దీర్ఘకాలికంగా పసిడి పది గ్రాముల ధర రూ. 65,000–67,000 దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే అంశాలను ఈ విధంగా వివరించింది. ‘గడిచిన దశాబ్దకాలంలో దేశీయంగా పసిడి 159 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో కీలకమైన స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 93 శాతమే. ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత నుంచి రక్షణనివ్వడంలో పసిడి స్టార్ పెర్ఫార్మర్‌గా నిల్చింది.
మధ్యమధ్యలో కాస్తంత తగ్గడం మినహా వార్షికంగా చూస్తే పుత్తడి ఇప్పటిదాకా మంచి రాబడులే ఇచ్చింది. డిమాండ్, పండుగల ఊతంతో నాలుగో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అధిక ధరలు, కరోనావైరస్‌పరమైన అంశాల కారణంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో మొత్తం మీద చూస్తే పసిడి వినియోగం తగ్గినప్పటికీ.. పెరుగుతున్న రేటు కారణంగా ఇన్వెస్టర్లు క్రమంగా పుత్తడి వైపు మళ్లడం వల్ల నాణేలు, కడ్డీలకు మాత్రం డిమాండ్ పెరిగింది.
అనిశ్చితి పరిస్థితుల కారణంగా పుత్తడి ధర అంతర్జాతీయంగా ఔన్సు (33.1 గ్రాములు)కి 2,085 డాలర్లు, దేశీయంగా పది గ్రాములకు రూ. 56,400 గరిష్ట స్థాయిలను తాకి ప్రస్తుతం ఒక శ్రేణిలో తిరుగాడుతోంది. సెంట్రల్ బ్యాంకుల విధానాలు, తక్కువ వడ్డీ రేట్లు.. రాబడులు, మార్కెట్లోకి నిధుల వెల్లువ, కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలు దీర్ఘకాలంలో పసిడి రేట్లకు ఊతమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రూ. 49,500–48,500 దాకా తగ్గినప్పుడల్లా కొంతకొంతగా కొనుగోలు చేయొచ్చు. స్వల్పకాలికంగా రూ. 52,000–53,000 దాకా పెరగవచ్చు. దీర్ఘకాలికంగా మాత్రం పది గ్రాములకు రూ. 65,000–67,000 స్థాయికి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 2,500 డాలర్ల అంచనాలను కొనసాగిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment