నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.7, బరువు 55 కేజీలు. పెళ్లయి పద్నాలుగు నెలలైంది. పెళ్లయిన ఐదు నెలలకు అబార్షన్ అయింది. మళ్లీ నాలుగు నెలలకు ఇంకోసారి అబార్షన్ అయింది. గత జూన్ 16న పీరియడ్స్ వచ్చాక మళ్లీ ఇప్పటి వరకు రాలేదు. గతనెల 29న బ్రౌన్ స్పాటింగ్ కనిపించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– త్రివేణి, ఈమెయిల్
మీకు రెండుసార్లు– నాలుగో నెలలు, ఐదో నెలలో అబార్షన్లు జరిగాయి. ఆ సమయంలో అబార్షన్లు కావడానికి అనేక కారణాలు ఉంటాయి. పిండం సరిగా పెరగకపోయినా, పిండంలో జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల, ఇన్ఫెక్షన్స్, లేకపోతే గర్భాశయంలో లోపాలు, గర్భాశయ ముఖద్వారం (సెర్విక్స్) చిన్నదిగా ఉండటం లేదా లూజుగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల నాలుగో నెల లేదా ఐదో నెలలో అబార్షన్లు జరగవచ్చు. ఇప్పుడు రెండు నెలలు దాటినా పీరియడ్స్ రాలేదు, ప్రెగ్నెన్సీ కూడా లేదు అంటే మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఉండవచ్చు. లేదా కొందరిలో అండాశయంలో నీటితిత్తులు లేదా సిస్ట్‌లు ఏర్పడటం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. అరుదుగా కొన్నిసార్లు గర్భనిర్ధారణ కోసం వాడే ప్రెగ్నెన్సీ కిట్లు సరిగా పనిచేయకపోయినా వాస్తవానికి గర్భం ఉన్నా, కిట్‌లో లేదనే రావచ్చు. రెండు మూడు వేరే కంపెనీ కిట్లలో పరీక్షించుకుని చూడవచ్చు.
చదవండి: నెలసరి సరిగా రావాలంటే ఏం చేయాలి?
కొందరిలో సీరమ్ హెచ్‌సీజీ రక్తపరీక్షలో తెలిసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్యలకు గల కారణాలను తెలుసుకోవడానికి సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్‌బీఎస్, ఎస్‌ఆర్. టీఎస్‌హెచ్, ఎస్‌ఆర్. ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు, హెచ్‌ఎస్‌జీ, వజైనల్ స్కానింగ్ ద్వారా గర్భాశయ ఆకారం, గర్భాశయంలో పొరలు, గడ్డలు, అండాశయంలో తిత్తులు వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ అయితే దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీ ఎత్తుకి మీరు 60 కేజీల వరకు బరువు ఉండవచ్చు. గర్భం రాకముందు నుంచే 55 కేజీలు ఉన్నారు కాబట్టి, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే వాటికి ముందుగానే చికిత్స తీసుకుని, అదుపులో ఉంచుకోవడం, గర్భాశయంలో లోపాలు ఉంటే హిస్టరోస్కోపీ, ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా సరిచేసుకుని, తర్వాత గర్భం కోసం ప్రయత్నించడం మంచిది.
గర్భం వచ్చిన తర్వాత విటమిన్ మాత్రలతో పాటు అవసరమైతే ప్రొజెస్టిరాన్ మందులు వాడుతూ, బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవడానికి క్రమంగా స్కానింగ్ చేయించుకుంటూ, 16 వారాలకు సెర్విక్స్ లెంగ్త్ ఎలా ఉందో చూసుకుని, ఒకవేళ సెర్విక్స్ చిన్నగా లేదా లూజుగా ఉంటే గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి కంగారు పడకుండా, గైనకాలజిస్టుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
నాకు రెండేళ్ల కిందట పెళ్లయింది. నా వయసు 26 ఏళ్లు, బరువు 59 కిలోలు, ఎత్తు 5.2. అత్తవారింటికి వచ్చాక తరచు పూజలు, వ్రతాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూజలు, వ్రతాలు ఉన్న రోజుల్లో కొన్నిసార్లు నెలసరిని వాయిదా వేసుకోవడానికి మాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. దయచేసి పరిష్కారం చెప్పగలరు.
– చందన, తగరపువలస
సక్రమంగా వచ్చే పీరియడ్స్‌ను మన అవసరాల కోసం ఆపడానికి, వాయి దా వెయ్యడానికి, ఇష్టం వచ్చినట్లు ఎక్కువసార్లు హార్మోన్ మాత్రలు వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అండం విడుదల, పెరుగుదల సరిగా లేకపోవడం, ఎండోమెట్రియమ్ పొర సరిగా పెరగకపోవడం వంటి సమస్యల వల్ల కొంతకాలం ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు, ఆలస్యం ఏర్పడవచ్చు. మీకు వివాహమై రెండేళ్లయినా గర్భం రాలేదు కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యత ఏదైనా ఉందా, అండం సరిగా పెరుగుతోందా లేదా, గర్భాశయంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించి, అవసరమైన రక్తపరీక్షలు, పెల్విక్, ఫాలిక్యులర్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే గర్భం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత వంటివి సరిగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీమెన్ అనాలిసిస్ అనే వీర్యపరీక్ష చేయించుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే గర్భం దాల్చకపోవడానికి 35–40 శాతం మగవారిలో లోపాలు కూడా కారణం అవుతాయి.
డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
చదవండి: కోవిడ్ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చా?
Comments
Please login to add a commentAdd a comment