భారీ లాభాల్లో లుపిన్
భారత మూడో అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్ లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ 48శాతం నికర లాభాలను నమోదుచేసింది. లుపిన్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాలో ఎక్కువ ఫార్మా అమ్మకాలు నమోదు కావడంతో, ఈ జనవరి-మార్చి త్రైమాసిక లాభాలు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి రూ.807 కోట్ల నికర లాభాలను లుపిన్ చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లుపిన్ కు రూ.547 కోట్ల నికర లాభాలున్నాయి.
అయితే థామ్సన్ రాయిటర్స్ కేవలం రూ.678 కోట్ల లాభాలు మాత్రమే కంపెనీకి వస్తాయని అంచనావేసింది. విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ లుపిన్ దూసుకుపోయింది. ఈ ఫలితాలతో స్టాక్ మార్కెట్లో లుపిన్ షేర్లు లాభపడ్డాయి. రూ.6.85 లాభపడి, రూ.1,645గా ముగిసింది. ఇటీవల నెలల్లో అమెరికాలో కొత్త ఔషధాలకు కంపెనీకి అనుమతులు ఎక్కువగా లభించడంతో, లుపిన్ బాగా లాభపడింది. అయితే చాలా కంపెనీలు అమెరికాలో అనుమతులు పొందలేక రెగ్యులేటరీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.