క్రిమినల్స్‌ అడ్డా..C\o రైల్వేస్టేషన్‌ | Crime Rate Hikes In Railway Stations Hyderabad | Sakshi
Sakshi News home page

క్రిమినల్స్‌ అడ్డా..C\o రైల్వేస్టేషన్‌

Published Wed, Aug 22 2018 9:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Crime Rate Hikes In Railway Stations Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లు నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట్, వరంగల్, మంచిర్యాల, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలో నిత్యం నేరాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో ఒంటరిగా రైల్వేస్టేషన్లకు వచ్చే చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు అపహరిస్తున్నాయి. ఇవే కాకుండా దొంగతనాలు, మోసాలు, గుర్తుతెలియని వ్యక్తుల  మృతి తదితర నేరాలు కూడా పెద్దసంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. ఏటా 2600కు పైగా నేరాలు జరుగుతుండటం గమనార్హం. ఇందులో వెయ్యికి పైగా  దొంగతనాలు ఉంటున్నాయి. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోనే ఏటా 750 నుంచి  800 వరకు  వివిధ రకాల కేసులు నమోదవుతున్నట్లు  అంచనా.  

నిఘా ఉన్నా లేనట్లే....
ప్రతి రోజూ సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200కు పైగా రైళ్ల రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో  96  సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 40 మాత్రమే పని చేస్తుండగా మిగతావి అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు ఒకటో నంబర్, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద మెటల్‌ డిటెక్టర్‌లు, లగేజీ స్కానర్లు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా సిబ్బంది  పెద్దగా తనిఖీలు చేయకపోగా, ప్రయాణికులు సైతం మెటల్‌ డిటెక్టర్ల నుంచి రాకపోకలు సాగించడం లేదు. దీంతో అవి కూడా దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వెయిటింగ్‌ హాల్‌ వద్ద  ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేసిన చిన్నారి ఆయుష్‌ ఉదంతంలో వెయిటింగ్‌ హాల్‌కు సమీపంలో ఉన్న సీపీ కెమెరాలో వివరాలు లభించాయని, అదే ఘటన ఐదో నంబర్, ఏడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లపై జరిగి ఉంటే  నేరస్తులను గుర్తించడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు.

ప్రయాణికుల భద్రతా ప్రమాణాల మేరకు 400 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్‌ఫామ్‌పైన  ప్రతి వ్యక్తి కదలికలను నమోదు చేసేందుకు  కనీసం  10 నుంచి  15  సీసీకెమెరాలు ఉండాల్సి ఉండగా, ఒక్కో ప్లాట్‌ఫామ్‌కు రెండు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత భద్రతావ్యవస్థలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి వాహనం, లగేజీని క్షుణ్ణంగా  తనిఖీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విధానం మొక్కుబడిగా కొనసాగుతుండగా, కాచిగూడ, నాంపల్లి తదితర స్టేషన్‌లలో పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో  120 సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే పోలీసులు గత కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీనికితోడు నేరగాళ్లు తేలిగ్గా పారిపోయేందుకు  స్టేషన్‌లకు అన్ని వైపులా రాచమార్గాలు ఉండనే ఉన్నాయి.  

ఏమార్చి ఎత్తుకెళ్తున్నారు.....
‘‘ రైల్వే స్టేషన్‌లో ఎక్కడెక్కడ  సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. అవి ఎంత దూరం వరకు రికార్డు చేస్తున్నాయనే అంశాలపైన దొంగలు, నేరగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంది. ఒక్క సికింద్రాబాద్‌ స్టేషన్‌లోనే ఏటా  750కి  పైగా కేసులు నమోదవుతుండటం ఇందుకు నిదర్శనం.’’  అని  ఒక పోలీసు అధికారి పేర్కొనడం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలో  300 కేసులు నమోదవుతుండగా, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, నాంపల్లి, తదితర స్టేషన్ల పరిధిలో మరో  300 కేసులు నమోదవుతున్నాయి. నేరాల నమోదులో హైదరాబాద్‌ తరువాతి స్థానాన్ని మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఆక్రమిస్తోంది. అక్కడ  330 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో కాజీపేట్, వరంగల్‌ స్టేషన్లు ఉన్నాయి. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు, రైళ్లలో సీట్ల కోసం, బెర్తుల కోసం  వెతుక్కునేవారిని టార్గెట్‌గా చేసుకుంటున్న దొంగలు వారిని ఏ మార్చి బ్యాగులు, వస్తువులతో ఉడాయిస్తున్నారు.  

సిబ్బంది కొరత....
జీఆర్‌పీలో సిబ్బంది కొరత కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఏటా వేల సంఖ్యలో నేరాలు చోటు చేసుకుంటుండగా పోలీసులు మాత్రం వందల్లోనే ఉన్నారు. సికింద్రాబాద్‌ జీఆర్‌పీలో కనీసం 1000 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 400 మందితో నెట్టుకొస్తున్నారు. దీంతో స్టేషన్లలో భద్రత, అసాంఘిక శక్తులపైన నిఘా ఉంచడం కష్ట తరమవుతోంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, జీఆర్‌పీ పోలీసుల మధ్య సమన్వయ లేమి కూడా నేరగాళ్లకు కలిసి వస్తోంది. స్టేషన్లలో సీసీ కెమెరాలను పెంచాలని జీఆర్‌పీ అధికారులు చాలాకాలంగా  ఆర్‌పీఎఫ్‌ను కోరుతున్నారు. రైల్వే ట్రాక్‌లకు రెండు వైపులా  ఫెన్సింగ్‌ లేనందున తరచూ ఆత్మహత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సమీక్షల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ‘‘ ఇలాంటి భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకార లోపం సరైంది కాదు. ఇది లక్షలాది మంది ప్రయాణికులు, ప్రజల రక్షణకు సంబంధించిన అంశం. రైల్వే అధికారులు సైతం ఇలాంటి అంశాలపైన సీరియస్‌గా దృష్టి సారించాలి..’’ అని ఒక పోలీసు ఉన్నతాధికారి  ‘సాక్షి’తో పేర్కొన్నారు.   

నేరాల్లో ముఖ్యమైనవి..
గత నవంబర్‌ 11న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రేణుక అనే చిన్నారి అపహరణకు గురైంది. ఇప్ప టి వరకు ఆచూకీ లభించలేదు.
చత్తీస్‌గఢ్‌కు చెందిన సుమన్‌పాండే(8) రెండేళ్ల క్రితం  నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అపహరణకు గురయ్యాడు.
మెహదీపట్నంకు చెందిన యువతి(16) మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అదృశ్యమైంది.
బీహార్‌కు చెందిన జగదీశ్‌ పాశ్వాన్‌(16) సైతం  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో  కనిపించకుండా పోయాడు. నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌కు చెందిన బాలాజీ, నగరానికి చెందిన బన్నీ, మహబూబ్‌నగర్‌ కు చెందిన రాజు (11) వంటి రైల్వేస్టేషన్‌లలోనే  ఉన్నపళంగా మాయమయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రైల్వేపోలీసులు 25 మిస్సింగ్‌ కేసులు నమోదు చేశారు. రికార్డుల్లో నమోదు కాని వారు పదుల సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారుల అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement