పీరియడ్స్‌లో టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనవచ్చా? దీని గురించి భిన్నమైన అభిప్రాయాలు విన్నాను. ఏది కరెక్టో తెలియడం లేదు. ‘బాండింగ్ హార్మోన్’, ప్రసవ సమయంలో ఉపయోగపడే హార్మోన్లు అంటే ఏమిటి?
– డీకే, హైదరాబాద్
పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయ ముఖద్వారమైన సెర్విక్స్ కొద్దిగా తెరుచుకుంటుంది. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి క్రిములు తెరుచుకున్న సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి, ట్యూబ్స్‌లోకి, ఇంకా పొత్తికడుపులోకి పాకి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. బ్లీడింగ్ వల్ల తడితో కలయికలో ఇబ్బందిగా, చిరాకుగా ఉండవచ్చు. కొందరిలో ఈ సమయంలో కలవడం వల్ల పీరియడ్‌లో వచ్చే తీవ్రమైన నొప్పి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి.
మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి స్రవించే ఆక్సిటోసిన్ హార్మోన్‌ను ‘బాండింగ్ హార్మోన్’ అంటారు. ఇది కలయిక సమయంలో, కాన్పు సమయంలో, పాలు ఇచ్చేటప్పుడు విడుదలవుతుంది. దీని ప్రభావం వల్ల కాన్పు సమయంలో నొప్పులు రావడం, కాన్పు తర్వాత పాల ఉత్పత్తికి, పాలు రొమ్ము నుంచి బయటకు రావడానికి దోహదపడుతుంది. దీని ప్రభావం వల్ల భార్యా భర్తల మధ్య అన్యోన్యత, అలాగే బిడ్డ తల్లి దగ్గర పాలు తాగే కొద్ది తల్లీబిడ్డల అనుబంధం గట్టిపడుతుంది. కాబట్టి దీనిని బాండింగ్ హార్మోన్ అంటారు.
నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఖర్జురాలు తినడం వల్ల ఈజీ, హెల్తీ ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుందని చదివాను. కొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. నాకు చిరుతిండ్లు తినే అలవాటు ఎక్కువ. జున్ను ఎక్కువగా తింటాను. హెల్తీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి పదార్థాలు తింటే మంచిది? – ఆర్.శైలజ, కాకినాడ
ఖర్జూరాలలో అతి త్వరగా శక్తి రావడానికి కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్–కె వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొదటి మూడు నెలల్లో వికారం, వాంతులు వల్ల వచ్చే నీరసానికి త్వరగా శక్తినిస్తాయి. నాలుగో నెల నుంచి తల్లి శరీరంలో మార్పులకు, బిడ్డ ఎముకలు, నాడీ వ్యవస్థ సరిగా తయారవడానికి కావలసిన ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్–కె వంటి విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ వల్ల అరుగుదల బాగుండి, మలబద్ధకం లేకుండా ఉంటుంది. కాన్పు సమయంలో శక్తికి, నొప్పులు సరిగా రావడానికి ఈ పోషకాలు ఉపయోగపడతాయి. ఏదైనా అతిగా కాకుండా మితంగా తీసుకోవాలి.
ఖర్జూరాలు రోజుకు 5–6 వరకు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో చిరుతిండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరగడం, దానివల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, సుగర్ వంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. జున్నులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారంలో తాజా ఆకుకూరలు, అన్నిరకాల కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు వంటి పోషకాహారం, మాంసాహారులైతే గుడ్లు, చేపలు, మాంసం మితంగా తీసుకోవచ్చు.
నా వయసు 26 సంవత్సరాలు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. గతంలో మసాలా పదార్థాలు ఎక్కువగా తినేదాన్ని, అయితే గత కొన్ని రోజులుగా ఛాతిలో మంట వస్తోంది. ఇది గతంలో తీసుకున్న తిండి తాలూకు ప్రభావమా? లేక గర్భిణులలో ఈ మంట సహజమా? – జి.కీర్తి, అనకాపల్లి
గర్భిణిలలో హార్మోన్ల ప్రభావం వల్ల కడుపులో నుంచి ఆహారనాళంలోకి తిన్న ఆహారం వెనుకకు రాకుండా ఉండే స్ఫింక్టర్ వదులవుతుంది. అలాగే గర్భాశయంలో పెరిగే బిడ్డ వల్ల కలిగే ఒత్తిడికి పేగులు పైకి జరిగి, కడుపులో విడుదలయ్యే యాసిడ్ గొంతులోకి వచ్చి ఛాతీలో మంట, గొంతులో మంట, అజీర్తి వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆహారంలో మసాలాలు, కారం తీసుకున్నట్లయితే, ఛాతీలో మంట ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఎక్కువగా మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి.
-డా. వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment