తప్పులు.. సిలబస్‌లో లేని ప్రశ్నలు | 12 Questions Dropped Due To Errors In JEE Main 2025 Final Answer Key, More Details Inside | Sakshi
Sakshi News home page

తప్పులు.. సిలబస్‌లో లేని ప్రశ్నలు

Published Sat, Feb 15 2025 4:40 AM | Last Updated on Sat, Feb 15 2025 9:04 AM

JEE Main 2025: 12 Questions Dropped Due to Errors

జేఈఈ మెయిన్‌ నిర్వహణలో ఎన్‌టీఏ తీరుపై విమర్శలు

తాజా పరీక్షలో ఎన్నడూ లేని రీతిలో 12 ప్రశ్నల తొలగింపు

సిలబస్‌లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం

సాంకేతిక లోపం,  మానవ తప్పిదం అంటున్న సంస్థ

విద్యార్థుల సమయం వృథా అవుతోందంటున్న నిపుణులు

సాక్షి, ఎడ్యుకేషన్‌: జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2025) విషయంలో.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపా లతో కూడిన ప్రశ్నల సంఖ్య పెరగడం, తుది ఆన్సర్‌ కీలో వాటిని తొలగించడం, సిలబస్‌ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం పరిపాటిగా మారింది. ఇటీవల ఫలితాలు విడుదలైన జేఈఈ మెయిన్‌– 2025 జనవరి సెషన్‌పై సైతం విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌టీఏ నిబద్ధతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్‌టీఏ వైఫల్యంతో విద్యా ర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

సమర్థ నిర్వహణలో వైఫల్యం!
జేఈఈ మెయిన్‌ విషయంలో ఎన్‌టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది పలు షిఫ్ట్‌ లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యనే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్‌ నిపుణులు చెబు తు న్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.

దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణంగా పేర్కొనడం గమనార్హం. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌తో పాటు నీట్‌ యూజీ, సీమ్యాట్, తదితర పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్‌టీఏ వాటిని సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవ డంలో విఫలమవుతోందని.. ప్రశ్నలు రూపొందిచే ఎగ్జామినర్స్‌ విషయంలో, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలో అప్రమత్తంగా ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏటేటా పెరుగుతున్న తప్పులు
జేఈఈ మెయిన్‌ ప్రశ్నల్లో తప్పుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2024 సెషన్‌–1లో ఆరు ప్రశ్నలు; సెషన్‌–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్‌–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్‌–1లో నాలుగు, సెషన్‌–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్‌టీఏ పేర్కొంటోంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని సబ్జెక్ట్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిలబస్‌ నుంచి తొలగించినా..
    జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో సిలబస్‌లోని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2025 జనవరి సెషన్‌ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ఫిజిక్స్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌ అండ్‌ లిక్విడ్స్‌ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్‌ లా ఆఫ్‌ కూలింగ్‌ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్‌ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు. అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్‌ లాను సిలబస్‌ నుంచి తొలగించారని సబ్జెక్ట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

రాధాకృష్ణన్‌ కమిటీ చెప్పినా..
    జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, యూజీసీ నెట్‌ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫారసులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ.. ఈ పరీక్షల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్‌టీఏపై ఉందని, అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎన్‌టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నీట్‌ యూజీపై ఆందోళన
    జేఈఈ మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో..మే 4న నిర్వహించనున్న నీట్‌ యూజీ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు చోటు చేసుకుంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్‌టీఏ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణ కోసమే ఎన్‌టీఏ ఏర్పాటు కావడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అన్ని పరీక్షల్లో లోపాలు లేనివిధంగా ప్రశ్నలు ఇచ్చేలా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌లో తొలగించిన ప్రశ్నల కోడ్‌ నంబర్లివే..
– ఫిజిక్స్‌: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917
– కెమిస్ట్రీ: 656445728, 6564451784
– మ్యాథమెటిక్స్‌: 6564451142, 6564451898

ప్రశ్నల డేటాను నిరంతరం సమీక్షించాలి
కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల్లో ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్‌ రూపొందించి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రోగ్రామింగ్‌ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక చాప్టర్‌ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందే తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. ఎప్పటికప్పుడు కొశ్చన్స్‌ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పెన్, పేపర్‌ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్‌ రూట్స్, ఇతర సైంటిఫిక్‌ సింబల్స్‌ కంప్యూటర్‌లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్‌వీ శ్రీధర్‌ (జేఈఈ–మెయిన్‌ ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement