జీరో గోల్డ్ దందా. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఇది ప్రధాన వ్యాపారం. ఈ చీకటి దందాలో దొంగా పోలీసాటలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన దోపిడీ నుంచి తాజాగా అదే రైలులో జరిగిన దోపిడీలో పోలీసులు కీలక పాత్రదారులుగా ఉండడం గమనార్హం. అంతా సినీ ఫక్కీలో జరిగే ఈ తంతులో బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు అమ్మకాలు చేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. బిల్లులు లేని జీరో దందా బంగారం వ్యాపార వ్యవహారాల్లో జరుగుతున్న సంఘటనలు ఆసక్తిగా ఉన్నాయి.
కావలి:కావలి పట్టణంలో చాలా మంది వ్యాపారస్తులు చెన్నై నుంచి బంగారం కొనుగోలు చేసి కావలికి తీసుకొస్తుంటారు. ఇందుకు నమ్మకస్తులైన వ్యక్తులను (సీజన్ బాయ్స్) ఏర్పాటు చేసుకొని వారికి నగదు ఇచ్చి, చెన్నైకు పంపి బంగారు బిస్కెట్లు కావలికి వచ్చేలా చేస్తుంటారు. 100 గ్రాముల బరువు ఉన్న బంగారు బిస్కెట్లను మాత్రమే తీసుకొచ్చి, వాటిని కావలి, నెల్లూరు, కందుకూరు, ఒంగోలు, చీరాల గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన పట్టణాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా అమ్మకాలు చేస్తుంటారు. బిల్లులు లేకుండా 100 గ్రాముల బిస్కెట్ బంగారం రూ.3,27,000 ధర ఉంటుంది. బిల్లులతో కొనుగోలు చేయాలంటే అన్ని రకాల పన్నులతో కలిసి రూ. 3.50 లక్షల వరకు ఉంటుంది. ఒక్కసారి చెన్నై ట్రిప్ వేస్తే కనీసం కేజీకి తక్కువ కాకుండా ఐదు కేజీలు వరకు తీసుకొస్తుంటారు. అంటే ట్రిప్పుకు సుమారు ఆదాయం రూ.2.30 లక్షలు నుంచి రూ.11.50 లక్షలు వరకు ఆదాయం ఉంటుంది. కుదిరితే నెలకు నాలుగు, ఐదు చెన్నై ట్రిప్పులు వేస్తారు. ప్రతి నెల రూ.వందల కోట్లు విలువ చేసే బంగారం చెన్నై నుంచి కావలికి వస్తోంది.
అనధికారికంగా పెద్ద మొత్తం తరలింపు
చెన్నైకి వెళ్లే వ్యక్తి కనీసం రూ.10 లక్షలు నుంచి రూ.2 కోట్ల వరకు నగదును ఎటువంటి లెక్కలు లేకుండా సంచుల్లో, బ్యాగ్‌ల్లో పెట్టుకొని సాధారణ ప్రయాణికుడిగా రైళ్లల్లో, బస్సుల్లో, అవసరమైతే కారుల్లో ప్రయాణం చేస్తుంటారు. బంగారు వ్యాపారస్తులతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారానే ఈ ప్రయాణ వివరాలు బయటకు తెలుస్తుంటాయి. కొందరు వీరి బలహీనతనే అస్త్రంగా వాడుకొని నగదును కాజేయాలనే వ్యక్తులు తయారయ్యారు. పలు సందర్భాల్లో కావలి– చెన్నై మధ్య ప్రయాణంలో అధికారులు తనిఖీలు చేసి కొంత నగదు తీసుకున్నారని, కొంత బంగారం తీసుకొన్నారని బంగారం వ్యాపారులకు సీజన్ బాయ్స్ చెబుతుంటారు. ఇవన్నీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖలకు చెందిన అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉండడంతో వారితో తలనొప్పులు ఎందుకులే అని బంగారు వ్యాపారులు సైలెంట్‌గా ఉండిపోతారు. నిజంగా తనిఖీ అధికారులు తీసుకొన్నారా, సీజన్ బాయ్స్ నొక్కేశారా అనేది కూడా తెలియని విధంగా అంతా గప్‌చుప్ అయిపోతారు. దీనిని ఆసరాగా తీసుకున్న సీజన్ బాయ్స్ అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు.
జీరో దందాపై పోలీస్ కన్ను
తొలుత జీరో దందాపై పోలీసుల కన్ను పడింది. సీజన్ బాయ్స్‌ను బెదిరించి వారి దగ్గర నుంచి బంగారం కానీ నగదును కానీ కాజేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అవి చిన్న మొత్తంలో ఉండడంతో వ్యాపారస్తులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేయడం ఆరంభించారు. అందులో భాగంగానే 2015లో కావలికి సీజన్ బాయ్స్ కోటి రూపాయలను వెంట పెట్టుకొని రైల్లో ప్రయాణం చేస్తుండగా, నెల్లూరు–పడుగుపాడు రైల్వేస్టేషన్ మధ్యలో పోలీసులు తాము తనిఖీ అధికారులమని చెప్పి బెదిరించారు. వారిని నెల్లూరు రైల్వేస్టేషన్‌లో దింపి కారులో ఎక్కించుకొని, వారి వద్ద ఉన్న నగదును తీసుకొన్నారు. జాతీయ రహదారిపై కావలి సమీపంలో ఆ వ్యక్తిని దింపి కారులో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పట్టణానికి చేరుకొన్న సీజన్ బాయ్స్ చెప్పడంతో కొందరు బంగారు వ్యాపారులు పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును, అందులోని వ్యక్తులను కందుకూరు–కనిగిరి మధ్య పట్టుకొన్నారు. నగదును కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఈ దందాలో ఒక ఓఎస్డీతో పాటు, ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.
తాజాగా బయట వ్యక్తుల ప్రాత్ర
తాజాగా ఈ నెల 17 వతేదీ కావలికి చెందిన పొన్నూరు మల్లికార్జురావు (పీఎంఆర్ జువలరీస్)అనే బంగారు వ్యాపారి తనతో సంబంధం ఉన్న మహిళ, ఆమె స్నేహితురాలు, ఒక సీజన్ బాయ్‌కి నగదు ఇచ్చి చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు కోసం పంపాడు. ఈ ఘటనలో కూడా టీడీపీ నాయకుడితో పాటు పోలీసులు సుమారు రూ. 50 లక్షలు అపహరించుకుపోయారు. దీనిపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేయగా కావలి రూరల్ మండలం చెన్నాయపాళెంకు చెందిన టీడీపీ నేత మర్రి రవితో పాటు, మరికొంత మంది పోలీసులు వ్యాపారికి సంబంధించిన మహిళతో మిలాఖత్ అయి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 50 లక్షలు అపహరించారని పోలీసుల విచారణలో వెల్లడయింది. అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ చీకటి వ్యాపారంలో ఒక్క పోలీస్ శాఖే కాదు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల పాత్ర కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment