నా వయసు పదిహేడు. సన్నగా ఉంటాను. పీరియడ్స్ టైమ్‌లో పొత్తికడుపులో బాగా నొప్పి వస్తుంది. ఇది సహజమేనా? లేక భవిష్యత్‌లో దీని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అసలు ఈ నొప్పికి కారణం ఏమిటి? నివారణ మందులు ఉన్నాయా? పీరియడ్స్ టైమ్‌లో నొప్పి లేని వారి కంటే, నొప్పి ఉన్నవారికి పెళ్ళి తరువాత గర్భదారణకు అవకాశాలు ఎక్కువ అని ఒక ఫ్రెండ్ చెప్పింది. ఇందులో నిజం ఎంత ఉంది?
– జీఎన్, గుంటూరు
పీరియడ్స్ సమయంలో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమయంలో సాధారణంగా ప్రోస్టోగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. దానివల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అలాగే ఈ సమయంలో అండం ఫలదీకరణ జరగనప్పుడు ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి, గర్భాశయం లోపలి పొరకు రక్తప్రసరణ తగ్గిపోయి, ఆ పొర బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. ఈ క్రమంలో కూడా నొప్పి రావచ్చు. ఈ హార్మోన్ల మార్పులలో తీవ్రతను బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. దీనివల్ల ఆ రెండు మూడు రోజులు నొప్పి వల్ల ఇబ్బంది తప్పితే వేరే సమస్యలేవీ ఉండవు.
ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఒకటి రెండు రోజులు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. పొత్తి కడుపు మీద వేడినీటి కాపడం పెట్టుకోవచ్చు. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి ఉండవచ్చు. ఈ సమస్యలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొందరిలో నెలనెలా అండం విడుదలయ్యే వారిలో పొత్తికడుపు నొప్పి ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు ఎక్కువ అనేది నిజమే. కాకపోతే పైన చెప్పిన సమస్యల వల్ల నొప్పి వచ్చేవారిలో గర్భధారణకు కొందరిలో అవకాశాలు తక్కువగా ఉండవచ్చు.
నా వయసు 23 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 65 కిలోలు. 2017లో నాకు పెళ్లి జరిగింది. 2018లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో బేబీ హార్ట్‌బీట్ లేదని అబార్షన్ అయింది. రీసెంట్‌గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో అదే సమస్య వచ్చింది. అలా ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదు. నా భర్త హెల్త్ రిపోర్ట్ కూడా నార్మల్‌గానే ఉంది, నా హెల్త్ రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– మెహరున్నీసా ఖాన్
గర్భం దాల్చిన తర్వాత గర్భాశయంలో చివరి పీరియడ్ అయిన రోజు నుంచి ఆరు వారాలకు పిండం ఏర్పడి, దానిలో హార్ట్‌బీట్ మొదలవుతుంది. కొందరిలో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల, కొన్ని తెలియని కారణాల వల్ల, అండం నాణ్యత లేదా వీర్యకణాల నాణ్యత సరిగా లేకపోయినా, పిండం సరిగా ఏర్పడకుండా, గర్భం ధరించినా హార్ట్‌బీట్ రాదు. కొందరిలో హార్ట్‌బీట్ మొదలైనా, కొన్ని వారాల తర్వాత హార్ట్‌బీట్ మళ్లీ ఆగిపోవచ్చు. దీనినే మిస్డ్ అబార్షన్ అంటారు. మీ ఇద్దరికీ రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయన్నారు. మీ వయసు కూడా చిన్నదే. కాని రెండుసార్లు పిండంలో హార్ట్‌బీట్ రాలేదు. కొన్నిసార్లు కనిపించే కారణాలేవీ లేకపోయినా అండం, వీర్యకణం ఫలదీకరణ చెందే క్రమంలో పిండంలో ఏమైనా అవకతవకలు జరిగినా కూడా పిండంలో హార్ట్‌బీట్ రాకపోవచ్చు. కాబట్టి ఈసారి మళ్లీ గర్భం కోసం ప్రయత్నించడానికి కనీసం మూడు నెలల వ్యవధి తీసుకోండి. ఈ సమయంలో వ్యాయామాలు, యోగా వంటివి చేసి కొద్దిగా బరువు తగ్గడం మంచిది. అలాగే మీ ఇద్దరూ ముందు నుంచే మంచి పౌష్టికాహారం మితంగా తీసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వేసుకోవడం మంచిది.
రెండుసార్లు అబార్షన్ అయింది కాబట్టి, ఒకసారి మీ హెల్త్ రిపోర్ట్స్‌లో థైరాయిడ్ టెస్ట్, యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటీబాడీస్, ఏపీటీటీ వంటి పరీక్షలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే డాక్టర్‌ను సంప్రదించి ఈ పరీక్షలు, ఇంకా అబార్షన్లు అవడానికి మీ ఇద్దరిలో జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కారియోటైపింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాలను బట్టి, చికిత్స తీసుకొని గర్భం కోసం ప్రయత్నించి, గర్భం వచ్చిన తర్వాత కూడా గర్భం నిలవడానికి అవసరమైన మందులు వాడుకోవడం మంచిది. సాధారణంగా ఈ పరీక్షలు వరుసగా మూడు అబార్షన్లు అయిన తర్వాత చేయించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పటికి రెండుసార్లే అయ్యాయి. మరీ ఆతృతగా ఉంటే ఈ పరీక్షలన్నీ చేయించుకోవచ్చు. ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. కొన్నిసార్లు ఎన్ని పరీక్షలు చేసినా అన్నీ నార్మల్‌గానే ఉండవచ్చు కూడా.
నా వయసు 29 సంవత్సరాలు. బరువు 63 కిలోలు. ప్రస్తుతం నేను 5 నెలల ప్రెగ్నెంట్. పెళ్లికి ముందు నుంచే నేను థైరాయిడ్ పేషెంట్‌ని. ప్రసుత్తం నేను ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయడం లేదు. నా బరువును ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పగలరు.
– అనూష
మీ బరువు రాశారు గాని, ఎత్తు ఎంతో రాయలేదు. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు మామూలు బరువు ఉన్నవాళ్లు నెలకు ఒకటిన్నర నుంచి రెండు కిలోల వరకు బరువు పెరగవచ్చు. మీకు థైరాయిడ్ సమస్య ఉన్నందున ప్రెగ్నెన్సీలో రెండు నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటూ, ఎస్‌ఆర్ టీఎస్‌హెచ్ 3 ఎంఐయూ కంటే తక్కువగా ఉండేలా డాక్టర్ సలహాపై థైరాయిడ్ మాత్రలను సరైన మోతాదులో వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ ఎత్తుకు తగిన బరువు ఉంటే, మరీ ఎక్కువగా బరువు పెరగకుండా అన్నం తక్కువ తీసుకుంటూ, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి పోషక పదార్థాలు తీసుకోవచ్చు.
స్వీట్లు, అరటిపండ్లు, మామిడి పండ్లు, సపోటా పండ్లు వంటివి తక్కువగా తీసుకోవడం మంచిది. ముందు నుంచే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లలో కొందరిలో ఏడో నెల నుంచి సుగర్ శాతం పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి నెలకు ఒకటిన్నర కిలోల కంటే ఎక్కువ బరువు పెరగకుండా మితమైన పోషకాహారం తీసుకుంటూ, చిన్నగా నడక, యోగా వంటి వ్యాయామాలను డాక్టర్ సలహాపై చేసుకోవచ్చు.
డా. వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment