
గర్భం రాకపోవడానికి స్త్రీ, పురుషులలో ఎక్కువ బాధ్యత లేదా లోపం ఎవరిదై ఉంటుంది? లోపాల విషయానికి వస్తే ఇద్దరిదీ సమానబాధ్యత ఉంటుందా? ఫెల్లోపియన్ ట్యూబుల్లో వచ్చే సమస్యలు కూడా గర్భం రాకపోవడానికి కారణం అంటుంటారు. దీని గురించి వివరించగలరు.
– టి.ఎన్., గుంటూరు
ఆడవారిలో సమస్యల వల్ల, 35% మగవారిలో సమస్యల వల్ల, 30% ఇరువురిలో సమస్యలు ఉండడం వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మగవారిలో శుక్ర కణాలు తక్కువ ఉండటం, అసలు లేకపోవటం, వాటి నాణ్యత, కదలిక సరిగా లేకపోవటం, హార్మోన్ల లోపం, జన్యు లోపం, ఇన్‌ఫెక్షన్‌లు వంటి అనేక కారణాల వల్ల సంతానం కలగకపోవటానికి కారణాలు కావచ్చు. ఆడవారిలో హార్మోన్ల లోపం, అండం తయారు కాకపోవటం, అండం నాణ్యత సరిగా లేకపోవటం, గర్భాశయంలో లోపాలు, గడ్డలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకొనిపోవటం, ఇన్‌ఫెక్షన్‌లు వంటివి... ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల సంతానం కలగడానికి ఇబ్బంది అవుతుంది. 30% మందిలో భార్య, భర్త ఇద్దరిలోను సమస్యలు, ఇంకా పరిశోధనలలో కూడా తెలియని ఎన్నో కారణాల వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సంతానం కలగనప్పుడు దంపతులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆడవారిలో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్‌లలో వాపు, అడ్డంకులు ఏర్పడి, అవి మూసుకొనిపోవటం జరగవచ్చు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అండం, వీర్యకణాలు ట్యూబ్‌లోకి ప్రవేశించలేకపోవటం, రెండూ ఒకటి కాలేకపోవటం వల్ల గర్భం ధరించటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా తెలుసుకోవటానికి హిస్టరోసాల్పింగో గ్రామ్ (హెచ్‌ఎస్‌జీ) అనే ఎక్స్–రే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ట్యూబ్స్ మూసుకొని ఉంటే, ల్యాపరోస్కోపి ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేయవచ్చు.
నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న జోక్ చెప్పినా విపరీతంగా నవ్వుతుంటాను. మావారు నన్ను రకరకాల జోక్స్ చెప్పి నవ్విస్తుంటారు. అయితే ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో గట్టిగా నవ్వడం సరికాదని ఇంట్లో పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా?
– ఆర్‌వి, కాజీపేట
గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపితే అంతే ఆరోగ్యంగా బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతుంది. అలాగే తల్లి కూడా మానసిక ఆందోళన లేకుండా, తొమ్మిది నెలలు తేలికగా గడిచిపోతాయి. ప్రెగ్నెన్సీలో గట్టిగా నవ్వకూడదని ఎక్కడా లేదు. ఆరో నెల నుంచి కడుపులో బిడ్డ బయట శబ్దాలను వినగలుగుతుంది. అలాగే మీ మానసిక పరిస్థితి బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. గట్టిగా నవ్వడం వల్ల, కడుపులో బిడ్డ కూడా పైకి, కిందకి కదులుతుంది. గట్టిగా నవ్వడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మనసుని, శరీరాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. అవయవాలకి రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకి దోహదపడుతుంది. కాబట్టి నువ్వు గట్టిగా నవ్వడాన్ని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నీకు ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వుకోవచ్చు. దానివల్ల నీకు, పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిదే!
నగరాల్లో నివసించే గర్భిణి స్త్రీలు gestational diabetes అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఈమధ్య చదివాను. దీని గురించి వివరించండి. ఇది రాకుండా ముందుజాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా?
– ఆర్.ఎన్., తాడిపత్రి
గర్భిణీల రక్తంలో చక్కెర శాతం ఉండాల్సిన దాని కంటే పెరగడాన్ని gestational diabetes అంటారు. ప్రెగ్నెన్సీలో కొందరి శరీర తత్వాన్ని బట్టి, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, ముందు నుంచే బరువు అధికంగా ఉండటం, తల్లిదండ్రులలో షుగర్ వ్యాధి ఉండటం, ప్రెగ్నెన్సీ సమయంలో బరువు అధికంగా పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం... వంటి అనేక కారణాల వల్ల gestational diabetes వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. gestational diabetesనగరాల్లో ఉండే గర్భిణీలలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో ఉండే గర్భిణీలలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నగరాలలో ఉండే కొంతమంది గర్భిణీలలో వారిలో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల, ఎక్కువ శారీరక శ్రమ చెయ్యకపోవటం వల్ల, అధిక బరువు ఉండటం వల్ల నగరాలలో ఉండే గర్భిణీలలో gestational diabetesఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న మహిళలు, గర్భం రాకముందే బరువు తగ్గటం, గర్భం వచ్చిన తర్వాత ఆహారంలో స్వీట్స్, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, పండ్లలో అరటిపండు, సపోటా వంటివి తక్కువగా తీసుకోవటం, అధిక బరువు పెరగకుండా అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తీసుకోవటం, చిన్న చిన్న పనులు, కొద్దిగా వాకింగ్ వంటివి చేయడం వల్ల చాలావరకు gestational diabetesని కొందరిలో నివారించవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేgestational diabetesని నివారించలేక పోవచ్చు. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, తక్కువ మోతాదులో మందులతో gestational diabetes అదుపులో ఉంటుంది. అలాగే దానివల్ల వచ్చే సమస్యలు పెరగకుండా, కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా బయటపడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment