడం, నిద్రాభంగం, డిప్రెషన్, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారిలో కొందరు బరువు పెరుగుతారు. కొందరు బరువు తగ్గుతారు. మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.
అలాగే పీరియడ్స్ క్రమం తప్పి కొందరిలో పీరియడ్స్ నెలనెలా రాకపోవడం, ఆలస్యంగా రావడం, కొందరిలో బ్లీడింగ్ కొద్దిగానే అవడం, ఇంకొందరిలో బ్లీడింగ్ ఆగకుండా ఎక్కువ అవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరిలో ఒంటినొప్పులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కొద్దిగా ఉండవచ్చు. కాబట్టి మానసిక ఒత్తిడి వీలైనంత వరకు తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, వాకింగ్, వ్యాయామాలు, పాజిటివ్ దృక్పథం కలిగి ఉండి మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో నాప్‌కిన్స్ లేకపోతే పీరియడ్స్ సమయంలో కాటన్ బట్టలను బాగా శుభ్రంగా ఉతికి, ఎండలో ఎండబెట్టి వాడుకోవచ్చు. వీటిని రోజుకు రెండు మూడుసార్లు మార్చుకుంటూ ఉండాలి.
గర్భిణి స్త్రీలు అరపటిపండ్లు తినవచ్చా? ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలి? గర్భిణులకు సంబంధించి మెనూ (బ్రెక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు) ఎలా ఉంటే బాగుంటుంది? ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాంటాసిడ్ టాబ్లెట్ల అవసరం ఏమిటి? – పి.వినుత, అనంతపురం
గర్భిణి స్త్రీలు అరటిపండ్లు తినకూడదనే నియమం ఏమీ లేదు. అరటి పండ్లలో ఎక్కువ మోతాదులో పిండి పదార్థాలు, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలు వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల బలహీనంగా, నీరసంగా ఉంటే తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే అరటిపండ్లలో ఉన్న పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడతాయి. అరటిపండ్లలో ఉండే పీచు పదార్థాల వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం లేకుండా ఉంటుంది. కాకపోతే అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా ఉన్నవారిలో, ఫ్యామిలీలో సుగర్ వ్యాధి ఉన్నవారిలో అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు ఇంకా ఎక్కువగా పెరగడం, రక్తంలో సుగర్ శాతం పెరగడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని వీలైనంత వరకు అరటిపండ్లను తక్కువగా తీసుకోమని చెబుతారు.
లేదా అరటిపండు తీసుకున్నప్పుడు మిగతా ఆహారం తక్కువగా తీసుకోమని సూచిస్తారు. దానిమ్మ, నారింజ, కివి, ఆపిల్, ద్రాక్ష వంటి అన్ని పండ్లను గర్భిణులు మితంగా తీసుకోవచ్చు. గర్భిణులు ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. పొద్దున్న 8 గంటల లోపు పాలు, టిఫిన్, 11 గంటల లోపు పండ్లు, మధ్యాహ్నం 1 గంటకు పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగుతో కూడిన భోజనం, సాయంత్రం 4 గంటలకు పండ్లు, ఏవైనా స్నాక్స్, రాత్రి 7 గంటలకు భోజనం, పడుకునే ముందు పాలు తీసుకోవచ్చు. గర్భిణిలు వీలైనంత వరకు బయట రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. బయట ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఎండాకాలంలోనైతే సన్‌స్క్రీన్ లోషన్‌లు రాసుకోవడం, ఎండ తగలకుండా గొడుగు తీసుకుపోవడం, నీళ్లు బాగా తాగడం వంటివి చేయాలి. చలికాలంలోనైతే మాయిశ్చరైజర్లు ఉపయోగించాలి. బయటకు వెళ్లేటప్పుడు వులెన్ దుస్తులు వేసుకుని వెళ్లాలి. గర్భిణిలలో పొట్ట పెరిగే కొద్దీ తినేది గొంతులోకి వచ్చినట్లు ఉండటం, గొంతులో మంట, అజీర్తి, ఎసిడిటీ వంటివి ఉంటాయి. ఈ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చికిత్సలో భాగంగా యాంటాసిడ్ మాత్రలను వాడమని సూచించడం జరుగుతుంది.
డా. వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment