నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. ఆరునెలల కిందట నాకు కోవిడ్ వచ్చి, నెల్లాళ్లకు పైగా చికిత్స తర్వాత నయమైంది. కోవిడ్ తగ్గినప్పటి నుంచి నాకు నెలసరి క్రమం తప్పింది. ఒక్కోసారి త్వరగా, ఒక్కోసారి ఆలస్యంగా అవుతోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సుజాత, యలమంచిలి
నీ ఎత్తుకి నువ్వు బరువు తక్కువగానే ఉన్నావు. కోవిడ్ తర్వాత నువ్వు ఇంకా బలహీనపడి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కొందరిలో ఈ మార్పుల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి క్రమం తప్పే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. కొందరిలో వేరే కారణాల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి బరువు ఎంత ఉన్నావు. కోవిడ్ తర్వాత బరువు తగ్గావా లేదా పెరిగావా అనేది చూసుకుని, మరీ తక్కువగా ఉంటే సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించి చూడవచ్చు.
అలాగే మానసిక ఒత్తిడి లేకుండా, బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి యోగా, నడక, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంటే, అది సరిగా అయ్యి కొందరిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటివి చెయ్యించుకుని, పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు కారణాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు.
నా వయసు 28 ఏళ్లు. నాకు పాప పుట్టి ఏడాదైంది. అప్పుడే మళ్లీ పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. రెండో కాన్పు కోసం మరికొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. లూప్‌ను ఎంతకాలం ఉంచుకోవచ్చు? వేయించుకుని ఏడాది గడిచింది కాబట్టి, పాతది తీయించేసి, కొత్తది వేయించుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు.
– రాధిక, తాడేపల్లిగూడెం
లూప్ లేదా కాపర్ ‘టీ’ (ఐయూసీడీ) అనేది పుల్లలాంటి సన్నటి ప్లాస్టిక్ పరికరంపైన కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది. దీనిని గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలికంగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. వీటిలో 3 సంవత్సరాల వరకూ, 5 సంవత్సరాల వరకూ, 10 సంవత్సరాల వరకూ గర్భం రాకుండా చేసే లూప్‌లు ఉంటాయి. లూప్‌లలో ఇంకోరకం హార్మోన్ లూప్ ఉంటుంది. ఇందులో లెవనార్‌జెస్ట్రాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది 5 సంవత్సరాల పాటు గర్భం రాకుండా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ సమస్యలు ఉన్నవారికి కూడా దీనిని గర్భాశయంలోనికి వేయడం జరుగుతుంది.
మీరు వేయించుకున్న లూప్ ఎలాంటిది? ఎన్ని సంవత్సరాల వరకు పని చేసేది? అనే విషయాలు తెలియవలసి ఉంది. ఒకసారి మీకు లూప్ వేసిన డాక్టర్‌ని సంప్రదించి, ఎన్ని సంవత్సరాల వరకు పని చేస్తుందో కనుక్కోవడం మంచిది. లూప్ వల్ల సమస్య ఏమీ లేకపోతే.. 6 నెలల కొకసారి లూప్ పొజిషన్‌లో ఉందా లేదా? ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని గైనకాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకుంటూ అన్నీ సరిగా ఉంటే కనీసం మూడు సంవత్సరాల వరకూ లూప్ మార్చుకోవాల్సిన అవసరం లేదు.
నాకు పెళ్లయి మూడేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. నా వయసు 27 ఏళ్లు. నేనూ మావారూ ఇద్దరమూ అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. ఇద్దరికీ ఏ సమస్యా లేదనే డాక్టర్లు చెప్పారు. ఇంకా పిల్లలు కలగకపోవడానికి కారణమేంటో అర్థం కావడంలేదు. మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– మౌనిక, మహబూబ్‌నగర్
గర్భం దాల్చాలి అంటే ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు, హార్మోన్లు అన్నీ సక్రమంగా ఉండాలి. వాటి పనితీరు సరిగా ఉండాలి. నెలనెలా అండం సరిగా విడుదల కావాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉండాలి. అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత అన్నీ సరిగా ఉండాలి. మీకు చేసిన పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఉన్నాయి, ఏ సమస్య లేవంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి చేసే పరీక్షలలో 70 శాతం వరకే కారణాలు తెలుస్తాయి. 30 శాతం కారణాలు పరీక్షల్లో తెలియవు. అవి చాలా సూక్ష్మమైన కారణాలు.
పరీక్షలలో సమస్యలు ఏమీ కనిపించక పోయినా కానీ కొందరిలో గర్భాశయద్వారం దగ్గర ఉండే యాంటీ స్పెర్మ్ యాంటీబాడిస్ వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోనికి వెళ్లనీయకుండా చేయడం, వాటి కదలికను తగ్గించడం వల్ల అండం వరకు చేరలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరికొందరిలో శుక్రకణాలు.. అండంలో చొచ్చుకునిపోలేకపోవడం, దాని వల్ల ఫలదీకరణ అవ్వకపోవడం వల్ల పిండం ఏర్పడకపోవడం, పిండం ఏర్పడినా, గర్భాశయం పిండాన్ని స్వీకరించకపోవడం వల్ల పిండం గర్భాశయంలో అంటుకోకుండా ఉండడం వల్ల గర్భం రాకపోవచ్చు. సాధారణ పరీక్షల్లో ఈ సమస్యలు తెలియకపోవచ్చు. 3 సంవత్సరాలు అయినా సాధారణ పద్ధతిలో గర్భం రానప్పుడు, రిపోర్టులన్నీ మామూలుగానే ఉన్నప్పుడు.. కొన్ని నెలలు అండం నాణ్యత, వీర్యకణాలు నాణ్యత పెరగడానికి మందులు వాడి చూడవచ్చు.
తర్వాత మూడునెలలు అండం విడుదల అయ్యే సమయంలో వీర్యకణాలను శుభ్రపరచి, మంచికణాలను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం చేయొచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండొచ్చు. అలాంటప్పుడు డీ అండ్ సీ పద్ధతి ద్వారా గర్భాశయ ముఖద్వారాన్ని కొద్దిగా వెడల్పు చేసి, గర్భాశయపొరను శుభ్రపరచడం, ఆ పొరను బయాప్సీకి పంపించడం వల్ల ఏమైనా ఇన్‌ఫెక్షన్‌లు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. దాని బట్టి కూడా చికిత్స తీసుకోవచ్చు. కొంతమందికి డీ అండ్ సీ తర్వాత గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. కొందరిలో హిస్టెరోస్కోపీ పద్ధతి ద్వారా నేరుగా గర్భాశయం లోపల చూస్తూ, ఏదైనా పొరలు, వాటి సమస్యలు ఉంటే అప్పుడే తొలగించడం వల్ల కూడా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. అన్నిరకాలుగా ప్రయత్నించినా గర్భం అందనప్పుడు, చివరిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్
హైదరాబాద్
చదవండి: Science Facts: ఎక్సర్‌సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..
Comments
Please login to add a commentAdd a comment