నా శరీరంలో ఐరన్ తక్కువగా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణిగా ఉన్నప్పుడు మామూలు కంటే రెండింతలు ఎక్కువ ‘ఐరన్’ అవసరం అని విన్నాను. ఐరన్ పెరగడానికి ఏమైనా ప్రత్యేక మందులు ఉన్నాయా? ఈ టైమ్‌లో వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
– బి.నళిని, తాడేపల్లిగూడెం
రక్తంలో హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది రక్తం నుంచి శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్ అందిస్తుంది. దీని తయారీకి ఐరన్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం మామూలు వారి కంటే ఎక్కువ తయారవుతుంది. రక్తం పెరగడానికి, హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి గర్భిణులకు రెట్టింపు ఐరన్ అవసరమవుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే, హీమోగ్లోబిన్ శాతం తగ్గి, తల్లిలో రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల తల్లిలో ఆయాసం, నీరసం, ఇంకా ఇతర సమస్యలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా రక్తసరఫరా సరిగా లేకుంటే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి గర్భిణి సమయంలో ఐరన్ ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, బీన్స్, కూరగాయలు, పండ్లు, పప్పులు, మాంసాహారంలో మటన్, చికెన్, లివర్, బోన్‌సూప్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో ఐరన్ త్వరగా చేరడానికి విటమిన్–సి అవసరమవుతుంది. దీనికి టమాటాలు, ఉసిరి, ఆరెంజెస్ వంటివి కూడా ఆహారంలో తీసుకోవాలి. కాఫీ, టీ వంటివి ఐరన్ రక్తంలో చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు పోషకాహారంతో పాటు డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్లు, సిరప్ లేదా ఇంజెక్షన్లు తీసుకోవాలి. గర్భిణి సమయంలో ఐరన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ వల్ల కొందరిలో వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరు వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఐరన్ వల్ల మలం నల్లగా వస్తుంది. దీనికి భయపడనవసరం లేదు.
మా బంధువుల అమ్మాయి ఒకరు పద్దెనిమిది సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ప్రమాదం అని అంటారు కదా! ప్రమాదం జరగకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం దాల్చడానికి ఏ వయసు సరైనదో తెలియజేయగలరు.
– కె.వైష్ణవి, గూడూరు
సాధారణంగా ఇరవై సంవత్సరాలకు ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఎదగడం జరుగుతుంది. అలాగే వీరి పెల్విస్ వెడల్పు అవడం, ఎముకలు పటిష్టంగా ఉండటం జరుగుతుంది. అమ్మాయిలు పిల్లలను కనడానికి 21 నుంచి 28 సంవత్సరాలు అనువైన వయసు. 18 సంవత్సరాల కంటే చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ బయటకు వచ్చే ద్వారం బలహీనంగా ఉండటం వల్ల కాన్పులో ఇబ్బందులు ఏర్పడం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికాలంలోఅమ్మాయిలు 18 సంవత్సరాలకు పుట్టింట్లో చిన్నపిల్లలుగానే ముద్దుగా, మురిపెంగా పెరుగుతున్నారు.
వీరు మానసికంగా, శారీరకంగా పిల్లలను కనడానికి సంసిద్ధంగా ఉండరు. దానివల్ల గర్భం దాలిస్తే మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. చిన్న వయసులో గర్భం దాల్చినప్పుడు డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, సరైన పోషకాహారం తీసుకోవడం, ఎముకల పటిష్టత కోసం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం మాత్రలు తీసుకోవడం చేయాలి. బీపీ వంటి ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు డాక్టర్ సంరక్షణలో అది ముదరక ముందే చికిత్స తీసుకోవాలి. కాన్పును ఇళ్లలో కాకుండా, అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలో జరిగేలా చూసుకోవాలి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం ఇవ్వడం మంచిది.
చలికాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ కాలానికి సంబంధించి ముఖ్యమైన నూట్రిషియన్స్ టిప్స్ తెలియజేయగరు.
– జి.త్రివేణి, సంగారెడ్డి
సాధారణంగా గర్భిణి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీనివల్ల వానాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చలికి ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండటం, అది కూడా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉలెన్ డ్రెస్‌లు వేసుకుని పూర్తిగా కప్పుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
బయట చల్లగా ఉన్నా, తేమ ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కూడా కనీసం 2–3 లీటర్ల (ఫిల్టర్ వాటర్ లేదా కాచి వడబోసిన నీళ్లు) మంచినీళ్లు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిసారీ తినేముందు, మలమూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో చర్మం పగిలి పొడిగా ఉండటం వల్ల దురద, మంట ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మాయిశ్చరైజర్ వాడుకోవడం మంచిది. వేడిగా పాలు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది.
డా. వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment