మా చెల్లికి 26 ఏళ్లు. తొలి చూలులో ఎనిమిదినెలలకే బిడ్డ పుట్టి చనిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్. ఏడవ నెల. మునుపటి అనుభవానికి తోడు కరోనా కాలం.. భయంతో వణికిపోతోంది. చిన్నగా తలనొప్పి వచ్చినా, కాస్త దగ్గినా, తుమ్మినా ఏదో అయిపోతోందనే మానసిక స్థితిలో పడిపోయింది. కిందటి నెల చెకప్‌లో కూడా వెయిట్ పెరగలేదు. బిడ్డ గ్రోత్ కూడా అంతగా లేదని చెప్పారట డాక్టర్. ఇంకా కుంగిపోతోంది. డాక్టర్ గారూ.. ఏడో నెలలో పుట్టిన బిడ్డలు బతికిన దాఖలా ఉంది. కాని ఎనిమిదో నెలలో పుడితే ఎందుకు చనిపోతారు? మా చెల్లికి ధైర్యం, నా సందేహానికి జబాబు ఇవ్వగలరు. – కీర్తి చందన, పుణె
9 నెలల కంటే (36–37 వారాలు) ముందే కాన్పు అవ్వడాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటారు. గర్భాశయ ముఖద్వారం, చిన్నగా, లూజ్‌గా ఉండటం, గర్భాశయంలో పొరలు, లోపాలు, ఇన్‌ఫెక్షన్‌లు, రక్తహీనత వంటి అనేక కారణాల వల్ల ప్రీటర్మ్ డెలివరీ అవ్వవచ్చు. కొందరిలో బీపీ బాగా పెరగడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డకు రక్తసరఫరా సరిగా అందక, గర్భంలో బిడ్డ సరిగా పెరగకపోతే కూడా 7వ నెల, 8వ నెలలో బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది. కాన్పు చేసి బిడ్డను ఎన్‌సీయూలోని ఇంక్యుబేటర్‌లో పెట్టి, కడుపులో ఉన్న వాతావరణం లాగా, అందులో బిడ్డకు ఆక్సిజన్, ఆహారం, అవసరాన్ని బట్టి ఇతర మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్న చికిత్స. బిడ్డ శరీరతత్వాన్ని బట్టి ఇంకా వేరే కారణాలను బట్టి, చికిత్స వారికి పనిచేసేదానిని బట్టి 7వ నెల అయినా, ఎనిమిదో నెల అయినా, బిడ్డ సరిగా పెరిగి, ఇన్‌ఫెక్షన్స్‌ని తట్టుకొని, పసిరికలను తట్టుకొని బయటపడాల్సి ఉంటుంది.
అది ఏ బిడ్డలో ఎలా ఉంటుంది అనేది కచ్చితంగా ముందే చెప్పడం కష్టం. బిడ్డ తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత బిడ్డలో ఊపిరితిత్తులు, మిగతా అవయవాల పనితీరు మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే బిడ్డ బరువు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 7వ నెలలో కాన్పు కంటే, 8వ నెలలో బిడ్డ పుడితేనే బిడ్డ బరువు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ బిడ్డ బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంక్యుబేటర్‌లో 7వ నెలలో పుట్టిన బిడ్డ కంటే తక్కువ రోజులు ఉంచితే సరిపోతుంది. ఖర్చు కొద్దిగా తగ్గుతుంది. చాలా మందిలో 7వ నెలలో పుట్టే బిడ్డ బతుకుతుంది, 8వ నెలలో అయితే బతకదు అనే ఆలోచనలో ఉంటారు. కాని ఇది సరికాదు, అపోహ మటుకే. ఒక సారి 7వ నెలలో కాన్పు అయితే, మళ్లీ కాన్పులో అలానే ముందుగా అవ్వాలని ఏమిలేదు. కాకపోతే ముందు కాన్పులో 7వ నెలలో ఎందుకు అయ్యింది అనే కారణాలను విశ్లేషించుకొని, వాటిని బట్టి ఆ అంశాలు ఈ గర్భంలో కూడా ఏమైనా కనిపిస్తున్నాయా అని చూసుకొని, దానిని బట్టి కొందరిలో 5వ నెలలో గర్భసంచి ముఖద్వారానికి కుట్లు వేయడం జరుగుతుంది. కొందరిలో వెజైనల్, యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ను పరీక్ష చేసుకుంటూ, దానికి తగ్గ మందులు వాడటం, విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం, గర్భసంచి కండరాలు వదులుగా ఉండటానికి ప్రొజస్టెరాన్ మాత్రలు, ఇంజెక్షన్‌లు ఇవ్వడం వంటివి చేయడం జరుగుతుంది.
మీ చెల్లి మొదటి కాన్పు చేదు అనుభవాలతో భయపడి, మానసిక ఒత్తిడిలో ఉంది. మానసిక ఒత్తిడి వల్ల కూడా కడుపులో బిడ్డ సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ దగ్గరకి మామూలుగా కంటే తరచుగా చెకప్‌కు తీసుకువెళ్లండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం ఆమెకు ఎంతో అవసరం . దీని వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. బిడ్డ పెరగడానికి ప్రోటీన్స్ ఉండే ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా ఇవ్వండి. తనను ఆలోచనల నుంచి దూరంగా ఉంచడానికి, తనకు నచ్చిన పుస్తకాలను చదవడం, మ్యూజిక్ వినడం, కామెడీ సినిమాలు చూడటం, సరదాగా అందరూ కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేయడం మంచిది. డాక్టర్ సలహా మేరకు అవసరమైతే బిడ్డ ఊపిరితిత్తులు పరిపక్వం చెందడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సమస్య వస్తుందని, దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉండటం వల్ల ఏమీ లాభం ఉండదు.
పైగా డాక్టర్ చెప్పినట్లు తల్లి బరువు, బిడ్డ బరువు సరిగా పెరగక ఇంకా వేరే ఇబ్బందులను ఎదుర్కోనవలసి ఉంటుంది. దాని కంటే పాజిటివ్‌గా ఆలోచిస్తూ, డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే చాలా వరకు మంచే జరుగుతుంది. తీవ్రవమైన మానసిక ఒత్తడికి గురవడం వల్ల కూడా, హార్మోన్లలో మార్పులతో నొప్పులు వచ్చి ప్రీటర్మ్ డెలవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ సమస్య వచ్చి ముందుగా కాన్పు జరిగినా ఏమి చెయ్యాలి, దానిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి కాని, సమస్యరాక ముందే, వస్తుందేమో అని భయపడి, తను సరిగా తినకుండా, బిడ్డ సరిగా పెరగకుండా, నెలలు నిండకుండా కాన్పు అయితే, అప్పుడు బిడ్డ బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే తను పైన చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే బిడ్డ బరువు కొద్దిగా పెరిగితే, నెలలు నిండకుండా పుట్టినా, ఇంక్యుబేటర్‌లో ఆ బిడ్డ సమస్యలను ఎదుర్కొనే శక్తి తెచ్చుకుంటుంది. దాని వల్ల బతికే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఇప్పుడున్న అత్యాధునిక మెషిన్లు, చికిత్సల వల్ల పిల్లల ఆసుపత్రుల్లో 6వ నెలలో పుట్టిన బిడ్డ కూడా పెరిగి బయటపడే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment