
నో అడిషనల్.. 24 పేజీల బుక్‌లెట్
లీకేజీ సమస్య నేపథ్యంలో.. ప్రశ్నపత్రంలో ఈసారి క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9.35 దాటితే పరీక్షకు అనుమతించమని ఎస్సెస్సీ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు పరీక్ష విధుల్లో ఉండనున్నారు. సైన్స్ సబ్జెక్టును రెండు విభాగాలుగా విడగొట్టారు. ఈ కారణంగా ఫిజికల్, బయలాజికల్ పేపర్లు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకూ జరుగుతాయి. ఇక.. ఈసారి అడిషనల్ లేకుండా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే 24 పేజీల బుక్‌లెట్ విద్యార్థులకు అందజేయనున్నారు. అలాగే..
ప్రశ్నపత్రంలోనూ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే సీరియల్ నంబరు వస్తుంది. పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుంచి జరిగిందని వెంటనే గుర్తించే వీలుందని పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి చెబుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను కెమెరాల ఎదురుగానే ఓపెన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తేవొద్దని సూచించారు.

అనేక చోట్ల సమస్యలు
టెన్త్ పరీక్షల నేపథ్యంలో పలుచోట్ల అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు డీఈవోలను ఆదేశించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆరీ్టసీని ఆ జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సరిగ్గా లేకపోవడం, బస్సులు నడపలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. వేసవితీవ్రత కారణంగా విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముందని జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment