తార్నాక: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో అనూష అనే ఇంటర్ విద్యార్థినిని అతి కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓయూ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్శిగుట్ట అంబర్ నగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి హరిప్రసాద్ కుమార్తె అనూష నారాయణగూడలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది, అదే ప్రాంతానికి చెందిన ఆరెçపల్లి రవీందర్ కుమారుడు వెంకట్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. పదో తరగతిలో ట్యూషన్ సెంటర్‌లో వారి మధ్య ఏర్పడిన పరిచయం గత రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అనూష గత నెలరోజులుగా వెంకట్‌తో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు వెంకట్ పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనూషపై కోపాన్ని పెంచుకున్న వెంకట్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా జేబులో బ్లేడు పెట్టుకుని గత నెల రోజులుగా అనూష ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నాడు.
మంగళవారం అనూష తన స్నేహితురాలితో కలిసి వెళుతుండటాన్ని గుర్తించాడు. అనూష ఇంట్లోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలి వద్దకు వెళి బైక్ కీ లాక్కున్నాడు. అనూషను జామై ఉస్మానియా రోడ్డు వద్దకు తీసుకువస్తేనే బైక్ కీ ఇస్తానంటూ బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఈ విషయాన్ని అనూషకు చెప్పడంతో ఇద్దరూ కలిసి జామై ఉస్మానియా రోడ్డుకు వచ్చారు. అక్కడికి వచ్చిన వెంకట్ బైక్‌ను తిరిగి ఇవ్వడంతో అనూష స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం అనూషను దూర విద్యాకేంద్రం సమీపంలోని పాడుబడిన పోలీసు క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లిన వెంకట్ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.
‘నీవన్నా, నీ క్యారెక్టర్ అన్నా నాకు నచ్చడం లేదు. అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నానని’ అనూష చెప్పడంతో ఆగ్రహించిన అతను జేబులో ఉన్న బ్లేడ్ తీసి ఆమె గొంతుపై రెండు గాట్లు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన అనూష తనను చంపొద్దని వేడుకున్నా వినకుండా బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. స్పహకోల్పోయిన అనూషను మరో గదిలో పడేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, అప్పటికే ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి చేరుకున్న ముగ్గురు యువకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకట్‌ను అదుపులోకి తీసుకుని అనూషను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనూష కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో కాచిగూడ డివిజన్ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్‌స్పెక్టర్ జగన్ పాల్గొన్నారు.
పక్కా ప్లానింగ్
రెండేళ్లుగా ప్రేమించుకున్నాం. చివరకు నా కారెక్టర్ మంచిది కాదని.. నాతో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించాను. అయినా పట్టించుకోలేదు. నా ఫోన్‌కాల్స్ రిజెక్టులో పెట్టడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాను. పథకం ప్రకారమే రప్పించి హత్య చేశానని ఉన్మాది వెంకట్ పేర్కొన్నాడు. పాడుబడిన క్వార్టర్లలోకి తీసుకువెళ్లి అక్కడా అడిగాను.. అయినా ఆమె మనుసు మార్చుకోకుండా అలాగే మాట్లాడటంతో జేబులో నుంచి బ్లేడు తీసి గొంతుపై కోయడంతో భయపడిన అనూష .. ‘ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... నన్ను చంపొద్దు’ అంటూ వేడుకున్నా పట్టించుకోకుండా ఆమె గొంతును కోసినట్లు తెలిపాడు. అనంతరం ఆమెను మరో గదిలోకి ఈడ్చుకెళ్లి పడేసి పారిపోయేందుకు ప్రయత్నించానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment