3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీటు | The first list of mbbs was released by Kaloji Varsity | Sakshi
Sakshi News home page

3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీటు

Published Wed, Oct 2 2024 5:03 AM | Last Updated on Wed, Oct 2 2024 11:40 AM

The first list of mbbs was released by Kaloji Varsity

మొదటి జాబితా విడుదల చేసిన కాళోజీ వర్సిటీ

జనరల్‌ కేటగిరీలో 1.65 లక్షల ర్యాంకుకు సీటు

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ‌ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్‌లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న కన్వీనర్‌ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. 

గతేడాది అత్యధికంగా నీట్‌లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్‌కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్‌ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. 

అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్‌కు వచ్చింది. కన్వీనర్‌ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్‌ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. 

నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్‌ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని అంటున్నారు.

పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలు
రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్‌ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్‌ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ వర్సిటీలయ్యాయి. 

వీటితో పాటు ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీని మినహాయించి 60 మెడికల్‌ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్‌ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. 

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement