
సాక్షి, అమరావతి: మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని భాగాలను హైకోర్టు రద్దుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ డాక్టర్లకు ప్రభుత్వ కోటా కింద 50 శాతం, క్లినికల్ 30 శాతం, నాన్ క్లినికల్ 50 శాతం సీట్లను కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సర్వీస్ కోటాను కేవలం ఏపీలో పనిచేస్తున్న వైద్యులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదంది. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 95కు విరుద్దమని చెప్పింది. తెలంగాణలో పనిచేస్తున్న వైద్యులు కూడా ఏపీలో ఇన్‌సర్వీస్ స్థానిక లేదా ఇన్‌సర్వీస్ స్టానికేతర ప్రభుత్వ కోటాకు అర్హులని స్పష్టం చేసింది.
పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం అధికరణ 371డి కింద కల్పించిన ప్రయోజనాలన్నీ పదేళ్లు అమల్లో ఉంటాయని, అందువల్ల ప్రస్తుత కేసులో పిటిషనర్లు ఏపీ ప్రభుత్వ ఇన్‌సర్వీస్ కోటాకు అర్హులవుతారని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ డాక్టర్లకు ప్రభుత్వ కోటా కింద 50 శాతం, క్లినికల్ 30 శాతం, నాన్ క్లినికల్ 50 శాతం సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు వైద్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యా లపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున ఎం.ఆర్.కె.చక్రవర్తి, తిరుమలరావు, ప్రభుత్వం తరఫున అపాధర్‌రెడ్డి వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment