kidnaps
-
క్రిమినల్స్ అడ్డా..C\o రైల్వేస్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లు నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట్, వరంగల్, మంచిర్యాల, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలో నిత్యం నేరాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో ఒంటరిగా రైల్వేస్టేషన్లకు వచ్చే చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు అపహరిస్తున్నాయి. ఇవే కాకుండా దొంగతనాలు, మోసాలు, గుర్తుతెలియని వ్యక్తుల మృతి తదితర నేరాలు కూడా పెద్దసంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. ఏటా 2600కు పైగా నేరాలు జరుగుతుండటం గమనార్హం. ఇందులో వెయ్యికి పైగా దొంగతనాలు ఉంటున్నాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే ఏటా 750 నుంచి 800 వరకు వివిధ రకాల కేసులు నమోదవుతున్నట్లు అంచనా. నిఘా ఉన్నా లేనట్లే.... ప్రతి రోజూ సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200కు పైగా రైళ్ల రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 96 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 40 మాత్రమే పని చేస్తుండగా మిగతావి అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద మెటల్ డిటెక్టర్లు, లగేజీ స్కానర్లు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా సిబ్బంది పెద్దగా తనిఖీలు చేయకపోగా, ప్రయాణికులు సైతం మెటల్ డిటెక్టర్ల నుంచి రాకపోకలు సాగించడం లేదు. దీంతో అవి కూడా దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వెయిటింగ్ హాల్ వద్ద ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన చిన్నారి ఆయుష్ ఉదంతంలో వెయిటింగ్ హాల్‌కు సమీపంలో ఉన్న సీపీ కెమెరాలో వివరాలు లభించాయని, అదే ఘటన ఐదో నంబర్, ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై జరిగి ఉంటే నేరస్తులను గుర్తించడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాల మేరకు 400 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్‌ఫామ్‌పైన ప్రతి వ్యక్తి కదలికలను నమోదు చేసేందుకు కనీసం 10 నుంచి 15 సీసీకెమెరాలు ఉండాల్సి ఉండగా, ఒక్కో ప్లాట్‌ఫామ్‌కు రెండు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత భద్రతావ్యవస్థలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి వాహనం, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విధానం మొక్కుబడిగా కొనసాగుతుండగా, కాచిగూడ, నాంపల్లి తదితర స్టేషన్లలో పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో 120 సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే పోలీసులు గత కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీనికితోడు నేరగాళ్లు తేలిగ్గా పారిపోయేందుకు స్టేషన్లకు అన్ని వైపులా రాచమార్గాలు ఉండనే ఉన్నాయి. ఏమార్చి ఎత్తుకెళ్తున్నారు..... ‘‘ రైల్వే స్టేషన్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. అవి ఎంత దూరం వరకు రికార్డు చేస్తున్నాయనే అంశాలపైన దొంగలు, నేరగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంది. ఒక్క సికింద్రాబాద్ స్టేషన్లోనే ఏటా 750కి పైగా కేసులు నమోదవుతుండటం ఇందుకు నిదర్శనం.’’ అని ఒక పోలీసు అధికారి పేర్కొనడం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో 300 కేసులు నమోదవుతుండగా, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, నాంపల్లి, తదితర స్టేషన్ల పరిధిలో మరో 300 కేసులు నమోదవుతున్నాయి. నేరాల నమోదులో హైదరాబాద్ తరువాతి స్థానాన్ని మంచిర్యాల రైల్వేస్టేషన్ ఆక్రమిస్తోంది. అక్కడ 330 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో కాజీపేట్, వరంగల్ స్టేషన్లు ఉన్నాయి. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, రైళ్లలో సీట్ల కోసం, బెర్తుల కోసం వెతుక్కునేవారిని టార్గెట్‌గా చేసుకుంటున్న దొంగలు వారిని ఏ మార్చి బ్యాగులు, వస్తువులతో ఉడాయిస్తున్నారు. సిబ్బంది కొరత.... జీఆర్పీలో సిబ్బంది కొరత కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఏటా వేల సంఖ్యలో నేరాలు చోటు చేసుకుంటుండగా పోలీసులు మాత్రం వందల్లోనే ఉన్నారు. సికింద్రాబాద్ జీఆర్పీలో కనీసం 1000 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 400 మందితో నెట్టుకొస్తున్నారు. దీంతో స్టేషన్లలో భద్రత, అసాంఘిక శక్తులపైన నిఘా ఉంచడం కష్ట తరమవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయ లేమి కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. స్టేషన్లలో సీసీ కెమెరాలను పెంచాలని జీఆర్పీ అధికారులు చాలాకాలంగా ఆర్పీఎఫ్ను కోరుతున్నారు. రైల్వే ట్రాక్‌లకు రెండు వైపులా ఫెన్సింగ్ లేనందున తరచూ ఆత్మహత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సమీక్షల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ‘‘ ఇలాంటి భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకార లోపం సరైంది కాదు. ఇది లక్షలాది మంది ప్రయాణికులు, ప్రజల రక్షణకు సంబంధించిన అంశం. రైల్వే అధికారులు సైతం ఇలాంటి అంశాలపైన సీరియస్‌గా దృష్టి సారించాలి..’’ అని ఒక పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నేరాల్లో ముఖ్యమైనవి.. ⇔ గత నవంబర్ 11న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రేణుక అనే చిన్నారి అపహరణకు గురైంది. ఇప్ప టి వరకు ఆచూకీ లభించలేదు. ⇔ చత్తీస్‌గఢ్‌కు చెందిన సుమన్‌పాండే(8) రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్లో అపహరణకు గురయ్యాడు. ⇔ మెహదీపట్నంకు చెందిన యువతి(16) మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదృశ్యమైంది. ⇔ బీహార్‌కు చెందిన జగదీశ్ పాశ్వాన్(16) సైతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ జిల్లా జుక్కల్‌కు చెందిన బాలాజీ, నగరానికి చెందిన బన్నీ, మహబూబ్‌నగర్ కు చెందిన ⇔ రాజు (11) వంటి రైల్వేస్టేషన్లలోనే ఉన్నపళంగా మాయమయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రైల్వేపోలీసులు 25 మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. రికార్డుల్లో నమోదు కాని వారు పదుల సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారుల అంచనా. -
మంత్రి కుమారుని కిడ్నాప్ దందా
అనంతపురం: మంత్రి కుమారుని దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధర్మవరంలో భూమి ‘పంచాయితీ’ విషయమై ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఉదంతం మరువక ముందే.. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలివీ.. బెంగళూరుకు చెందిన సలీం అనే వ్యక్తిని ఓ మంత్రి కుమారుని అనుచరులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. గతంలో ఈ ముఠా సభ్యులు బెంగళూరుకు వెళ్లి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ రేటుకే ఇస్తామని నమ్మబలికారు. వీరి మాయమాటలు నమ్మిన బాధితుడు అడ్వాన్స్ కింద రూ.70 లక్షలు ఇచ్చాడు. ఇటీవల బంగారం తీసుకెళ్లాలని ముఠా సభ్యులు సలీంకు ఫోన్ చేయడంతో మూడురోజుల క్రితం జిల్లాకు చేరుకున్నాడు. రాప్తాడు సమీపంలో ఓ ప్రదేశానికి రమ్మని చెప్పిన ముఠాసభ్యులు అటునుంచి అటే మంత్రి స్వగ్రామానికి తీసికెళ్లినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అదుపులో ఉంచుకొని బాధితున్ని చితకబాదినట్లు సమాచారం. చంపుతామని బెదిరించి బాధితుని అకౌంట్ నుంచి రూ.49 లక్షలు తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా మరో రూ.4కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్ బాండ్లు రాయించుకుని వదిలేశారు. ఘటనపై బాధితుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు విచారణ నిమిత్తం మూడు రోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరిచ్చిన సమాచారం మేరకు.. కిడ్నాప్ ముఠాలోని మొత్తం ఆరుగురికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. పేరు మోసిన కిడ్నాప్ ముఠా కిడ్నాప్ ముఠా వరుస భూ దందాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి కుమారుని అండతో సెటిల్మెంట్లు, భూ దందాలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల ధర్మవరంలో ఇలాంటి భూ పంచాయితీలో తలదూర్చి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ధర్మవరం, రాప్తాడు ప్రజాప్రతినిధుల మధ్య అగ్గి రాజేసింది. ఈ ఘటనపై కూడా ఈ నెల 6న ‘ల్యాండ్‌మైన్’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ ఘటన మరువక ముందే అదే ముఠాలోని కొందరు సభ్యులు తాజాగా బెంగళూరు వాసిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఈ ముఠాకు మంత్రి కుమారుడు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా కిడ్నాప్‌లో పాల్గొన్న నిందితులను విచారిస్తున్నామని, త్వరలో కేసు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
టోనీ గ్యాంగ్.. టెర్రర్
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ గ్యాంగ్‌ల సంస్కృతి అధికంగా ఉంది. నాలుగేళ్ల క్రితం సునీల్ గ్యాంగ్ చేసిన అలజడి అంతా ఇంతా కాదు. అతని పేరెత్తితే చాలు వ్యాపారులు, సంపన్నులు వణికిపోయే పరిస్థితి ఉండేది. కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులను వెంట పెట్టుకొని కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడ్డాడు. సునీల్ హవా నడుస్తున్న సమయంలోనే పప్పీ బ్యాచ్ పేరుతో మరో గ్యాంగ్ ఆగడాలు కూడా.. పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. ఈ సంఘటనలకు సంబంధించి అప్పట్లో పోలీసులు సుమారు 36 మంది విద్యార్థులపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీంతో రెండు గ్యాంగ్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. పట్టణ ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలోనే.. మూడేళ్ల క్రితం టోనీ గ్యాంగ్ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి రెండు, మూడు నెలలకు ఒక సారి ఈ బ్యాచ్ పేరు వినిపిస్తూనే ఉంది. ఇందులో 30 మంది దాకా యువకులు ఉంటారు. కొందరు చిల్లరగా తిరిగే వారు, మరికొందరు చదువు మానేసిన వారు, ఇంకొందరు చిన్న చిన్న పనులు చేసుకునే వారు.. ఇలా వివిధ నేపథ్యం కలిగిన యువకులు బ్యాచ్‌గా ఏర్పడ్డారు. వీరికి టోనీ అనే యువకుడు నాయకుడు. నాడు నడిరోడ్డుపై తన్నుకున్నారు సుమారు రెండేళ్ల క్రితం టోనీ బ్యాచ్, శ్రీనివాసనగర్‌కు చెందిన విద్యార్థులు మైదుకూరు రోడ్డులోని జిన్నారోడ్డు సమీపంలో తన్నుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మొదలైన క్రికెట్ మ్యాచ్ గొడవ మైదుకూరు రోడ్డుకు చేరింది. అక్కడ వారు బీరు సీసాలతో కొట్టుకున్న సీన్లు సినిమా ఫైట్లను తలపించాయి. ఇంటి వద్ద ఉన్న వ్యక్తిని కొట్టి.. ఒక వ్యక్తిని టోనీ గ్యాంగ్ చితకబాది తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లె శ్రీనివాసులు అనే వ్యక్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని రామేశ్వరంపేటలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉన్నాడు. రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో ఐదుగురు యువకులు అక్కడికి వచ్చి ‘ఏ రా ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావా’ అని ప్రశ్నించారు. తన ఇల్లు ఇదేనని అతను బదులు ఇచ్చాడు. ‘అయినా ఈ సమయంలో మీరెందుకు ఇక్కడ తిరుగుతున్నారు’ అని శ్రీనివాసులు వారిని ప్రశ్నించడంతో.. ఒక్కసారిగా రాళ్లు తీసుకొని అతనిపై విసిరారు. ‘మేము ఎవరనుకున్నావ్ రా.. టోనీ గ్యాంగ్.. మమ్మల్నే ప్రశ్నిస్తావా..’ అంటూ ఇష్టానుసారంగా కొట్టారు. తీవ్రంగా గాయ పడిన అతన్ని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లాలని సూచించారు. అతని తలకు, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో 15 కుట్లు పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికీ అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించినా.. వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండ టోనీ బ్యాచ్‌ను అధికార పార్టీ నాయకులే పెంచి పోషిస్తూ, వారు చేసే ఆరాచకాలకు పరోక్షంగా కారకులు అవుతున్నారు. ప్రొద్దుటూరులో సీనియర్ నేతకు ప్రధాన అనుచరుడిగా ఉన్న.. ఓ మైనారిటీ నాయకుడి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెటిల్మెంట్ల సమయంలో భయపెట్టేందుకు టోనీ గ్యాంగ్‌ను వారు ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి ఆగడాలు కేవలం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే కొన సాగడం గమనార్హం. పోలీసు అధికారికి తప్పుడు సమాచారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏ కానిస్టేబు ల్ను అడిగినా టోనీ రెండేళ్ల నుంచి ఊరి లో లేడని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాడని చె బుతారు. సీఐకి కూడా సిబ్బంది, అధి కారులు ఇలానే తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించారు. అయితే అతను మాత్రం ప్రొద్దుటూరులో పబ్లిక్‌గా తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్‌కు వన్‌టౌన్‌లోని ఓ పోలీసు అధికారితోపాటు ఒక కానిస్టేబుల్ సహకారం ఉన్నట్లు స్టేషన్ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఎందుకంత ప్రేమ దాడులు చేస్తూ ప్రజలను భయపెడుతున్న టోనీ గ్యాం గ్‌పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు. ఈవ్‌టీజింగ్ పేరుతో అమాయకులను స్టేషన్‌కు తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొడుతున్న పోలీసులకు.. టోనీ గ్యాం గ్ ఆగడాలు కనిపించలేదా. అధికార పార్టీ నాయకుల నీడలో టోనీ గ్యాంగ్ పని చేస్తోంది. వీరి చేతిలో ఇంకా ఎంత మంది ఆస్పత్రి పాలు కావాలి. వీరిని ఇలానే వదిలేస్తే ప్రజలు బయట నడిచే పరిస్థితి ఉండదు. – వంగనూరు మురళీధర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రొద్దుటూరు భయపెడుతున్నారు టోనీ గ్యాంగ్ పేరుతో భయోత్పాతం సృ ష్టిస్తున్నారు. వీరితో భయపెట్టించి సెటిల్మెంట్లు చేస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఏం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో బ్యాచ్‌ల సంస్కృతిని కొందరు అధికార పార్టీ నాయకులు పెంచి పోషిస్తున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. – పోసా భాస్కర్, కౌన్సిలర్, ప్రొద్దుటూరు -
రౌడీలూ ఖబడ్దార్
- హద్దుమీరితే పీడీ యాక్ట్ - తాజాగా రౌడీలు ఫిర్దౌస్, లతీఫ్, తన్వీర్‌పై ప్రయోగం - చర్లపల్లి జైలుకు తరలింపు - వీరిపై 12 ఠాణాల్లో 84 కేసులు: వెలుగు చూడని వందకు పైగానే సాక్షి, సిటీబ్యూరో: సేఫ్ట్సిటీ-స్మార్ట్‌సిటీలో భాగంగా నగర పోలీసు లు మరో అడుగు ముందుకేశారు. ప్రజల రక్షణ, భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘికశక్తుల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు తదితర వరుస నేరాలకు పాల్పడుతూ ఇటు పోలీసులను, అటు ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్న కరుడుగట్టిన ముగ్గురు రౌడీషీటర్లపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏడుగురిపై ఈ చట్టం ప్రయోగించి జైలు కు తరలించారు. తాజాగా పీడీయాక్ట్ కింద మరో ముగ్గురిని డీసీపీ సత్య నారాయణ జైలుకు పంపారు. బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫిర్దౌస్ (32), మల్లేపల్లికి చెందిన మహ్మద్ లతీఫ్ (32), ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ (26)లు రౌడీషీటర్లు. చిన్న చిన్న నేరాలకు పాల్పడి 12 ఏళ్ల క్రితం నేర జీవితాన్ని ప్రారంభించిన ఈ ముగ్గురు ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాళ్లుగా మారారు. వీరిపై పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, లంగర్‌హౌస్ గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, చిక్కడపల్లి, నాంపల్లి పోలీసు స్టేషన్ల మొ త్తం 84 కేసులున్నాయి. ఇందులో కొన్ని కేసులు సాక్షులను బేదిరించడం వల్ల వీగిపోయాయి. దీంతో వారిలో ధైర్యం రె ట్టింపై మరిన్ని నేరాలు చేయడం ప్రారంభించారు. కిరాయి హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు, బెది రింపులు, కొట్లాటలు, హత్యాయత్నాలు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్టయిన ప్రతిసారి నెల రోజుల్లోనే జైలు నుంచి బెయిల్‌పై విడుదలై తిరిగి నేరాలు చే యడం విధిగా పె ట్టుకున్నా రు. రౌడీషీటర్లు జంగ్లీ యూ సుఫ్, చోర్ కౌసర్లతో పాటు యువతులతో వ్యభి చారం చేయిస్తున్న పల్లె సుధాకర్‌రెడ్డి, బోడ రాజులపై పోలీసులు గతంలో పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఫిర్దోస్‌పై 26 కేసులు.... రౌడీషీటర్ ఫిర్దోస్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, గోల్కొండ, చిక్కడపల్లి, నాంపల్లి, లంగర్‌హౌస్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నాలు, దొంగతనాలు, దాడులు, బెదిరింపులు, ఆయుధాలు కలిగి ఉండటంలాంటి కేసులున్నాయి. లతీఫ్‌పై 46 కేసులు... అత్యధికంగా లతీఫ్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్,పంజగుట్ట, ఆసిఫ్‌నగర్, షాహినాత్‌గంజ్, నాంపల్లి, గో ల్కొండ, లంగర్‌హౌస్ బంజారాహిల్స్ ఠాణాలలో 46 క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో దాడులు, బెదిరిం పులు, హత్య లు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తన్వీర్‌పై 14 కేసులు... తన్వీర్‌పై ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నాలు, బెదిరింపులు తదితర నేరాలున్నాయి. ప్రజల రక్షణే ధ్యేయం... ప్రజల రక్షణే మా ధ్యేయం. మాపై నుమ్మకం ఉంచి ప్రభుత్వం పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తోంది. నగరాన్ని ప్రపంచంలోనే సేఫ్‌సిటీగా మార్చేం దు కు ఇప్పటికే ఎన్నో చర్యలు మొదలెట్టారు. సిబ్బంది, అధికారుల ప్రవర్తనలో కూడా మార్పులొస్తున్నాయి. ఫ్రెం డ్లీ పోలీసింగ్‌ను మరింత పెంచుతాం. దీంతో పాటు రౌడీమూకలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల ఉపేక్షించే ప్రసక్తేలేదు. రాజకీయ ఒత్తిళ్ల తలొగ్గం. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఫిర్యాదు చేయాలన్నా భయమే.... పై దముగ్గురు రౌడీషీటర్ల ఆగడాలపై సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే వారిని బెదిరించడం, వారి పిల్లల్ని కిడ్నాప్ చేయడం వంటివి చేసేవారు. దీంతో వారి ఆగడాలు హద్దుమీరాయి. వారిపై ఫిర్యాదు చేయనిదే పోలీసులు కేసు నమోదు చేయలేరు. అధికారికంగా వారిపై ఇప్పటి వరకు 84 కేసులు నమోదు కాగా వెలుగు చూడని కేసులు వందకుపైగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ చట్టం కింద ఏడాది పాటు వీరు జైలులో ఉండాల్సిందే. -
అమ్మో! అన్ని కిడ్నాప్లా!
న్యూఢిల్లీః పార్లమెంటు ఉభయసభలు లోక్‌సభ, రాజ్యసభలలో ఈరోజు పలు అంశాలపై చర్చలు జరిగాయి. సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. * మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కిడ్నాప్‌లు, అపహరణ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,57,717 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. * దేశంలోని మావోయిస్టు గ్రూపుల్లో మావోయిస్టుల సంఖ్య సుమారు 8,500 ఉండొచ్చని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అయితే వీరికి మద్దతిచ్చే వారి సంఖ్య భారీగానే ఉండొచ్చని, ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు మావోయిస్టులు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపింది. * సివిల్ సర్వీస్ విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరికి చెందిన అధికారులు 2,751 మంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఐఏఎస్ అధికారుల్లో 1,200, ఐపీఎస్ అధికారుల్లో 880, ఐఎఫ్ఎస్ అధికారుల్లో 671 మంది ఉన్నట్లు వివరించింది. * రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా(ఆర్ఎన్ఐ) వద్ద నమోదు చేసుకున్న పబ్లికేషన్ సంస్థల సంఖ్య 99,660 అని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. నాలుగేళ్లలో రిజిస్ట్రేషన్లు 28.79 శాతం పెరిగినట్లు తెలిపింది. * కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) వద్ద 2012-13 సంవత్సరంలో 28,801 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ లోక్‌సభకు తెలిపారు. * విదేశీ నిధులు (నియంత్రణ) చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద వార్షిక ఆదాయం వివరాలు సమర్పించని 21,493 స్వచ్చంద సంస్థల(ఎన్జీవోలు)కు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఎఫ్సీఆర్ఏ కింద 2014 జూలై 16 వరకూ నమోదు చేసుకున్న ఎన్జీవోల సంఖ్య 42,529 అని తెలిపారు. * 39 సెంట్రల్ యూనివర్సీటీల్లో 16,692 అధ్యాపక పోస్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, వీటిలో 6,251 పోస్టులు (సుమారు 40 శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. * ఆరావళి పర్వత శ్రేణుల్లో చెట్ల అక్రమ నరికివేత, కూల్చివేతకు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6,206 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ కేసుల్లో నేరస్తుల నుంచి రూ. 1 కోటి 42 లక్షలు పరిహారంగా వసూలు చేసినట్లు తెలిపింది. * మహిళలు రాత్రిపూట కూడా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఓవర్‌టైమ్ గంటలను పెంచేందుకు వీలుగా ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. -
60 మంది అమ్మాయిలు.. 31 మంది అబ్బాయిల అపహరణ
నైజీరియాలోని ఈశాన్య ప్రాంత గ్రామాల నుంచి 60 మంది అమ్మాయిలు, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన ఆ దేశంలో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను ఉగ్రవాదులు అపహరించుకుని వెళ్లినా, ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో అక్కడి సర్కారుతో పాటు సైన్యం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. శనివారం నాడు నలుగురు గ్రామస్థులను చంపి మరీ అమ్మాయిలు, అబ్బాయిలను ఉగ్రవాదులు అపహరించుకు వెళ్లారని ఆ గ్రామ వాసి అజీ ఖలీల్ తెలిపారు. గ్రామాల్లోకి ఉగ్రవాదులు చొరబడి అఘాయిత్యాలు చేయకుండా అడ్డుకోడానికి ఏర్పాటుచేసిన గ్రామ కమిటీలో ఖలీల్ కూడా సభ్యుడు. ఈ కమిటీ సభ్యులు సాధారణ ఆయుధాలతో కొంతమేరకు గ్రామాలకు రక్షణ కల్పించగలుగుతున్నారు. గ్రామంలో చాలామంది ఉగ్రవాదుల భయంతో దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
డబ్బున్న వారే టార్గెట్
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పసిడిపురిలో సగటు మనిషికి మన శ్శాంతి, మానసిక ప్రశాంతత కరువైంది. జిల్లా ఆర్ధిక రాజధానిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతూ వస్తోంది. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా పేరు పొందిన ఈ గడ్డ నేడు అనేక ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతోంది. కొన్ని ఆరాచక శక్తులు పుట్టుకొచ్చి ఇక్కడి వారిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మారుతున్న కాలంలో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు తమ కోరికలను తీర్చుకోవడానికి కిడ్నాప్‌లు చేయడమే గాక హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అటు పట్టణ వాసులనే గాక పోలీసు అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. సంఘంలో బాగా పలుకుబడి కలిగి బయటికి రాకుండా తమ పని తాము చేసుకుపోయే వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు వారిలో భయాన్ని కలిగిస్తున్నాయి. నాడు సునీల్.. నేడు ధనుంజయ గ్యాంగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సునీల్ కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని కిడ్నాప్ ఉదంతాలు మూడు జిల్లాల్లో విస్తరించడంతో ఈ జిల్లాల పోలీసు అధికారులతో పాటు ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సునీల్ ఆటో డ్రైవర్‌గా ఉంటూ కొందరు విద్యార్థులను పోగు చేసుకుని ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. ముందుగా అతను ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ మెడికల్ షాపు నిర్వాహకుడిని కిడ్నాప్ చేసి తర్వాత హత్య చే శాడు. తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన గ్యాస్‌డీలర్, ఆర్టీసి ఉద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేశాడు. అంతేగాక ప్రముఖ బంగారు వ్యాపారి కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సునీల్ గ్యాంగ్ సభ్యులు రెండు మూడు సార్లు వ్యాపారి ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. ఈలోగా అతని కిడ్నాప్‌ల వ్యవహారం బట్టబయలైంది. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, న్యాయవాదుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సంఘటనలు జరిగి ఆరు నెలలు గడువక ముందే ధనుంజయ గ్యాంగ్ వెలుగులోకి రావవడం పోలీసు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. మేము సరే.. మా పిల్లల రక్షణ ఎలా.. ప్రొద్దుటూరు పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులున్న పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. సంపన్న వర్గాలనే లక్ష్యంగా చేసుకొని కిడ్నాపింగ్ ముఠాలు ఇక్కడ వెలుస్తున్నాయి. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఎలాగోలా తమ రక్షణ చూసుకోగలరు. అయితే ఇంటికి దూరంగా ఎక్కడో చదువుకుంటున్న పిల్లల రక్షణ ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే ఇలాంటి ముఠాలను అణచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ వాసులు పోలీసులను కోరుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోనే ఇలాంటి సంఘటనలు జరగడంపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సీరియస్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు కిడ్నాప్‌ల పేరుతో రెచ్చిపోయే గ్యాంగ్‌ల భరతం పట్టాలని ఆయన స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇలాంటి ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించాలి ఇటీవల కాలంలో పట్టణంలో విపరీతంగా కిడ్నాప్ ముఠాలు వెలుస్తున్నాయి. యువత చెడు వ్యసనాలకు లోనై క్రికెట్ బెట్టింగ్, మట్కా, మద్యపానం లాంటి చెడువ్యసనాలతో పెడత్రోవ పడుతోంది. గతంలో కిడ్నాప్‌లకు పాల్పడ్డ సునీల్ గ్యాంగ్‌పై నామ మాత్రపు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ధనుంజయ గ్యాంగ్ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ముఠాల పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలి. అందుకు ప్రజల సహకారం ఎప్పటికీ ఉంటుంది. - ఇవి సుధాకర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది కఠిన చర్యలు తీసుకుంటాం కిడ్నాప్‌ల పేరుతో బెదిరిస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారి పట్ట కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే రౌడీలను, దాదాగిరి చేసే వ్యక్తులను అణచివేశాం. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. పదే పదే కేసుల్లో ఉన్న వారిపై షీట్లు కూడా తెరుస్తున్నాం. తమ పిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనిస్తుండాలి. - శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు డీఎస్పీ