శ్రీనివాస్, అనూషల పెళ్లి నాటి ఫొటో , శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసనదీక్ష చేపట్టిన అనూష
ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఓప్రభుద్ధుడు నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఏవేవో కారణాలు చెప్పి ఇద్దరు భార్యలకు విడాకులిచ్చాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇతగాడి బాగోతం తెలుసుకున్న మూడో భార్య.. ఆదివారంనగరంలోని భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు దిగింది.
హైదరాబాద్, లింగోజిగూడ: ముగ్గురిని పెళ్లి చేసుకుని 4వ పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న మూడో భార్య.. భర్త ఇంటి ముందు ఆదివారం నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాలు,కాలనీ వాసులు తెలిపిన మేరకు.. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌కాలనీ రోడ్ నెం–7లో నివాసముండే శ్రీనివాస్ యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతనికి ఇద్దరు మహిళలతో పెళ్లి జరుగగా విడాకులు తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణం శ్రీరమణకాలనీకి చెందిన అనూష అనే మహిళను పెద్దల సమక్షంలో మే 23, 2014న పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అనూష కుటుంబీకులు శ్రీనివాస్‌కు రూ. 5 లక్షలతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలను కట్న కానుకల కింద ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపించారు. రెండు సంవత్సరాల పాటు కాపురం సాపీగా సాగగా ఆ తరువాత అనూషకు వేధింపులు మొదలయ్యాయి. అత్తగారింటి వేధింపులకు తట్టుకోలేక కొంత కాలం నుంచి అనూష పుట్టింటి వద్దే ఉంటోంది.
4వ పెళ్లికి సిద్ధపడ్డాడని తెలిసి...
గతంలో జరిగిన పెళ్లిళ్లను దాచి అనూషను పెళ్లి చేసుకుని ఈమెను కూడా వదిలించుకోవడానికి విడాకుల నోటీసులు పంపించాడు. అంతేగాకుండా ఈ నెల 25న మరో మహిళతో 4వ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుని అనూష ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం భాగ్యనగర్ కాలనీలో అత్తగారింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన అనూష అక్కడే నిరసన దీక్ష చేపట్టింది. అత్త, భర్త, ఆడపడుచు, ఆమె భర్త చిత్ర హింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment