పీఎన్‌కాలనీ(శ్రీకాకుళం): రాజాం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో ముఠాతగాదాలు మరోసారి ఇరిగేషన్ పనుల సాక్షిగా బట్టబయలయ్యాయి. కళావర్గానికి చెందిన రైతులు పనులకోసం దరఖాస్తు చేసుకుంటే వారిని కాదని ప్రత్యర్థి వర్గానికి చెందినవారికి పనులు దక్కడంతో వివాదం బహిర్గతమైంది. తమకు పనులు అప్పగంచకుంటే తాము సహించబోమని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌వద్ద ఆందోళన చేపట్టడమే గాకుండా, ఇరిగేషన్ ఉన్నతాధికారుల వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన హుద్‌హుద్ తుపానుకు చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. పంట భూముల్లో ఇసుక మేట్లు వేశాయి. రాజాం మండలంలో 25 పనులకు గ్రామ ఆయకట్టు భూముల కమిటీ కన్వీనర్ల ఆధ్వర్యంలో జరిపేందుకు రూ. కోటీ 30 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో కిమిడి కళావెంకటరావు వర్గానికి చెందిన రాజాం మండలంలో 11 గ్రామాల రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు రాజాం మండలం ఏఈ ఉదయ్‌భాస్కర్, డీఈ గణిరాజుకు దరఖాస్తు చేసుకోగా పనులు అప్పగిస్తామని చెప్పి రూ. 1.20లక్షలు తీసుకున్నారని రైతులు చెబుతున్నారు. డబ్బులు తీసుకుని తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని, 100రూపాయల బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకుని పనులు అప్పగిస్తామని నమ్మించి, రెండు నెలలు దాటినా పనులు అప్పగించకపోగా, ప్రత్యర్థి వర్గానికి చెందినవారికిపనులు అప్పగించడంతో వారంతా ఆందోళనకు సన్నద్ధమయ్యారు. సాక్షాత్తూ రాజాం, రేగిడి ఆమదాలవలస ఎంపీపీలు జడ్డు ఉషారాణి, కె రామకృష్ణనాయుడు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కలెక్టర్‌ను సోమవారం గ్రీవెన్స్‌లో సమస్యను వివరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకుని ఇరిగేషన్ కార్యనిర్వాహక అధికారి బి.రవీంద్ర వచ్చేంత వరకు కార్యాలయం వద్ద నిరీక్షించారు.
ఎట్టకేలకు సాయంత్రం ఆరుగంటలకు ఈఈ రాగా తమకు రావాల్సిన పనులు వేరొకరికి అప్పగించడంపై గట్టిగా నిలదీశారు. తమ దగ్గర డబ్బులు తీసుకుని, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని వేరొకరికి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ తమ సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తెలియదని, అది రుజువైతే కలెక్టర్ దృష్టిలో పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకు శాంతించని వారంతా తక్షణమే పనులైనా ఇవ్వాలనీ, లేకుంటే తామిచ్చిన కాగితాలైనా ఇచ్చి డబ్బులు వాపసుచేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేశారు. దీనిపై రెండు రోజుల్లో తగు చర్యలు తీసుకుంటానని సముదాయించడంతో వారంతా వెనుదిరిగారు.
పనులరద్దుకు కలెక్టర్ ఆదేశం
ఇదిలా ఉండగా పనుల విషయంలో తలెత్తిన వర్గపోరుకు కలెక్టర్ సోమవారం రాత్రి తెరదించారు. ఇప్పటివరకూ కేటాయించిన పనులు రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తరువాత న్యాయబద్ధంగా పనులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఇరిగేషన్‌లో పచ్చపోరు
Published Tue, May 19 2015 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement