టోనీ గ్యాంగ్‌.. టెర్రర్‌ | tony gang terror in proddatur | Sakshi
Sakshi News home page

టోనీ గ్యాంగ్‌.. టెర్రర్‌

Published Sat, Nov 4 2017 9:03 AM | Last Updated on Sat, Nov 4 2017 9:30 AM

tony gang terror in proddatur - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ గ్యాంగ్‌ల సంస్కృతి అధికంగా ఉంది. నాలుగేళ్ల క్రితం సునీల్‌ గ్యాంగ్‌ చేసిన అలజడి అంతా ఇంతా కాదు. అతని పేరెత్తితే చాలు వ్యాపారులు, సంపన్నులు వణికిపోయే పరిస్థితి ఉండేది. కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను వెంట పెట్టుకొని కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడ్డాడు. సునీల్‌ హవా నడుస్తున్న సమయంలోనే పప్పీ బ్యాచ్‌ పేరుతో మరో గ్యాంగ్‌ ఆగడాలు కూడా.. పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. ఈ సంఘటనలకు సంబంధించి అప్పట్లో పోలీసులు సుమారు 36 మంది విద్యార్థులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. దీంతో రెండు గ్యాంగ్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. పట్టణ ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలోనే.. మూడేళ్ల క్రితం టోనీ గ్యాంగ్‌ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి రెండు, మూడు నెలలకు ఒక సారి ఈ బ్యాచ్‌ పేరు వినిపిస్తూనే ఉంది. ఇందులో 30 మంది దాకా యువకులు ఉంటారు. కొందరు చిల్లరగా తిరిగే వారు, మరికొందరు చదువు మానేసిన వారు, ఇంకొందరు చిన్న చిన్న పనులు చేసుకునే వారు.. ఇలా వివిధ నేపథ్యం కలిగిన యువకులు బ్యాచ్‌గా ఏర్పడ్డారు. వీరికి టోనీ అనే యువకుడు నాయకుడు.

నాడు నడిరోడ్డుపై తన్నుకున్నారు
సుమారు రెండేళ్ల క్రితం టోనీ బ్యాచ్, శ్రీనివాసనగర్‌కు చెందిన విద్యార్థులు మైదుకూరు రోడ్డులోని జిన్నారోడ్డు సమీపంలో తన్నుకున్నారు. ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో మొదలైన క్రికెట్‌ మ్యాచ్‌ గొడవ మైదుకూరు రోడ్డుకు చేరింది. అక్కడ వారు బీరు సీసాలతో కొట్టుకున్న సీన్లు సినిమా ఫైట్లను తలపించాయి.

ఇంటి వద్ద ఉన్న వ్యక్తిని కొట్టి..
ఒక వ్యక్తిని టోనీ గ్యాంగ్‌ చితకబాది తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లె శ్రీనివాసులు అనే వ్యక్తి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని రామేశ్వరంపేటలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉన్నాడు. రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో ఐదుగురు యువకులు అక్కడికి వచ్చి ‘ఏ రా ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావా’ అని ప్రశ్నించారు. తన ఇల్లు ఇదేనని అతను బదులు ఇచ్చాడు. ‘అయినా ఈ సమయంలో మీరెందుకు ఇక్కడ తిరుగుతున్నారు’ అని శ్రీనివాసులు వారిని ప్రశ్నించడంతో.. ఒక్కసారిగా రాళ్లు తీసుకొని అతనిపై విసిరారు. ‘మేము ఎవరనుకున్నావ్‌ రా.. టోనీ గ్యాంగ్‌.. మమ్మల్నే ప్రశ్నిస్తావా..’ అంటూ  ఇష్టానుసారంగా కొట్టారు. తీవ్రంగా గాయ పడిన అతన్ని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లాలని సూచించారు. అతని తలకు, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో 15 కుట్లు పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికీ అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించినా.. వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

అధికార పార్టీ నాయకుల అండ
టోనీ బ్యాచ్‌ను అధికార పార్టీ నాయకులే పెంచి పోషిస్తూ, వారు చేసే ఆరాచకాలకు పరోక్షంగా కారకులు అవుతున్నారు. ప్రొద్దుటూరులో సీనియర్‌ నేతకు ప్రధాన అనుచరుడిగా ఉన్న.. ఓ మైనారిటీ నాయకుడి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెటిల్‌మెంట్ల సమయంలో భయపెట్టేందుకు టోనీ గ్యాంగ్‌ను వారు ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి ఆగడాలు కేవలం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే కొన సాగడం గమనార్హం.

పోలీసు అధికారికి తప్పుడు సమాచారం
వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏ కానిస్టేబు ల్‌ను అడిగినా టోనీ రెండేళ్ల నుంచి ఊరి లో లేడని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాడని చె బుతారు. సీఐకి కూడా సిబ్బంది, అధి కారులు ఇలానే తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించారు. అయితే అతను మాత్రం ప్రొద్దుటూరులో పబ్లిక్‌గా తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్‌కు వన్‌టౌన్‌లోని ఓ పోలీసు అధికారితోపాటు ఒక కానిస్టేబుల్‌ సహకారం ఉన్నట్లు స్టేషన్‌ సిబ్బంది చర్చించుకుంటున్నారు.

ఎందుకంత ప్రేమ
దాడులు చేస్తూ ప్రజలను భయపెడుతున్న టోనీ గ్యాం గ్‌పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు. ఈవ్‌టీజింగ్‌ పేరుతో అమాయకులను స్టేషన్‌కు తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొడుతున్న పోలీసులకు.. టోనీ గ్యాం గ్‌ ఆగడాలు కనిపించలేదా.  అధికార పార్టీ నాయకుల నీడలో టోనీ గ్యాంగ్‌ పని చేస్తోంది. వీరి చేతిలో ఇంకా ఎంత మంది ఆస్పత్రి పాలు కావాలి. వీరిని ఇలానే వదిలేస్తే ప్రజలు బయట నడిచే పరిస్థితి ఉండదు.    – వంగనూరు మురళీధర్‌రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్, ప్రొద్దుటూరు

భయపెడుతున్నారు  
టోనీ గ్యాంగ్‌ పేరుతో భయోత్పాతం సృ ష్టిస్తున్నారు. వీరితో భయపెట్టించి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఏం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో బ్యాచ్‌ల సంస్కృతిని కొందరు అధికార పార్టీ నాయకులు పెంచి పోషిస్తున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.  
 – పోసా భాస్కర్, కౌన్సిలర్, ప్రొద్దుటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement