
మా అమ్మాయి తొలి చూలు ప్రెగ్నెంట్. మూడో నెల. కరోనా తగ్గే వరకు తన గురించి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగలరు. నెల నెలా చెకప్‌కు సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా వివరించగలరు. – పి. సబిత, ఆర్మూరు
మూడో నెల కదా! ఇప్పటి వరకు ఒక్కసారి అన్నా డాక్టర్ దగ్గరకు వెళ్లారా? వెళ్లకపోతే 3వ నెల చివరిలో తీసుకొని వెళ్లి చెకప్ చేయించండి. ఆ చెకప్‌లో డాక్టర్ అవసరమైన పరీక్షలు, బిడ్డ పెరుగుదలకు సంబంధించి ఎన్‌టి స్కాన్ లాంటివి చేయించడం జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలను వాడుకోమని చెప్పడం జరుగుతుంది. వీటిలో సమస్య ఏమీ లేకపోతే, ఈ కరోనా సమయంలో వీలైనంత వరకు అనవసరంగా బయటకు, హాస్పిటల్‌కు కూడా వెళ్లకపోవడం మంచిది. కాబట్టి నాలుగో నెల చెకప్‌ను తప్పించి, 5వ నెల వచ్చిన 15 రోజులకు చెకప్‌కు వెళ్లి బీపీ, బరువు, బిడ్డలో అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి టిఫా స్కానింగ్ లాటి పరీక్షలు చేయించుకొని, టెటనస్ (టీటీ) ఇంజెక్షన్ తీసుకొని, ఐరన్, కాల్షియం మాత్రలు వాడుకుంటూ, సమస్య ఏమీ లేకపోతే, 6వ నెల చెకప్ తప్పించి, 7వ నెలలో చెకప్‌కు వెళ్లవచ్చు. మధ్యలో సమస్య ఏమైనా అనిపిస్తే డాక్టర్‌తో ఆన్‌లైన్ కన్సల్‌టేషన్‌లో సంప్రదించి, తగిన సూచనలు తీసుకోవచ్చు. అవసరమనుకుంటే హాస్పిటల్‌కు వెళ్లవలసి ఉంటుంది.
7వ నెల చెకప్‌లో బీపీ, బరువు, హీమోగ్లోబిన్, షుగర్ పరీక్ష, టెటనస్ ఇంజెక్షన్ రెండో డోస్, బిడ్డ గుండె చప్పుడు లాంటివి చూడటం జరుగుతుంది. ఐరన్, కాల్షియం మాత్రలు డెలివరీ వరకు తప్పకుండా వాడవలసి ఉంటుంది. సమస్యలు ఏమీ లేకపోతే 8వ నెలలో చెకప్‌కు వెళ్లి, బీపీ, బరువు, అవసరమైతే, బిడ్డ బరువు, ఉమ్మనీరు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి రెండు వారాలకొకసారి, లేదా డాక్టర్ సలహా మేరకు చెకప్‌కు వెళ్లవలసి ఉంటుంది.
ఈ సమయంలో ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, పాలు, పెరుగు మాంసాహారులు అయితే గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి. మంచినీళ్లు కనీసం 2–3 లీటర్లు తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది. రోజు కొంతసేపు చిన్నగా నడక, బ్రీతింగ్ వ్యాయమాలు చేయడం మంచిది. మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. చెకప్‌లకు వెళ్లినప్పుడు, మాస్క్‌లు, గ్లౌజులు వేసుకోవడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించడం మంచిది.
మా పాపకు పద్నాలుగేళ్లు. థైరాయిడ్ అని తేలింది నెల కింద. ఎత్తు 5.2 ఉంటుంది. బరువు 53 కిలోలు. ఈ వయసులో ఆ ఎత్తుకి తనెంత బరువు ఉండాలి? మా ఇంట్లో ధైరాయిడ్ హిస్టరీ లేదు. మా పాపకు రావడానికి కారణమేమై ఉండొచ్చు? బరువుతో థైరాయిడ్‌కు సంబంధం ఉంటుందా? ఇది సంతానలేమికి దారి తీస్తుందా? – సరళ ఏలేటి, నవీ ముంబై
మీ పాప ఎత్తుకి తగ్గ బరువే ఉంది. థైరాయిడ్ సమస్య మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్ సరిగా స్రవించకపోవడం వల్ల వస్తుంది. మెడలో, హైపోథాలమస్ నుంచి టీఆర్‌హెచ్ హార్మోన్ విడుదలయ్యే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి టీ3, టీ4 హార్మోన్స్ విడుదల అయ్యేటట్లు ప్రభావం చేస్తుంది. మెదడులో సమస్యలు, కంతులు, తలకి దెబ్బ, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, థైరాయిడ్ గ్రంథిలో కంతులు, ఆటో ఇమ్యూన్ సమస్యలలో థైరాయిడ్ గ్రంథికి, హార్మోన్‌కి వ్యతిరేకంగా యాంటిబాడీస్ ఏర్పడటం వంటి అనేక కారణాల వల్ల థైరాయిడ్ సమస్య రావచ్చు. అంతేకాని తప్పనిసరిగా కుటుంబంలో థైరాయిడ్ ఉంటేనే మిగతావారికి వస్తుంది అని ఏమీ లేదు. హైపోథైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతారు.
బరువు పెరగడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి తప్పని సరిగా ఈ సమస్య ఉన్నప్పుడు థైరాయిడ్ మందులతో పాటు సక్రమంగా వ్యాయామాలు, మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. బరువు పెరిగే కొద్దీ థైరాయిడ్ డోస్ ఎక్కువ వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అన్ని అవయవాల పనితీరుపైన, రసాయన ప్రక్రియపైన ప్రభావం చూపుతుంది. ఇందులో సమస్య వచ్చినప్పుడు, అన్ని పనులూ మందగిస్తాయి. అలాగే అండాశయాల పనితీరు, సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్స్, అండం సరిగా విడుదల కాకపోవడం, దాని నాణ్యత సరిగా లేకపోవడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అబార్షన్లు అవ్వడం లాంటి సమస్యలు, ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు భయపడకుండా డాక్టర్‌ను సంప్రదించి, థైరాయిడ్ టెస్ట్‌లు సక్రమంగా చేయించుకుంటూ, సరైన మోతాదులో సక్రమంగా థైరాయిడ్ మాత్రలు వాడుకోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉంటుంది. అలాగే సంతానం కలగడానికి కూడా ఏ సమస్యా ఉండదు. చాలా మంది థైరాయిడ్ సమస్య ఉంటే గర్భం రాదు అనే అపోహలో ఉండి బాగా మథన పడిపోతుంటారు. కుటుంబ సభ్యులు దానిని భూతద్దంలో పట్టి చూస్తూ వాళ్లని ఇబ్బంది పెడుతుంటారు. ఇది సరికాదు. బరువు అదుపులో ఉంచుకుంటూ, సరైన మోతాదులో మందులు వాడుతూ, థైరాయిడ్ హార్మోన్స్ అదుపులో ఉంటే దీని వల్ల గర్భం రాకపోవడం అంటూ ఏమీ ఉండదు.
- డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment