Fourth Quarter
-
పేటీఎం అమ్మకాల్లో 40 శాతం వృద్ధి..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన స్థూల అమ్మకాలు (జీఎంవీ) 40 శాతం వృద్ధి చెందాయి. విలువపరంగా క్రితం క్యూ4లో రూ. 2.59 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగాయి. సమీక్షాకాలంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే యూజర్ల సంఖ్య (ఎంటీయూ) 27 శాతం పెరిగి 9 కోట్లకు చేరిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేమెంట్ డివైజ్‌ల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య 2022 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 10 లక్షలు పెరిగి 68 లక్షలకు చేరినట్లు వివరించింది. పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా రుణ వితరణ పరిమాణం రూ. 3,553 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 12,554 కోట్లకు ఎగిసిందని తెలిపింది. -
ఫ్యూచర్ సప్లైకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 624 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించిన రుణ నష్టం ప్రధానంగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్.. దివాలా చట్ట చర్యలను ఎదుర్కొంటోంది. కాగా.. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో ఫ్యూచర్ సప్లై కేవలం రూ. 19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తం ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 134 కోట్లకు పరిమితమైంది. 2020–21 క్యూ4లో ఫ్యూచర్ సప్లై రూ. 150 కోట్ల ఆదాయం సాధించింది. బోర్డులో ఖాళీల కారణంగా సమావేశాన్ని నిర్వహించలేకపోవడంతో క్యూ4 ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ బాటలో గ్రూప్‌లోని పలు కంపెనీల క్యూ4 ఫలితాలు సైతం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 28.5 వద్ద ముగిసింది. -
క్షీణతలోకి అమెరికా ఎకానమీ
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణించింది. బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ (బీఈఏ) తుది సమీక్ష (మూడవ దఫా అంచనాల సవరణ) అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు క్రితం మైనస్ 1.5 శాతం గణాంకాలను ఎగువముఖంగా సవరించడం జరిగింది. వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో అమెరికా ఎకానమీ మాంద్యంలోకి జారిపోతుందన్న ఆందోళనలు నేపథ్యంలో తాజా ఫలితాలు వెలువడ్డం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతను నమోదుచేస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. మార్చి నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ ఓవర్‌నైట్ వడ్డీరేటు 150 బేసిస్ పాయింట్లు పెంచిన (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) సంగతి తెలిసిందే. ఎకానమీ మైనస్‌లోకి జారుతున్నా, దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ అధికారులు పరిస్థితిని పక్కదారిపట్టిస్తున్నారన్న విమర్శలూ నెలకొనడం గమనార్హం. మేలో రిటైల్ అమ్మకాలు పడిపోయాయి. గృహ నిర్మాణం, అనుమతులు తగ్గిపోయాయి. జూన్‌లో వినియోగ విశ్వాసం 16 నెలల కనిష్టానికి పడిపోయింది. వినియోగ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి ఎగసింది. క్యూ1లో వాణిజ్యలోటు భారీగా పెరగడం (3.2 శాతం) ఎకానమీకి ప్రతికూలంగా మారింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ 6.9 శాతం పటిష్ట వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. -
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
రెండేళ్లలో కో–లివింగ్ రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్ మార్కెట్ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని కొలియర్స్ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్ వేవ్ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. -
టాటా కన్జూమర్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ..టాటా కన్జూమర్ నాలుగో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నష్టాల నుంచి బయటపడి రూ. 74 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 122 కోట్ల నికర నష్టం నమోదైంది. దేశీయంగా అమ్మకాల పరిమాణం రెండంకెల వృద్ధిని సాధించడం ప్రభావం చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం ఎగసి రూ. 3,037 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.05 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. క్యూ4లో దేశీ ఆహారం, పానీయాల విభాగాలలో 20 శాతంపైగా పురోగతిని అందుకున్నట్లు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గ్రూప్ సీఎఫ్‌వో ఎల్.కృష్ణకుమార్ పేర్కొన్నారు. నాన్‌బ్రాండెడ్ బిజినెస్ టాటా కాఫీ ప్లాంటేషన్ సైతం పటిష్ట పనితీరు చూపడం ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. టాటా కన్జూమర్ గతంలో టాటా బెవరేజెస్‌గా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. కాగా.. క్యూ4లో మొత్తం వ్యయాలు 29 శాతం పెరిగి రూ. 2,818 కోట్లను తాకాయి. విభాగాల వారీగా దేశీయంగా పానీయాల విభాగం 60 శాతం జంప్‌చేసి రూ. 1,205 కోట్లను తాకగా.. ఫుడ్ బిజినెస్ 22 శాతం పుంజుకుని రూ. 642 కోట్లకు చేరింది. వీటిలో సాల్ట్ అమ్మకాలు 17 శాతం, సంపన్ విభాగం ఆదాయం 26 శాతం చొప్పున ఎగసింది. అయితే అంతర్జాతీయ పానీయాల బిజినెస్ యథాతథంగా రూ. 875 కోట్లుగా నమోదైంది. టాటా స్టార్‌బక్స్ ఆదాయం 14 శాతం బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి టాటా కన్జూమర్ నికర లాభం రెట్టింపై రూ. 930 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 11,602 కోట్లకు చేరింది. టాటా కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం బలపడి రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 655–638 మధ్య ఊగిసలాడింది. -
1946 తరువాత ఎన్నడూ లేనంత పతనం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
పుత్తడి @ 67,000
దీర్ఘకాలికంగా పసిడి పది గ్రాముల ధర రూ. 65,000–67,000 దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే అంశాలను ఈ విధంగా వివరించింది. ‘గడిచిన దశాబ్దకాలంలో దేశీయంగా పసిడి 159 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో కీలకమైన స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 93 శాతమే. ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత నుంచి రక్షణనివ్వడంలో పసిడి స్టార్ పెర్ఫార్మర్గా నిల్చింది. మధ్యమధ్యలో కాస్తంత తగ్గడం మినహా వార్షికంగా చూస్తే పుత్తడి ఇప్పటిదాకా మంచి రాబడులే ఇచ్చింది. డిమాండ్, పండుగల ఊతంతో నాలుగో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అధిక ధరలు, కరోనావైరస్పరమైన అంశాల కారణంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో మొత్తం మీద చూస్తే పసిడి వినియోగం తగ్గినప్పటికీ.. పెరుగుతున్న రేటు కారణంగా ఇన్వెస్టర్లు క్రమంగా పుత్తడి వైపు మళ్లడం వల్ల నాణేలు, కడ్డీలకు మాత్రం డిమాండ్ పెరిగింది. అనిశ్చితి పరిస్థితుల కారణంగా పుత్తడి ధర అంతర్జాతీయంగా ఔన్సు (33.1 గ్రాములు)కి 2,085 డాలర్లు, దేశీయంగా పది గ్రాములకు రూ. 56,400 గరిష్ట స్థాయిలను తాకి ప్రస్తుతం ఒక శ్రేణిలో తిరుగాడుతోంది. సెంట్రల్ బ్యాంకుల విధానాలు, తక్కువ వడ్డీ రేట్లు.. రాబడులు, మార్కెట్లోకి నిధుల వెల్లువ, కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలు దీర్ఘకాలంలో పసిడి రేట్లకు ఊతమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రూ. 49,500–48,500 దాకా తగ్గినప్పుడల్లా కొంతకొంతగా కొనుగోలు చేయొచ్చు. స్వల్పకాలికంగా రూ. 52,000–53,000 దాకా పెరగవచ్చు. దీర్ఘకాలికంగా మాత్రం పది గ్రాములకు రూ. 65,000–67,000 స్థాయికి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 2,500 డాలర్ల అంచనాలను కొనసాగిస్తున్నాం. -
టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.9,864 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్లో రూ.1,109 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా మోటార్స్ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలంతో దేశీయ వ్యాపారమే కాకుండా లగ్జరీ కార్ల విభాగం, జేఎల్ఆర్ వ్యాపారం కూడా దెబ్బతినడంతో గత క్యూ4లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.86,422 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.62,493 కోట్లకు తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఒత్తిడి, బీఎస్–సిక్స్ నిబంధనల అమలు కారణంగా నిల్వలకు సంబంధించి సమస్యలకు తోడు లాక్డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా పడిపోయాయని వెల్లడించింది. చైనాలో సేల్స్ పుంజుకుంటున్నాయని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ పేర్కొన్నారు. ► జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)కు గత క్యూ4లో 50 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 4,750 కోట్లు) నికర నష్టాలు, 540 కోట్ల పౌండ్ల (సుమారు రూ.51,300 కోట్లు) ఆదాయం వచ్చింది. ► స్డాండ్ అలోన్ పరంగా, 2018–19 క్యూ4లో రూ.106 కోట్ల నికర లాభం రాగా, గతేడాది క్యూ4లో రూ.4,871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.28,724 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,975 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.61 లక్షల కోట్లకు తగ్గింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5% నష్టంతో రూ.100 వద్ద ముగిసింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజ్‌లో లిస్టైన టాటా మోటార్స్ ఏడీఆర్ మాత్రం 7% ఎగసి ఏడు డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
భారీ లాభాల్లో లుపిన్
భారత మూడో అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్ లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ 48శాతం నికర లాభాలను నమోదుచేసింది. లుపిన్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాలో ఎక్కువ ఫార్మా అమ్మకాలు నమోదు కావడంతో, ఈ జనవరి-మార్చి త్రైమాసిక లాభాలు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి రూ.807 కోట్ల నికర లాభాలను లుపిన్ చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లుపిన్ కు రూ.547 కోట్ల నికర లాభాలున్నాయి. అయితే థామ్సన్ రాయిటర్స్ కేవలం రూ.678 కోట్ల లాభాలు మాత్రమే కంపెనీకి వస్తాయని అంచనావేసింది. విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ లుపిన్ దూసుకుపోయింది. ఈ ఫలితాలతో స్టాక్ మార్కెట్లో లుపిన్ షేర్లు లాభపడ్డాయి. రూ.6.85 లాభపడి, రూ.1,645గా ముగిసింది. ఇటీవల నెలల్లో అమెరికాలో కొత్త ఔషధాలకు కంపెనీకి అనుమతులు ఎక్కువగా లభించడంతో, లుపిన్ బాగా లాభపడింది. అయితే చాలా కంపెనీలు అమెరికాలో అనుమతులు పొందలేక రెగ్యులేటరీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. -
లాభాల్లో దూసుకెళ్లిన హెచ్ యూఎల్
ముంబై : దేశ అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్ యూఎల్) లాభాల్లో దూసుకెళ్లింది. గడిచిన ఆర్థికసంవత్సర నాలుగో త్రైమాసిక పలితాల్లో హెచ్ యూఎల్ లాభాలు 7శాతం జంప్ అయ్యాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి,నికర లాభాలను రూ.1,090 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.1,018 కోట్లగా ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, నిల్వవుంచే ఆహార ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ లాభాలు పెరిగినట్టు హెచ్ యూఎల్ వెల్లడించింది. ఈ లాభాలతో కంపెనీ ఆదాయం 3.5శాతం వృద్ధితో రూ.7,675 కోట్ల నుంచి రూ.7,946 కోట్లకు ఎగబాకింది. అయితే ఈ త్రైమాసికంలో వాల్యుమ్ పెరుగుదల కొంత నిరాశపరిచింది. గతేడాది 6శాతంగా ఉన్న వాల్యుమ్ వృద్ధి ఈ ఏడాది 4 శాతం మాత్రమే నమోదుచేశాయి. -
మహీంద్రా లైఫ్ స్పేస్ లాభం 59% అప్
న్యూఢిల్లీ: మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 59 శాతం పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 31 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.49 కోట్లకు పెరిగిందని మహీంద్రా లైఫ్ స్పేస్ తెలిపింది. ఆదాయం రూ.259 కోట్ల నుంచి రూ.266 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎండీ, సీఈఓ అనిత అర్జున్‌దాస్ పేర్కొన్నారు. 60 శాతం డివిడెండ్‌ను(రూ.10 డివిడెండ్ గల ఒక్కో షేర్‌కు రూ.6) ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ 3.47 శాతం వృద్ధితో రూ.460కు పెరిగింది. -
మారుతీ లాభం 12% డౌన్
క్యూ4లో రూ.1,134 కోట్లు ♦ హర్యానాలో రిజర్వేషన్ల ఆందోళనలు; ♦ అధిక ప్రచార వ్యయాల ప్రభావం ♦ ఆదాయం మాత్రం 13 శాతం వృద్ధి; రూ.14,930 కోట్లు ♦ షేరుకి రూ.35 చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ లాభాలకు బ్రేక్ పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,284 కోట్లతో పోలిస్తే... 12 శాతం దిగజారింది. గడచిన ఎనిమిది త్రైమాసికాల్లో కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం 2013-14 ఏడాది నాలుగో త్రైమాసికంలో మారుతీ లాభం పడిపోయింది. ప్రధానంగా హరియాణాలో జాట్ల రిజర్వేషన్ ఆందోళనలతో ఉత్పత్తికి అంతరాయం కలగడం, ప్రచార వ్యయాలు భారీగా పెరగడం, ఇతర ఆదాయం తగ్గడం వంటివి లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. జాట్ల ఆందోళనల కారణంగా క్యూ4లో 10,000 యూనిట్ల మేర ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అయితే, మారుతీ మొత్తం ఆదాయం మాత్రం క్యూ4లో 12.5 శాతం ఎగబాకి రూ.14,930 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.13,273 కోట్లుగా ఉంది. అత్యధిక వార్షిక లాభాల రికార్డు... 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మారుతీ నికర లాభం 23.2 శాతం ఎగబాకి రూ.4,571 కోట్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా కొత్త రికార్డు నమోదైంది. 2014-15 ఏడాదికి కంపెనీ లాభం రూ.3,711 కోట్లుగా నమోదైంది(ఇదే ఇప్పవరకూ అత్యధిక లాభం). మొత్తం ఆదాయం 16% వృద్ధితో రూ.48,606 కోట్ల నుంచి రూ.56,350 కోట్లకు ఎగసింది. కాగా, రాయల్టీ రూపంలో మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు గతేడాది 6%(మొత్తం ఆదాయంలో) చెల్లించినట్లు మారుతీ తెలిపింది. 2014-15లో రాయల్టీ చెల్లింపు 5.7 శాతంగా ఉంది. అమ్మకాలు ఇలా: క్యూ4లో కంపెనీ కార్ల అమ్మకాలు 3.9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 3,60,402 కార్లను కంపెనీ విక్రయించింది. 27,009 కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇక 2015-16 పూర్తి ఏడాదిలో మారుతీ అమ్మకాల సంఖ్య రికార్డు స్థాయిలో 14,29,248కి చేరింది. 10.6 శాతం వృద్ధి నమోదైంది. 1,23,897 వాహనాలను ఎగుమతి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ‘కొత్త మోడళ్ల విడుదల... నెట్వర్క్ విస్తరణతో అమ్మకాలు జోరందుకున్నాయి. అదేవిధంగా ముడి ఉత్పత్తుల వ్యయం తగ్గడంతో పాటు వ్యయాల తగ్గింపునకు చేపట్టిన చర్యలు లాభాలకు దన్నుగా నిలిచాయి. విటారా బ్రెజా, బాలెనోల విడుదల కారణంగా అడ్వర్టైజింగ్ వ్యయం పెరిగింది.’ అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 700 శాతం డివిడెండ్... గడచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపై మారుతీ రూ.35 చొప్పున(700 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. 2014-15లో డివిడెండ్ 500 శాతం(రూ.25)గా ఉంది. మారుతీ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 3.62 శాతం లాభపడి రూ.3,869 వద్ద ముగిసింది. ఈ ఏడాది రూ.4,400 కోట్ల పెట్టుబడి.. ఆర్థిక వ్యవస్థ కాస్త మందగమనంలో ఉన్నప్పటికీ... గత ఏడాది తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించగలిగామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మా వంతు సహకారాన్ని అందిస్తున్నాం. పలు ప్రతికూల పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ... ఈ ఏడాది కూడా మా అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4,400 కోట్ల మేరకు పెట్టుబడులను వెచ్చించనున్నాం. గుజరాత్ ప్లాంట్ నిర్మాణ పనులు అనుకున్నదానికంటే జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరికల్లా(వాస్తవ షెడ్యూలు మే నెల) ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. మరోపక్క, గుర్గావ్, మానెసర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తిని పెంచడం ద్వారా కస్టమర్లకు వెయిటింగ్ వ్యవధిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాం’ అని భార్గవ వివరించారు. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 14.3 లక్షల యూనిట్లు కాగా, దీన్ని 15.7 లక్షల యూనిట్లకు పెంచాలనేది కంపెనీ ప్రణాళిక. కాగా, ఆఫ్రికాలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని మారుతీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే చిన్న వాణిజ్య వాహనా(ఎల్సీవీ)న్ని దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫేస్బుక్ లాభాలు.. రూ. 4300 కోట్లు!
సామాజిక వెబ్సైట్లలో బహుళ ప్రాచర్యం పొందిన ఫేస్బుక్ రోజు రోజుకు తన వినియోగదారులను పెంచుకోవడంతోపాటు లాభాల్లో కూడా దూసుకెళుతోంది. నాలుగో క్వార్టర్లో ఏకంగా 4300 కోట్ల రూపాయల (701 మిలియన్ డాలర్ల) లాభాలను సాధించడం విశేషం. ఇది గత ఏడాది నాలుగవ త్రైమాసికంలో సాధించిన లాభాలకన్నా 34 శాతం అధికం. ఈ త్రైమాసికంలో వ్యాపార ప్రకటనల రెవె న్యూ 53 శాతం పెరగడం అధిక లాభాలకు దోహదపడింది. 53 శాతమంటే 3. 59 డాలర్ల రెవెన్యూ పెరిగినట్టు. ఇందులో 70 శాతం రెవెన్యూ కేవలం మొబైల్ వ్యాపార ప్రకటన వల్లనే వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలియశాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు యాక్టివ్ వినియోగదారులు 1.39 బిలియన్ మంది ఉన్నారు. ఏడాదికేడాది వీరి సంఖ్య 13 శాతం పెరుగుతూ వస్తోందని, 2014 సంవత్సరానికి మొత్తానికి 2.9 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయని, ఇది 2013 సంవత్సరానికి వచ్చిన మొత్తం లాభాలకు దాదాపు రెట్టింపని ఫేస్బుక్ సీఈఓఫే మార్క్ జుకర్‌బెర్గ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నికర లెక్కల్లే చూస్తే మాత్రం కంపెనీకి ప్రతి డాలర్‌పై వచ్చే లాభం గతేడాదితో పోలిస్తే 44 శాతం నుంచి 29 శాతానికి పడిపోయిందని, దానికి కారణం ‘పరిశోధన- అభివృద్ధి, మార్కెటింగ్‌పై ఎక్కువ పెట్టుబడులు పెట్టటమే కారణమని ఆయన వివరించారు. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసిక కాలంలో ‘పరిశోధన-అభివృద్ధి’ కి నిధులను మూడింతలు పెంచామని, అంటే దాదాపు 1.1 బిలియన్ డాలర్లను వెచ్చించామని తెలిపారు. -
8 శాతం తగ్గిన ఎస్బీఐ నికర లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం నాలుగో త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 3,041 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. అంతకుముందు త్రైమాసికంలో రూ. 3,299 కోట్లు ఆర్జించింది. బ్యాంకు మొత్తం ఆదాయం ఏడాది కాలంలో రూ. 36,331 కోట్ల నుంచి రూ.42,443 కోట్లకు పెరిగింది. నెట్ ఇంట్రస్ట్ ఆదాయం 16.4 శాతం పెరిగి రూ.12,903 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది రూ.11,591కోట్లకు పరిమితమైంది. మొండిబకాయిలు పెరగడం వల్ల ఎస్బీఐ నికర లాభం తగ్గిపోయింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్
2014-15 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రుణాల పునర్వ్యవస్థీకరణ కూడా తగ్గొచ్చు. రిటైల్ రుణాల్లో ప్రస్తుతం వృద్ధి జోరు ఇదేవిధంగా కొనసాగనుంది. అదేవిధంగా నికర వడ్డీ మార్జిన్లు కూడా ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.2,652 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.2,304 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఫీజులు ఇతరత్రా రూపంలో లభించిన వడ్డీయేతర ఆదాయం భారీగా ఎగబాకడం... బ్యాంక్ లా భాల జోరుకు దోహదం చే సింది. కాగా, క్యూ4లో కంపెనీ మొత్తం ఆదా యం రూ.14,465 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.12,574 కోట్ల ఆదాయంతో పోలిస్తే 15 శాతం మేర వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదా యం క్యూ4లో 15 శాతం పెరుగుదలతో రూ.4,357 కోట్లకు చేరింది. ఇక వడ్డీయేతర ఆదాయం ఏకంగా 35 శాతం ఎగబాకి రూ.2,976 కోట్లుగా నమోదైంది. ఫీజుల రూపంలో రూ.1,974 కోట్లు(12 శాతం వృద్ధి), ట్రెజరీ ఆదాయం రూ.245 కోట్లు చొప్పున లభించాయి. ఇక అనుబంధ సంస్థల నుంచి బ్యాంకుకు రూ.541 కోట్ల భారీ డివిడెం డ్ మొత్తం జమ అయింది. పూర్తి ఏడాదికి ఇలా.... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ స్డాండెలోన్ నికర లాభం రూ.9,810 కోట్లకు ఎగసింది. 2012-13 ఏడాదిలో నమోదైన రూ.8,325 కోట్లతో పోలిస్తే లాభం 18% పెరిగింది. మొత్తం ఆదా యం విషయానికొస్తే... రూ.48,421 కోట్ల నుంచి 54,606 కోట్లకు(12%) వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన... మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రూ.2,724 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,492 కోట్లతో పోల్చిచూస్తే 9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.20,240 కోట్ల నుంచి రూ.21,653 కోట్లకు పెరిగింది. 7 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2013-14 పూర్తి ఏడాదికి లాభం రూ.9,604 కోట్ల నుంచి రూ.11,041 కోట్లకు(15% వృద్ది) ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.74,204 కోట్ల నుంచి రూ.79,564 కోట్లకు(7.2 శాతం అప్) పెరిగింది. నికర మొండిబకాయిలు పెరిగాయ్... మార్చితో ముగిసిన కాలానికి ఐసీఐసీఐ నికర మొండిబకాయిలు(ఎన్పీఏ)లు రూ.3,321 కోట్లకు(0.82 శాతం) పెరిగాయి. డిసెంబర్ చివరినాటికి రూ.3,121 కోట్లు(0.81%), క్రితం ఏడాది మార్చి చివరినాటికి రూ.2,234 కోట్లు(0.64%)గా నికర ఎన్పీఏలు నమోదయ్యాయి. కాగా, క్యూ4లో తాజాగా రూ.1,241 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. దీంతో స్థూల మొండిబకాయిలు మార్చి చివరినాటికి 3.03 శాతానికి చేరాయి. డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే దాదాపు అదేస్థాయిలోనే నమోదయ్యాయి. క్యూ4లో రూ.400 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోవడం దీనికి దోహదం చేసింది. కాగా, క్యూ4లో రూ.700 కోట్ల విలువైన ఎన్పీఏలను బ్యాంక్ ఖాతాలనుంచి తొలగించింది(రైట్ ఆఫ్). రూ.2,156 కోట్ల విలువైన రుణాలను పునర్వ్యవస్థీకరించడంతో 2013-14 పూర్తి ఏడాదికి ఈ విధమైన రుణాల మొత్తం రూ.10,558 కోట్లకు ఎగబాకింది. మరో 1,500 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ బాటలో ఉన్నాయి. 2012-13 మార్చి క్వార్టర్లో రూ.460 కోట్లుగా ఉన్న ఎన్పీఏలపై ప్రొవిజనింగ్ ... 2013-14 మార్చి క్వార్టర్లో రూ.714 కోట్లకు పెరగడంతో లాభాలపై ప్రభావం చూపింది. ఇతర ముఖ్యాంశాలివీ... 2013-14 పూర్తి ఏడాదికి ఐసీఐసీఐ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.23 డివిడెండ్‌ను ప్రకటించింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ క్యూ4లో 3.35 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం 0.22 శాతం పెరిగి 3.33 శాతానికి చేరింది. 2013-14 ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణాలు 17% వృద్ధి చెంది రూ.3,38,703 కోట్లకు పెరిగాయి. ప్రధానంగా రిటైల్ రుణాల్లో 23% వృద్ధి సాధించింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.3,31,914 కోట్లకు ఎగబాకాయి. అనుంబంధ సంస్థల విషయానికొస్తే... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం గ డచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,496 కోట్ల నుంచి రూ.1,567 కోట్లకు పెరిగింది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ నికర లాభం రూ.306 కోట్ల నుంచి రూ.511 కోట్లకు వృద్ధి చెందింది. క్యూ4లో బ్యాంక్ కొత్తగా 653 శాఖలు, 834 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. దీంతో మార్చినాటికి ఐసీఐసీఐ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 3,753కు, ఏటీఎంల సంఖ్య 11,315కు చేరాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 2.29% క్షీణించి రూ.1,269 వద్ద స్థిరపడింది. -
బంగారం డిమాండ్ పరుగే..!
ముంబై: బంగారానికి 2013 నాల్గవ త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్, క్యూ4) డిమాండ్ కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనావేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ 15% పెరుగుతుందని విశ్లేషించింది. 250-300 టన్నుల డిమాండ్ ఉండొచ్చని డబ్ల్యూజీసీ ఎండీ(ఇండియా) సోమసుందరం పీఆర్ మంగళవారం తెలిపారు. తగిన వర్షపాతం, పండుగల సీజన్ వంటి అంశాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. ప్రస్తుతం బంగారం ధరలు తగిన స్థాయిలోనే ఉన్నాయని వివరిస్తూ, కొనుగోళ్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఏడాది మొత్తంమీద ఈ డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ ఉంటుందని అంచనావేశారు. సెంటిమెంట్ దృష్ట్యా బంగారం కొనుగోళ్లను ప్రజలు కొనసాగిస్తున్నారని, డిమాం డ్కు అనుగుణంగా రిటైలర్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని సోమసుందరం అన్నారు. 2012 క్యూ4లో భారత్‌లో పసిడి డిమాండ్ 260 టన్నులు. మొత్తం ఏడాదిలో ఈ డిమాండ్ 863 టన్నులు.