మా అక్కయ్యను హాస్పిటల్ చెకప్‌కు తీసుకెళ్తే ‘ఆస్టియో పొరాసిస్’ అని చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. వివరంగా తెలియజేయగలరు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఎలా ఉంటాయి?
– పి. శ్యామల, హైదరాబాద్
మనిషి ఎముకలు క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు కొలాజెన్ అనే కణజాలంతో కలసి గట్టిగా ఉండటం జరుగుతుంది. వీటి లోపల ఎల్లప్పుడూ పాత కణాలతో పాటు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఈ ఖనిజాలతో ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి. ఎముకల లోపలి గుజ్జు అరిగిపోయి, ఎముకలు పెళుసుగా బలహీనంగా తయారై, ఎముకలు అరిగిపోవడానికి ‘ఆస్టియోపొరాసిస్’ అంటారు. దీనివల్ల మనిషి కొద్దిగా పడినా, జారినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ సాధారణంగా వయసు పైబడే కొద్దీ, అంటే 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఆస్టియో పొరాసిస్ బలహీనంగా ఉన్నవారిలో, జన్యు కారణాల వల్ల, తొందరగా మెనోపాజ్ దశకు చేరేవారిలో, క్యాల్షియం, విటమిన్–డి లోపం ఉన్నవారిలో, స్టిరాయిడ్స్ వంటి మందులు దీర్ఘకాలం వాడే వారిలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేనివారిలో, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నవారిలో ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ ఉన్నవారిలో ఎముకలలో కణజాలం అరిగిపోవడం ఉంటుంది కాని కొత్త కణజాలం తయారు కావడం తక్కువగా ఉంటుంది. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోవడంతో ఎముకలలోకి క్యాల్షియం చేరడం తగ్గిపోతుంది. దీనివల్ల నడుంనొప్పి, వెన్నెముక అరిగి ఎత్తు తగ్గడం, ఒంగిపోయినట్లు అవ్వడం, తరచు ఫ్రాక్చర్లు కావడం వంటి సమస్యలు ఉంటాయి.
లక్షణాలు కనిపించేటప్పటికే ఎముకలు బాగా బలహీనపడి ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ కంటే ముందు ఆస్టియో పినియా దశ ఉంటుంది. ఇది ఎముకలలో గుజ్జు తగ్గడం మొదలయ్యే దశ. ఈ సమస్యను బీఎండీ, డెక్సా వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మార్పులను మార్చడం కష్టం గాని, ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకూకూరలు, మాంసాహారం వంటివి తీసుకోవడం, వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయడం, ఎండలో వారానికి మూడుసార్లు కనీసం పావుగంట సేపు ఉండటం వల్ల విటమిన్–డి తయారవుతుంది. ఇది క్యాల్షియంను ఎముకలలోకి చేరుస్తుంది.
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆస్టియో పొరాసిస్ త్వరగా రాకుండా నివారించవచ్చు. ఒకసారి ఆస్టియో పొరాసిస్ నిర్ధారణ అయిన తర్వాత పైన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, బైఫాస్ఫొనేట్స్, రెలాక్సోఫిన్, పారాథైరాయిడ్ హార్మోన్ వంటి మందులను క్రమం తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో Urinary Tract Infection (UTI) సాధారణం అని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు ఉన్నాయి?
– కమల, కరీంనగర్
ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ మామూలు వారిలో కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూత్రాశయం వెనుకకు ఆనుకొనే గర్భాశయం ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం పెరుగుతూ మూత్రాశయం పైన బరువు పడటం, ఒత్తిడి పడటం వల్ల మూత్రం పూర్తిగా మూత్రాశయం నుంచి బయటకు రాలేకపోవచ్చు. అందువల్ల మూత్రం కొద్దిగా మూత్రాశయంలో నిల్వ ఉండిపోయే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగి, వ్యాప్తి చెంది మూత్రాశయం నుంచి యురెటర్స్‌కు, తద్వారా కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల మంచినీళ్లను తాగాలి. మూత్రం వస్తుంటే ఆపుకోకుండా మూత్ర విసర్జన చేస్తుండాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత యోనిభాగం దగ్గర చెమ్మ లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. దానివల్ల రక్తహీనత లేకుండా, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో ఇన్‌ఫెక్షన్స్ ఉంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ యాంటీ బయోటిక్స్ కోర్సు వాడాల్సి ఉంటుంది.
- డా. వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment