అమ్మో! అన్ని కిడ్నాప్లా! | Parliament Information | Sakshi
Sakshi News home page

అమ్మో! అన్ని కిడ్నాప్లా!

Published Wed, Jul 30 2014 8:36 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

అమ్మో! అన్ని కిడ్నాప్లా! - Sakshi

అమ్మో! అన్ని కిడ్నాప్లా!

న్యూఢిల్లీః  పార్లమెంటు ఉభయసభలు లోక్సభ, రాజ్యసభలలో ఈరోజు పలు అంశాలపై చర్చలు జరిగాయి. సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు.

* మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కిడ్నాప్‌లు, అపహరణ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,57,717 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు.

* దేశంలోని మావోయిస్టు గ్రూపుల్లో మావోయిస్టుల సంఖ్య సుమారు 8,500 ఉండొచ్చని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అయితే వీరికి మద్దతిచ్చే వారి సంఖ్య భారీగానే ఉండొచ్చని, ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు మావోయిస్టులు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

* సివిల్ సర్వీస్ విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కేటగిరికి చెందిన అధికారులు  2,751 మంది ఉన్నట్లు  కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఐఏఎస్ అధికారుల్లో 1,200, ఐపీఎస్ అధికారుల్లో 880, ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో 671 మంది ఉన్నట్లు వివరించింది.

* రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా(ఆర్‌ఎన్‌ఐ) వద్ద నమోదు చేసుకున్న పబ్లికేషన్ సంస్థల సంఖ్య 99,660 అని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. నాలుగేళ్లలో రిజిస్ట్రేషన్లు 28.79 శాతం పెరిగినట్లు తెలిపింది.

* కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) వద్ద 2012-13 సంవత్సరంలో 28,801 కొత్త కేసులు నమోదైనట్లు  కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ లోక్‌సభకు తెలిపారు.

* విదేశీ నిధులు (నియంత్రణ) చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద వార్షిక ఆదాయం వివరాలు సమర్పించని 21,493 స్వచ్చంద సంస్థల(ఎన్‌జీవోలు)కు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఎఫ్‌సీఆర్‌ఏ కింద 2014 జూలై 16 వరకూ నమోదు చేసుకున్న ఎన్‌జీవోల సంఖ్య 42,529 అని తెలిపారు.

* 39 సెంట్రల్ యూనివర్సీటీల్లో 16,692 అధ్యాపక పోస్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, వీటిలో 6,251 పోస్టులు (సుమారు 40 శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

* ఆరావళి పర్వత శ్రేణుల్లో చెట్ల అక్రమ నరికివేత, కూల్చివేతకు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6,206 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ కేసుల్లో నేరస్తుల నుంచి రూ. 1 కోటి 42 లక్షలు పరిహారంగా వసూలు చేసినట్లు తెలిపింది.

మహిళలు రాత్రిపూట కూడా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఓవర్‌టైమ్ గంటలను పెంచేందుకు వీలుగా ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement