ఈ వయసులో ట్రై చేయొచ్చా? | Venati Shobha Women Health Suggestions In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఈ వయసులో ట్రై చేయొచ్చా?

Published Sun, Apr 5 2020 10:51 AM | Last Updated on Sun, Apr 5 2020 3:34 PM

Venati Shobha Women Health Suggestions In Sakshi Funday

నా వయసు 34. నాకు ఇరవయ్యేళ్లు ఉన్నప్పుడు పెళ్లయ్యింది. కానీ పొరపొచ్చాలు వచ్చి భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. అప్పటి నుంచీ ఒంటరిగానే ఉన్నాను. అయితే కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వయసు 38. ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. అయితే నాకు పిల్లల్ని కనాలని ఉంది. కానీ ఇప్పటికే ముప్ఫై అయిదుకు చేరువలో ఉన్నాను కాబట్టి పుడతారో లేదోనని భయమేస్తోంది. ఈ వయసులో నేను పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఒక్క బిడ్డ కలిగినా చాలు. సలహా ఇవ్వండి. – నవత, సంగారెడ్డి

సాధారణంగా ఆడవాళ్లలో ముప్ఫయ్యేళ్లు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. 35 యేళ్లు దాటాక ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. గర్భం దాల్చిన తర్వాత పిండం సరిగ్గా ఎదగక, అబార్షన్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఏర్పడి, అవయవ లోపాలు ఏర్పడవచ్చు. సాధారణ జనాభాలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు 2 శాతం ఉంటే, 30–35 సంవత్సరాల లోపల 4 శాతం, ఆ వయసు దాటాక 6 శాతం ఉంటాయి. మీకు 34 సం‘‘లు కాబట్టి తప్పకుండా గర్భం కోసం ప్రయత్నించవచ్చు.

కాకపోతే సాధారణ గర్భం కోసం ఎక్కువ నెలలు ఎదురు చూడకుండా, ఆరు నెలలు ప్రయత్నించండి. ఆ సమయం దాటివుంటే ఓసారి గైనకాలజిస్టును కలిసి, అవసరమైన హార్మోన్‌ పరీక్షలు, స్కానింగ్‌ వంటివన్నీ చేయించుకోండి. ఆపైన త్వరగా గర్భం రావడానికి మందులు వాడితే మంచిది. ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడుతూ, గర్భం వచ్చిన తర్వాత బిడ్డలో ఏమైనా సమస్యలు ఉంటే ముందే తెలుసుకోవడానికి మూడో నెలలో ఎన్‌.టి.స్కాన్, డబుల్‌ మార్కర్‌ టెస్ట్, ఐదో నెలలో టిఫా స్కాన్, ట్రిపుల్‌ మార్కర్‌ టెస్ట్, ఆరో నెలల 2 డి ఫీటల్‌ ఎకో వంటి పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఏమాత్రం అధైర్య పడకుండా ప్రయత్నించండి. తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది. 

నా వయసు 22. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 80 కిలోలు. ఇంతకు ముందు ఇంత లావు ఉండేదాన్ని కాదు. ఈ మధ్యనే ఎందుకో బాగా పెరిగాను. అలా అని వ్యాయామం లేదని కాదు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లల వెనుక పరుగులు తీస్తూనే ఉంటాను. వెజిటేరియన్స్‌మి కాబట్టి నాన్‌వెజ్‌ కూడా తినను. అయినా ఎందుకిలా బరువు పెరుగుతున్నాను? – కె.పద్మజ, గాజువాక

మీ ఎత్తుకి 60–65 కిలోలు బరువు ఉంటే సరిపోతుంది. అంటే మీరు పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నారు. అధిక బరువు తగ్గాలంటే తప్పకుండా శారీరక శ్రమ అవసరం. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని పనులు చేసినా, దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు. పొద్దున్న, సాయంకాలం నలభై అయిదు నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్, యోగా వంటివి చేయండి. లేదంటే జిమ్‌కి వెళ్లండి. చెమట పట్టేంతగా శ్రమ చేసినప్పుడే ఒంట్లో కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు. అలాగే ఆహార నియమాలు పాటించండి.

అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తీసుకోండి. స్వీట్లు, కొవ్వుతో కూడిన పదార్థాలు, వేపుళ్లు, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవన్నీ చేస్తూ డాక్టర్‌ సలహాతో కొవ్వు తగ్గడానికి మందులు కూడా వాడవచ్చు. ఉన్నట్టుండి బరువు పెరిగానంటున్నారు కాబట్టి థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్, సీబీపీ, ఆర్‌బీఎస్, లిపిడ్‌ ప్రొఫైల్‌ లాంటి రక్త పరీక్షలు చెయ్యించుకుని, ఫలితాలను బట్టి మందులు వాడాలి. 

నా వయసు 24. పెళ్లై ఏడు నెలలు అయ్యింది. ఈ మధ్య నెలసరి రాకపోవడంతో చెకప్‌ చేయించుకుంటే గర్భవతినని తేలింది. అయితే నేను చాలా పొట్టిగా ఉంటాను. నా గర్భసంచి కూడా చాలా చిన్నగా ఉందట. అందులో బిడ్డ సరిగ్గా ఎదగలేదు, బిడ్డను మోసే శక్తి కూడా నీ గర్భసంచికి లేదు, అబార్షన్‌ చేయించుకుంటే మంచిది అన్నారు డాక్టర్‌. నేను నా బిడ్డను చంపు కోలేను. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. – సునంద, నిడదవోలు

గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు... కొందరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం వచ్చాక వారిలో విడుదలయ్యే హార్మోన్లను బట్టి కొద్దిగా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లోపల పెరిగే బిడ్డ... గర్భాశయం విచ్చుకునేదాన్ని బట్టి బరువు పెరుగుతుంది. కొందరిలో అబార్షన్లు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఏడెనిమిది నెలల్లో కాన్పు అయిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పుడు గర్భం వచ్చేసింది కాబట్టి ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ ట్యాబ్లెట్లు, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, నెలనెలా అవసరాన్ని బట్టి స్కానింగ్‌ చేయించుకోండి.

డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండి, 4, 5 నెలల్లో గర్భాశయానికి కుట్లు వేయించుకుని చూడండి. ఇంక వేరే అవకాశం లేదు కాబట్టి ముందే గర్భం తీయించుకునే బదులు, పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. కనీసం బిడ్డ ఏడో నెల దాకా ఎదిగి, ఒక కిలోకి పైన బరువు పెరిగినా మంచిదే. ఇప్పుడున్న ఆధునిక చికిత్సల్లో ఎన్‌.ఐ.సి.యు.లో పెట్టి బిడ్డను బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినా ఫలితం లేనప్పుడు... కాన్పు మీద కాన్పుకి గర్భాశయం కొద్దిగా విచ్చుకుని... ఆ తర్వాత కాన్పుకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.
- డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement