రౌడీలూ ఖబడ్దార్
- హద్దుమీరితే పీడీ యాక్ట్
- తాజాగా రౌడీలు ఫిర్దౌస్, లతీఫ్, తన్వీర్‌పై ప్రయోగం
- చర్లపల్లి జైలుకు తరలింపు
- వీరిపై 12 ఠాణాల్లో 84 కేసులు: వెలుగు చూడని వందకు పైగానే
సాక్షి, సిటీబ్యూరో: సేఫ్ట్‌సిటీ-స్మార్ట్‌సిటీలో భాగంగా నగర పోలీసు లు మరో అడుగు ముందుకేశారు. ప్రజల రక్షణ, భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘికశక్తుల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు తదితర వరుస నేరాలకు పాల్పడుతూ ఇటు పోలీసులను, అటు ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్న కరుడుగట్టిన ముగ్గురు రౌడీషీటర్లపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏడుగురిపై ఈ చట్టం ప్రయోగించి జైలు కు తరలించారు. తాజాగా పీడీయాక్ట్ కింద మరో ముగ్గురిని డీసీపీ సత్య నారాయణ జైలుకు పంపారు.
బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫిర్దౌస్ (32), మల్లేపల్లికి చెందిన మహ్మద్ లతీఫ్ (32), ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ (26)లు రౌడీషీటర్లు. చిన్న చిన్న నేరాలకు పాల్పడి 12 ఏళ్ల క్రితం నేర జీవితాన్ని ప్రారంభించిన ఈ ముగ్గురు ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాళ్లుగా మారారు. వీరిపై పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, లంగర్‌హౌస్ గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, చిక్కడపల్లి, నాంపల్లి పోలీసు స్టేషన్ల మొ త్తం 84 కేసులున్నాయి. ఇందులో కొన్ని కేసులు సాక్షులను బేదిరించడం వల్ల వీగిపోయాయి. దీంతో వారిలో ధైర్యం రె ట్టింపై మరిన్ని నేరాలు చేయడం ప్రారంభించారు.
కిరాయి హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు, బెది రింపులు, కొట్లాటలు, హత్యాయత్నాలు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్టయిన ప్రతిసారి నెల రోజుల్లోనే జైలు నుంచి బెయిల్‌పై విడుదలై తిరిగి నేరాలు చే యడం విధిగా పె ట్టుకున్నా రు. రౌడీషీటర్లు జంగ్లీ యూ సుఫ్, చోర్ కౌసర్‌లతో పాటు యువతులతో వ్యభి చారం చేయిస్తున్న పల్లె సుధాకర్‌రెడ్డి, బోడ రాజులపై పోలీసులు గతంలో పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే.
ఫిర్దోస్‌పై 26 కేసులు....
రౌడీషీటర్ ఫిర్దోస్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, గోల్కొండ, చిక్కడపల్లి, నాంపల్లి, లంగర్‌హౌస్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లలో 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నాలు, దొంగతనాలు, దాడులు, బెదిరింపులు, ఆయుధాలు కలిగి ఉండటంలాంటి కేసులున్నాయి.
లతీఫ్‌పై 46 కేసులు...
అత్యధికంగా లతీఫ్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్,పంజగుట్ట, ఆసిఫ్‌నగర్, షాహినాత్‌గంజ్, నాంపల్లి, గో ల్కొండ, లంగర్‌హౌస్ బంజారాహిల్స్ ఠాణాలలో 46 క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో దాడులు, బెదిరిం పులు, హత్య లు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి.
తన్వీర్‌పై 14 కేసులు...
తన్వీర్‌పై ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్‌లలో 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నాలు, బెదిరింపులు తదితర నేరాలున్నాయి.
ప్రజల రక్షణే ధ్యేయం...
ప్రజల రక్షణే మా ధ్యేయం. మాపై నుమ్మకం ఉంచి ప్రభుత్వం పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తోంది. నగరాన్ని ప్రపంచంలోనే సేఫ్‌సిటీగా మార్చేం దు కు ఇప్పటికే ఎన్నో చర్యలు మొదలెట్టారు. సిబ్బంది, అధికారుల ప్రవర్తనలో కూడా మార్పులొస్తున్నాయి. ఫ్రెం డ్లీ పోలీసింగ్‌ను మరింత పెంచుతాం. దీంతో పాటు రౌడీమూకలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల ఉపేక్షించే ప్రసక్తేలేదు. రాజకీయ ఒత్తిళ్ల తలొగ్గం. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్
ఫిర్యాదు చేయాలన్నా భయమే....
పై దముగ్గురు రౌడీషీటర్ల ఆగడాలపై సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే వారిని బెదిరించడం, వారి పిల్లల్ని కిడ్నాప్ చేయడం వంటివి చేసేవారు. దీంతో వారి ఆగడాలు హద్దుమీరాయి. వారిపై ఫిర్యాదు చేయనిదే పోలీసులు కేసు నమోదు చేయలేరు. అధికారికంగా వారిపై ఇప్పటి వరకు 84 కేసులు నమోదు కాగా వెలుగు చూడని కేసులు వందకుపైగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ చట్టం కింద ఏడాది పాటు వీరు జైలులో ఉండాల్సిందే.